logo

రైతులకు అందుబాటులో గింజలు

వానాకాలం వచ్చిందంటే చాలామంది రైతులు విత్తనాల కోసం ఎదురుచూడటం సహజం. ప్రధానంగా పచ్చిరొట్ట గింజలు, రాయితీ విత్తనాలు, ఇతర గింజలపై రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థపైనే ఆధారపడతారు.

Published : 20 Jun 2024 02:28 IST

‘న్యూస్‌టుడే’తో విత్తనాభివృద్ధి సంస్థ మేనేజర్‌ ఎన్‌.భిక్షం
ఖమ్మం వ్యవసాయం, న్యూస్‌టుడే

వానాకాలం వచ్చిందంటే చాలామంది రైతులు విత్తనాల కోసం ఎదురుచూడటం సహజం. ప్రధానంగా పచ్చిరొట్ట గింజలు, రాయితీ విత్తనాలు, ఇతర గింజలపై రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థపైనే ఆధారపడతారు. వర్షాలు కురవగానే పచ్చిరొట్ట విత్తనాల కొనుగోలుకు ఆసక్తి చూపుతారు. గతేడాదితో పోల్చితే ఈసారి పక్షం రోజుల ముందే రుతుపవనాలు ప్రవేశించాయి. కొన్ని ప్రాంతాల్లో సరిపడా విత్తనాలు దొరక్క అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం విత్తనాల సరఫరా ఎలా ఉందనే అంశంపై ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల విత్తనాభివృద్ధి సంస్థ మేనేజర్‌ ఎన్‌.భిక్షం ‘న్యూస్‌టుడే’తో ముచ్చటించారు. ఆ వివరాలు మీ కోసం.. 

విత్తనోత్పత్తికే ఎంజీజీ-299 రకం పెసర గింజలు

ఏటా వానాకాలంలో పంటల సాగుకు ముందే పచ్చిరొట్ట విత్తనాలు ఏమేరకు అవసరమో వ్యవసాయశాఖ నుంచి విత్తనాభివృద్ధి సంస్థకు ప్రతిపాదనలు అందుతాయి. అందుకు తగ్గట్టు విత్తనాలు సేకరించి రైతులకు సరఫరా చేస్తాం. ఇప్పటికే ఉభయ జిల్లాల్లో 90 శాతం విత్తనాలను అందజేశాం. పెసరలో ఎంజీజీ-295 రకం విత్తనాలు కేవలం 44 క్వింటాళ్లు మాత్రమే ఉన్నాయి. వీటిని విత్తనోత్పత్తికి వినియోగించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. అందుకే వాటిని రైతులకు సరఫరా చేయలేకపోతున్నాం. ఎంజీజీ-385 రకం పెసర విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. వీటిని అన్నదాతలకు అందజేస్తున్నాం. 

అమ్మకానికి సిద్ధంగా ఉన్నవి ఇవే..

వరిలో బీపీటీ-5204, ఆర్‌ఎన్‌ఆర్‌-15048, ఎంటీయూ-1010, ఎంటీయూ-1041 తదితర రకాలు అందుబాటులో ఉన్నాయి. పెసరలో ఎంజీజీ-295, ఎంజీజీ-385, మినుములో పీయూ-31, టీబీజీ-104, జీబీజీ-1, కందుల్లో ఐసీపీఎల్‌-87119, ఎల్‌ఆర్‌జీ-52, వేరుసెనగలో గిరినార్‌-5 లాంటి రకాలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి.

ఉభయ జిల్లాల్లో ఇలా..

ఖమ్మం జిల్లాలో జీలుగులు 19,100 క్వింటాళ్లు అవసరమని వ్యవసాయశాఖ చెబుతోంది. ఇప్పటివరకు 15,108 క్వింటాళ్లను రైతులు కొన్నారు. మరో 209 క్వింటాళ్ల నిల్వలు ఉన్నాయి. పిల్లి పెసర విత్తనాలు 240 క్వింటాళ్ల అవసరమవగా 171 క్వింటాళ్లు వచ్చాయి. ఇవి మొత్తం అమ్ముడుపోయాయి. జనుములు 1,860 క్వింటాళ్లకు 1,806 క్వింటాళ్లు రాగా 1,702 క్వింటాళ్లను అన్నదాతలు కొనుగోలు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జీలుగులు 3,900 క్వింటాళ్లకు 3,424 క్వింటాళ్లు వచ్చాయి. 3,340 క్వింటాళ్లను రైతులు కొన్నారు. పిల్లిపెసర 72 క్వింటాళ్లు రావాల్సి ఉంది. జనుములు 422 క్వింటాళ్లకు 376 క్వింటాళ్లు వచ్చాయి. ఇవి మొత్తం అమ్ముడుపోయాయి. 


బకాయిలేమీ లేవు

తర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకునే విత్తనాలకు సంబంధించి బకాయిలు ఉండటం వల్లే ఈసారి తక్కువ మొత్తంలో గింజలు వస్తున్నాయనే వాదనలు తప్పు. న్యూదిల్లీ, హరియాణా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్‌ లాంటి రాష్ట్రాల నుంచి పచ్చిరొట్ట విత్తనాలను ఏటా దిగుమతి చేసుకుంటాం. గతేడాది బకాయిలను ప్రభుత్వం చెల్లించింది. ఇప్పుడు బకాయిలు లేవు. విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా సరఫరా చేసే గింజలు వ్యవసాయశాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఆగ్రోస్‌ లాంటి సంస్థల్లో ఈకేంద్రాలున్నాయి. ఖమ్మం జిల్లాలో 75, భద్రాద్రి జిల్లాలోని 23 సేల్‌ పాయింట్ల ద్వారా వీటిని సరఫరా చేస్తున్నాం.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని