logo

ఖాకీల కన్నుసన్నల్లోనే..!

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పేకాట స్థావరాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్నాయి. పొరుగు రాష్ట్రాల నుంచి ఖరీదైన వాహనాల్లో తరలివస్తున్న జూదరులు.. దర్జాగా పేకాడుతున్నారు.

Published : 20 Jun 2024 02:34 IST

ఈటీవీ, ఖమ్మం 

  • సత్తుపల్లి నియోజకవర్గంలో ఓ పేకాట స్థావరంపై పోలీసులు ఇటీవల దాడి చేశారు. తెలంగాణ, ఏపీకి చెందిన పలువురు జూదరులను అదుపులోకి తీసుకున్నారు. పేకాట స్థావరం వైపు కన్నెత్తి చూడకుండా స్థానిక పోలీసు అధికారికి భారీ మొత్తంలో ముట్టజెప్పామని విచారణలో తేలటంతో టాస్క్‌ఫోర్స్‌ అధికారులు నివ్వెరపోయారు. ఈవ్యవహారం జిల్లా పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై సమగ్ర విచారణ జరుగుతోంది. 
  • భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో అనేక చోట్ల పేకాట జోరుగా సాగుతోంది. ఇందుకోసం తెలంగాణతో పాటు ఏపీ, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల నుంచి ఖరీదైన కార్లలో జూదరులు వస్తుండటం గమనార్హం. ఒక్కోచోట రోజూ రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు చేతులు మారుతున్నా నమోదవుతున్న కేసులు అంతంతమాత్రమే. స్థానిక పోలీసులతో నిర్వాహకులకు సత్సంబంధాలు ఉండటమే దీనికి కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. 

మ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పేకాట స్థావరాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్నాయి. పొరుగు రాష్ట్రాల నుంచి ఖరీదైన వాహనాల్లో తరలివస్తున్న జూదరులు.. దర్జాగా పేకాడుతున్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాల్సిన పోలీసుశాఖ చేష్టలుడిగి చూస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిత్యం ఏదో ఒకచోట దాడులు జరుగుతున్నా.. సూత్రధారులు, నిర్వాహకుల జోలికి వెళ్లకపోవటం విమర్శలకు తావిస్తోంది. ఇటీవల ఒకట్రెండు చోట్ల వెలుగుచూసిన ఘటనలు పోలీసుల నిబద్ధతను వేలెత్తి చూపుతున్నాయి. ఉభయ జిల్లాల్లో సగానికి పైగా మండలాల్లో ఇలాంటి దందా సాగుతుండటం గమనార్హం. ఖమ్మం నగరం, ఇతర పట్టణాల్లో ఖరీదైన హోటళ్లు, స్థిరాస్తి వెంచర్లు, ఫామ్‌ హౌస్‌ల్లో స్థావరాలు ఏర్పాటు చేస్తున్నారని సమాచారం.  

నిర్వాహకులను వదిలేస్తున్నారు..

ఉభయ జిల్లాల్లో పేకాట స్థావరాలు, నిర్వాహకులకు సంబంధించిన సమగ్ర సమాచారం పోలీసుల వద్ద ఉంది. అయినా పేకాటకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట పడటం లేదు. పోలీసులు, నిర్వాహకులకు మధ్య ఆర్థిక లావాదేవీలే ఇందుకు కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అడపాదడపా దాడులు నిర్వహించి కొందరు జూదరులపై కేసులు నమోదు చేస్తున్నారన్న అపవాదును పోలీసులు మూటగట్టుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో నిర్వాహకులకు అన్నివిధాలా అండదండలు అందించిన పోలీసు అధికారులు.. బదిలీపై వేరేచోటుకు వెళ్లినా ఇక్కడి సిబ్బంది సాయంతో ఎప్పటికప్పుడు నిర్వాహకులకు సమాచారం చేరవేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పలుమార్లు పోలీసుల దాడుల్లో పెద్దమొత్తంలో పట్టుబడిన నగదు, ఖరీదైన వాహనాలనూ తప్పించి నిందితుల నుంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతున్నట్లు సమాచారం.


త్తుపల్లి సబ్‌ డివిజన్‌లో పేకాటపై ప్రత్యేక నిఘా ఉంచుతున్నాం. పేకాట స్థావరాలపై దాడులు చేస్తున్నాం. జూదరులు, నిర్వాహకులనూ అదుపులోకి తీసుకుంటున్నాం. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించబోం.

ఎ.రఘు, ఏసీపీ, కల్లూరు 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని