logo

గురువుల మోములో సంతోషం

జిల్లాలో ఎట్టకేలకు ఉపాధ్యాయుల ఉద్యోగోన్నతుల ప్రక్రియ ప్రశాంతంగా పూర్తయింది. ఈనెల 7న ప్రభుత్వం షెడ్యూల్‌ విడుదల చేయగా, 8వ తేదీ నుంచి ప్రక్రియ మొదలైంది.

Published : 20 Jun 2024 02:25 IST

ప్రశాంతంగా ముగిసిన ఉపాధ్యాయుల ఉద్యోగోన్నతులు

ఖమ్మం విద్యావిభాగం, న్యూస్‌టుడే: జిల్లాలో ఎట్టకేలకు ఉపాధ్యాయుల ఉద్యోగోన్నతుల ప్రక్రియ ప్రశాంతంగా పూర్తయింది. ఈనెల 7న ప్రభుత్వం షెడ్యూల్‌ విడుదల చేయగా, 8వ తేదీ నుంచి ప్రక్రియ మొదలైంది. ఈసారైనా ఉద్యోగోన్నతులు సజావుగా జరుగుతాయన్న నమ్మకం ఉపాధ్యాయుల్లో లేదు. దినదిన గండంగా కొనసాగింది. కోర్టు నుంచి ఎప్పుడు ఏ ఉత్తర్వు వచ్చి ఆగిపోతుందోనన్న ఆందోళన ఉపాధ్యాయ వర్గాల్లో నెలకొంది. మంగళవారం సైతం ఈ ప్రక్రియ నిలిచిపోయిందన్న ప్రచారం విస్తృతంగా జరిగింది. కానీ కొనసాగటంతో ఊపిరి పీల్చుకున్నారు. ఉత్తర్వుల కోసం అనేక మంది ఉత్కంఠతో ఎదురుచూశారు. అనేక చిక్కుముళ్లు ఎదురైనప్పటికీ జిల్లా విద్యాశాఖ అధికారులు చాలా వరకు వాటిని పరిష్కరించగలిగారు. సుదీర్ఘ కాలం తర్వాత ఉద్యోగోన్నతులు పొందే అవకాశం లభించటంతో ఉపాధ్యాయ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ, స్థానిక సంస్థల యాజమాన్యాల పరిధిలోని  పాఠశాలల్లో పని చేస్తున్న తెలుగు, హిందీ, ఉర్దూ ఉపాధ్యాయులతో పాటు పీడీలు, వివిధ సబ్జెక్టుల వారికి ఉద్యోగోన్నతుల భాగ్యం దక్కింది. 

జిల్లాలో 954 మందికి... ఉద్యోగోన్నతులు పొందిన వారికి జిల్లా విద్యాశాఖ అధికారులు బుధవారం ఉత్తర్వులు ఇచ్చారు. వీరిలో 875 మంది ఉపాధ్యాయులు రిలీవ్‌ అయ్యారు. ఉద్యోగోన్నతులు తీసుకున్న అనంతరం కేటాయించిన పాఠశాలల్లో చేరారు. ఉద్యోగోన్నతులు ఇష్టం లేనివారు ఎంతమంది ఉన్నారనే విషయం గురించి గురువారం తెలుస్తుంది. జిల్లాలో 984 మందికి ఉద్యోగోన్నతుల అవకాశం ఉంది. కానీ వీరిలో 954 మంది మాత్రమే అర్హులు ఉన్నారు. ఎస్సీ, పీహెచ్‌సీల్లో అర్హులైన వారు లేకపోవటంతో 30 పోస్టులు బ్యాక్‌లాగ్‌ అయ్యాయి. అర్హత ఉన్నప్పటికీ తమకు ఉద్యోగోన్నతులు లభించలేదని ఇద్దరు, ముగ్గురు ఉపాధ్యాయులు జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖరశర్మకు అప్పీల్‌ చేసినట్లు తెలిసింది. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించి వివరాలను పరిశీలించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.  

ఉద్యోగోన్నతులు ఇలా... స్థానిక సంస్థలు... గణితం: 70, బయాలజికల్‌ సైన్స్‌: 87, సాంఘికశాస్త్రం: 138, ఆంగ్లం: 17, తెలుగు: 211, హిందీ: 194, పీడీలు: 94, పీఎస్‌ హెచ్‌ఎం: 76, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌: 07

ప్రభుత్వ పాఠశాలలు... గణితం: 08, బయాలజీ: 12, సాంఘికశాస్త్రం: 07, ఆంగ్లం: 04, తెలుగు: 12, హిందీ: 05, పీడీ: 09, ఉర్దూ: 01,    బయాలజీ(ఉర్దూ): 01, సాంఘికశాస్త్రం(ఉర్దూ): 01.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని