logo

నకిలీ నోట్ల చలామణి ముఠా అరెస్టు

నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ఓ ముఠాను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. స్థానిక ఠాణాలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఐ రాయల వెంకటేశ్వర్లు వివరాలు వెల్లడించారు.

Updated : 21 Jun 2024 05:44 IST

ముగ్గురి రిమాండ్, మరొకరు పరారీ

ముఠా వివరాలు వెల్లడిస్తున్న సీఐ రాయల వెంకటేశ్వర్లు 

సుజాతనగర్, న్యూస్‌టుడే: నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ఓ ముఠాను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. స్థానిక ఠాణాలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఐ రాయల వెంకటేశ్వర్లు వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. సుజాతనగర్‌ మండలం సీతంపేటబంజర గ్రామానికి చెందిన మాలోతు రాంప్రసాద్, బానోత్‌ శ్రీనులకు సత్తుపల్లి మండలం బుగ్గపాడుకు చెందిన మంచాల వ్యాపారి బెజవాడ సురేశ్‌కుమార్‌తో ఏడాది క్రితం పరిచయం ఏర్పడింది. సురేశ్‌కుమార్‌ సిద్ధిపేటకు చెందిన రాకేశ్, ఏపీలోని రాజమహేంద్రవరానికి చెందిన పెద్దగౌళ్ల వంశీకృష్ణ, కాకినాడకు చెందిన సింగంశెట్టి సత్య ఫణికుమార్‌లతో ముఠాగా ఏర్పడి కొంతకాలంగా రాజమహేంద్రవరం కేంద్రంగా నకిలీనోట్ల చలామణి దందా సాగిస్తున్నాడు. రూ.లక్ష కరెన్సీ నోట్లకు రూ.3 లక్షల విలువైన నకిలీ నోట్లు ఇస్తానని రాంప్రసాద్, శ్రీనులను సురేశ్‌కుమార్‌ నమ్మించాడు. వారి వద్దనుంచి రూ.7.50 లక్షలు వసూలు చేసి మోసం చేశాడు. దీంతో బాధితులు స్థానిక పోలీసులను ఆశ్రయించారు. వారు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇదే క్రమంలో మండలంలోని నాయకులగూడెం వద్ద నకిలీ నోట్లు చలామణి చేసేందుకు వచ్చిన నలుగురు సభ్యుల ముఠాను ఎస్సై జుబేదాబేగం బృందం చాకచక్యంగా పట్టుకుంది. నిందితుల్లో ఒకడైన రాకేశ్‌ పరారు కాగా సురేశ్‌కుమార్, వంశీకృష్ణ, సత్య ఫణికుమార్‌లను అరెస్టు చేసినట్లు సీఐ వెల్లడించారు. నిందితుల వద్ద రూ.4 లక్షలను, మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నిందితులను రిమాండ్‌కు పంపనున్నట్లు తెలిపారు. ముఠాను చాకచక్యంగా పట్టుకున్న ఎస్సై జుబేదాబేగం, ఏఎస్సై రామకృష్ణ బృందాన్ని సీఐ అభినందించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని