logo

చెత్తశుద్ధి.. ఆదాయవృద్ధి.. ఆరోగ్య సిద్ధి

గ్రామాలను స్వచ్ఛనిలయాలుగా మార్చేందుకు పంచాయతీల్లో సెగ్రిగేషన్‌ షెడ్ల నిర్మాణానికి గతంలో ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 481, ఖమ్మం జిల్లాలో 589 సెగ్రిగేషన్‌ షెడ్లు నిర్మించింది.

Published : 20 Jun 2024 02:38 IST

ఈనాడు డిజిటల్, కొత్తగూడెం

గ్రామాలను స్వచ్ఛనిలయాలుగా మార్చేందుకు పంచాయతీల్లో సెగ్రిగేషన్‌ షెడ్ల నిర్మాణానికి గతంలో ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 481, ఖమ్మం జిల్లాలో 589 సెగ్రిగేషన్‌ షెడ్లు నిర్మించింది. ఇళ్ల నుంచి సేకరించిన తడి, పొడి చెత్త ద్వారా ఆదాయం సృష్టించుకోవాలని ప్రణాళిక రూపొందించింది. ఆరంభంలో బాగా పనిచేసినా కాలక్రమేణా వీటి నిర్వహణ గాడితప్పింది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించటం, కిందిస్థాయి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా అనేక గ్రామపంచాయతీలు చెత్త సేకరణ ద్వారా ఆశించిన స్థాయిలో ఆదాయం సాధించలేకపోతున్నాయి. కొన్ని గ్రామపంచాయతీలు మాత్రం చెత్త నుంచి మంచి రాబడి పొందుతూ ఔరా అనిపిస్తున్నాయి. తద్వారా పారిశుద్ధ్యంతో పాటు గ్రామస్థుల ఆరోగ్యం మెరుగుపడుతోందని అధికారులు చెబుతున్నారు.

ఖమ్మం జిల్లాలో కల్లూరు ప్రథమం

ఇళ్లు, దుకాణ సముదాయాల నుంచి సేకరించిన చెత్త ద్వారా ఆదాయం పొందుతున్న గ్రామ పంచాయతీల్లో ఖమ్మం జిల్లాలో కల్లూరు ప్రథమ స్థానంలో ఉంది. మూడేళ్లలో రూ.2.18 లక్షల ఆదాయాన్ని సముపార్జించింది. ‘వ్యర్థం.. ఆదాయం కావాలి’ అనే నినాదంతో పంచాయతీ సిబ్బంది తడి, పొడి చెత్తను వేరుచేస్తూ సంపదను సృష్టించారు. వర్మీ కంపోస్టు ఎరువును హరితహారం కార్యక్రమంలో ఉపయోగించుకొని సత్ఫలితాలు సాధించారు. ప్లాస్టిక్‌ వ్యర్థాలను కాల్చకుండా నిల్వ చేసి వాటిని అమ్మటం ద్వారా ఆదాయాన్ని పెంచగలిగారు. ఇదేమాదిరిగా మూడేళ్లలో తల్లాడ గ్రామపంచాయతీ రూ.43వేలు, ఎర్రుపాలెం- రూ.38వేలు, నేలకొండపల్లి- రూ.37వేలు, పోలెపల్లి-   రూ.36వేల సంపదను సృష్టించాయి.


ఔరా.. అశ్వాపురం

ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తే మెరుగైన ఫలితాలను రాబట్టవచ్చునని భద్రాద్రి జిల్లా అశ్వాపురం గ్రామపంచాయతీ నిరూపిస్తోంది. మూడేళ్లల్లో రూ.2.76 లక్షల ఆదాయం సాధించి జిల్లాలోనే మొదటి స్థానంలో నిలిచింది. సేకరించిన చెత్తను అనేక గ్రామాల్లో కాల్చివేస్తూ కాలుష్యానికి కారణమవుతుంటే.. ఇక్కడ మాత్రం చెత్తను ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. 2 వేల కుటుంబాలు, సుమారు 130 దుకాణ సముదాయాలున్న ఈగ్రామంలో నిత్యం పంచాయతీ వాహనాల ద్వారా చెత్తను సేకరిస్తారు. తడి చెత్తను వర్మీకంపోస్టుగా మార్చుతుండగా.. పొడి చెత్తను నిల్వ చేస్తారు. పెద్దమొత్తంలో నిల్వలు పేరుకుపోయినప్పుడు తూకం వేసి విక్రయిస్తారు. వచ్చిన సొమ్మును పంచాయతీ జనరల్‌ ఫండ్‌లో జమ చేస్తారు. జిల్లాలో గతేడాది చెత్త సేకరణ ద్వారా సారపాక- రూ.66వేలు, మొండికుంట- రూ.42వేలు, అశ్వారావుపేట- రూ.23వేలు, సుజాతనగర్‌- రూ.23వేలు, చర్ల పంచాయతీ రూ.15వేల ఆదాయాన్ని సాధించాయి.


చెత్త సేకరణ ద్వారా వచ్చే ఆదాయం కొంతే అయినా గ్రామంలో పారిశుద్ధ్యం ఎంతో మెరుగుపడుతుంది. అశ్వాపురం చెత్త నిర్వహణపై సీఎం క్యాంప్‌ కార్యాలయం, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు ఆరా తీయటం సంతృప్తినిస్తోంది. 

కృష్ణ, పంచాయతీ కార్యదర్శి, అశ్వాపురం


చెత్త సేకరణ ద్వారా రాబడితో పాటు గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగవుతుంది. అనేక గ్రామాల్లో వ్యర్థ పదార్థాల నిర్వహణ సరిగ్గా లేదు. కొన్ని పెద్ద పంచాయతీల్లో మాత్రమే చెత్త ద్వారా ఆదాయం వస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని చిన్నచిన్న గ్రామాలు మూడు లేదా నాలుగింటి చెత్తను ఒకచోటుకు చేర్చి ఆదాయ మార్గాలు అన్వేషించేలా ప్రణాళిక రూపొందిస్తున్నాం. 

చంద్రమౌళి, డీపీఓ, భద్రాద్రి కొత్తగూడెం 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని