logo

విద్యుదాఘాతంతో ఇద్దరు ఆర్టిజన్లకు గాయాలు

పాల్వంచ కేటీపీఎస్‌లోని ఓఅండ్‌ఎం కర్మాగారంలో గురువారం స్వీచ్‌యార్డు ఏరియాలో విద్యుదాఘాతంతో ఇద్దరు ఆర్టిజన్లు గాయాలపాలయ్యారు.

Published : 21 Jun 2024 02:12 IST

తీవ్రంగా గాయపడిన కార్తిక్‌  

పాల్వంచ, న్యూస్‌టుడే: పాల్వంచ కేటీపీఎస్‌లోని ఓఅండ్‌ఎం కర్మాగారంలో గురువారం స్వీచ్‌యార్డు ఏరియాలో విద్యుదాఘాతంతో ఇద్దరు ఆర్టిజన్లు గాయాలపాలయ్యారు. వివరాలిలా ఉన్నాయి. కర్మాగారంలో పనిచేస్తున్న ఆర్టిజన్లు జూలకంటి కార్తిక్, వెంకన్నలు గురువారం ఉదయం 10.20 గంటల సమయంలో ఫీడర్‌ ఎర్తింగ్‌ చేశారు. ఆ సమయంలో వారు లైన్‌ క్లియర్‌(ఎల్‌సీ) తీసుకోలేదు. ఈ ప్రమాదంలో కార్తిక్‌ రెండు చేతులు, ముఖంపై గాయాలుకాగా, వెంకన్నకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే కేటీపీఎస్‌ అధికారులు క్షతగాత్రులను సంస్థ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వెంకన్నను ఇంటికి పంపించారు. కార్తిక్‌ను మెరుగైనచికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చేర్పించారు. కర్మాగార అధికారులు ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ విద్యుదాఘాతంతో గాయాలపాలైన ఉద్యోగికి మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు.


బస్టాండులో దోపిడీ... 

నలుగురు యువకుల రిమాండ్‌

ఖమ్మం నేరవిభాగం, న్యూస్‌టుడే: ఖమ్మం పాత బస్టాండులో నిద్రిస్తున్న వ్యక్తిని బెదిరించి దోచుకున్న నలుగురు యువకులను ఖమ్మం ఒకటో పట్టణ పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. ఇన్‌స్పెక్టర్‌ ఉదయ్‌కుమార్‌ కథనం ప్రకారం... జూలూరుపాడు మండలం రాంపురం తండాకు చెందిన వాంకుడోతు కిశోర్‌ తన కుమార్తె వైద్యం కోసం ఖమ్మం వచ్చాడు. కుమార్తె నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, భార్య ఆమె వద్ద ఉంది. తాను అక్కడ పడుకునే వీలు లేక పాత బస్టాండుకు వచ్చి పడుకున్నాడు. నిద్రిస్తున్న అతనిని నలుగురు యువకులు బెదిరించి చరవాణి, రూ.10 వేల నగదు దోచుకున్నారు. బాధితుని ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించారు. దీనిలో నమోదైన నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన హరీశ్, హుస్సేన్, రహెమాన్, నవాబ్‌లను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారిని న్యాయస్థానంలో హాజరుపరిచినట్లు ఇన్‌స్పెక్టర్‌ వివరించారు. 


అదుపుతప్పిన ద్విచక్రవాహనం.. యువకుడి దుర్మరణం

పినపాక, న్యూస్‌టుడే: అదుపుతప్పిన ద్విచక్రవాహనం చెట్టును ఢీకొనడంతో యువకుడు మృతి చెందిన ఘటన భద్రాద్రి జిల్లా పినపాక మండలం ఐలాపురం వద్ద బుధవారం అర్దరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తూరు గ్రామానికి చెందిన మద్దెల సదీన్‌(23) లారీ డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. మణుగూరు నుంచి ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి బయల్దేరిన అతడు ఐలాపురం మలుపు వద్ద వాహనం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టి సుమారు 10 అడుగుల గోతిలో పడిపోయాడు. తీవ్రగాయాలతో ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. తండ్రి వెంకన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం మణుగూరు తరలించినట్లు ఎస్‌ఐ వెంకటప్పయ్య తెలిపారు.


అనుమానాస్పదస్థితిలో జేపీఏ మృతి

పాల్వంచ గ్రామీణం, న్యూస్‌టుడే: అనుమానాస్పదస్థితిలో కేటీపీఎస్‌ ఉద్యోగి మృతిచెందిన ఘటన పట్టణంలోని ఇంటర్‌మీడియట్‌ కాలనీలో చోటుచేసుకుంది. మండలంలోని కొత్తసూరారం గ్రామానికి చెందిన బానోత్‌ భీమ్‌జీ(42) కేటీపీఎస్‌ ఐదు, ఆరు దశల్లో జూనియర్‌ ప్లాంట్‌ అటెండెంట్‌(జేపీఏ)గా విధులు నిర్వహిస్తున్నాడు. ఐఎం కాలనీలోని 176వ నంబరు క్వార్టర్‌లో కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. గురువారం ఉదయం 7.30 గంటల సమయంలో మంచం మీద కదల్లేని పరిస్థితుల్లో ఉన్న భీమ్‌జీని గమనించిన అతని కుమారుడు సుబ్బు తన పెదనాన్న రామోజీకి ఫోన్‌లో సమాచారం అందించాడు. ఆయన వెంటనే వచ్చి కేటీపీఎస్‌ ఆసుపత్రికి తరలించగా అప్పటికే జేపీఏ మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. భీమ్‌జీ మెడపై గాయాలుండటంతో అతని మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ సోదరుడు ఎస్సై బి.రాముకు ఫిర్యాదు చేశారు. ఆయన కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  


అత్యాచారయత్నంపై కేసు 

ములకలపల్లి, న్యూస్‌టుడే: ఒంటరి మహిళపై అత్యాచారానికి యత్నించిన వ్యక్తిపై గురువారం కేసు నమోదైంది. ఎస్సై రాజమౌళి తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన ఒంటరి మహిళపై అదే గ్రామానికి చెందిన కాకటి సాయి గురువారం అత్యాచారానికి యత్నించాడు. తప్పించుకున్న మహిళ సాయి తల్లిదండ్రులకు విషయం తెలపగా, వారు ఆ మహిళను అసభ్య పదజాలంతో దూషించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు సాయి, అతడి తల్లిదండ్రులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.


ఉరేసుకొని యువతి బలవన్మరణం 

దామరచర్ల, న్యూస్‌టుడే: ఉరేసుకొని యువతి బలవన్మరణానికి పాల్పడిన ఘటన గురువారం నల్గొండ జిల్లా దామరచర్లలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన దొడ్ల సురేష్‌.. యాదాద్రి థర్మల్‌ పవర్‌ విద్యుత్‌ కేంద్రంలో ఉద్యోగం చేస్తూ దామరచర్లలో నివాసముంటున్నారు. ఆయన పాల్వంచకు చెందిన ప్రియాంక(34)తో సహజీవనం సాగిస్తున్నట్లు సమాచారం. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈక్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన ప్రియాంక అద్దెకు ఉంటున్న ఇంట్లో చున్నీతోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కొద్దిసేపటి తర్వాత గమనించిన సురేష్‌ కిందకు దించి 108 వాహన సిబ్బందికి సమాచారమందించారు. అప్పటికే ప్రియాంక మృతిచెందినట్లు 108 సిబ్బంది గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం మిర్యాలగూడకు తరలించారు. ప్రియాంక మృతికి గల కారణాలు తెలుసుకునేందుకు సురేష్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈఘటనకు సంబంధించి ఇప్పటివరకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. 


అప్పు చెల్లించేందుకు నిరాకరణ..

మనస్తాపంతో మహిళ బలవన్మరణం 

కూసుమంచి, న్యూస్‌టుడే: అప్పుగా తీసుకున్న డబ్బు తిరిగిచ్చేదే లేదంటూ ఓ వ్యక్తి దబాయించటంతో మనస్తాపానికి గురైన మహిళ అదే ఇంట్లో ఫ్యానుకు చీరతో ఉరివేసుకొని బలవన్మరణానికి యత్నించింది. అనంతరం చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసుల కథనం మేరకు సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పాలేరుకు చెందిన బోయ సీత (36) నుంచి సమీప బంధువు, ఆటో డ్రైవర్‌గా చేస్తున్న అదే గ్రామానికి చెందిన పులగరి వీరబాబు, అతని సతీమణి మహేశ్వరి రూ.2.30 లక్షలు అప్పుగా తీసుకున్నారు. చెల్లించమని అడగ్గా ఇస్తామంటూ జాప్యం చేస్తున్నారు. ఈనెల 11న అప్పు తీర్చమని వెళ్లిన సీతతో వీరబాబు, మహేశ్వరి ఘర్షణపడ్డారు. డబ్బు ఇచ్చేది లేదని నిరాకరించారు. మీ ఇంట్లోనే చస్తానంటూ హెచ్చరించినా.. చస్తే చావు అంటూ దంపతులు ఇద్దరూ బయటకు వెళ్లిపోయారు. అవమానంగా భావించిన సీత అదే ఇంట్లో చీరతో ఫ్యానుకు ఉరివేసుకొంది. గమనించిన వీరబాబు తల్లి సుశీల కేకలు వేయడంతో పొరుగువారు వచ్చి 108 వాహనంలో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం ప్రయివేటు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతిచెందింది. మృతురాలి సోదరుడు నాగేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 


ద్విచక్ర వాహన చోరీ ముఠా అరెస్టు

మోతుగూడెం, న్యూస్‌టుడే: అల్లూరి సీతారామరాజు జిల్లా వై.రామవరం మండలం బొడ్డగండి పంచాయతీ డొంకరాయి పోలీస్‌ స్టేషన్‌ ఎదురుగా ఉన్న చెక్‌పోస్టు వద్ద ఎస్సై శివకుమార్‌ తన సిబ్బందితో గురువారం వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ తనిఖీల్లో అయిదు కేజీల గంజాయిని రవాణా చేస్తున్న అయిదుగురిని, నాలుగు ద్విచక్ర వాహనాలను అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో వెల్లడైన విషయాలు ఇలా ఉన్నాయి. డొంకరాయి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రాజుక్యాంపు గ్రామానికి చెందిన మండి వెంకటేష్‌కు మణుగూరులో ఐటీఐ చదువుతున్న నలుగురితో పరిచయం ఏర్పడింది. వీరు అయిదుగురు జల్సాలకు అలవాటుపడ్డారు. మణుగూరు పరిసరాల్లో పాడైపోయిన ఫ్యాక్టరీల్లో ఇనుప తుక్కు, కాపర్, లారీ బ్యాటరీలను దొంగతనం చేసి జులాయిలుగా తిరుగుతుండేవారు. జల్సాలకు ఆ డబ్బులు సరిపోకపోవడంతో ద్విచక్ర వాహనాలు చోరీచేసి గంజాయిని తక్కువ ధరకు కొని అధిక ధరకు విక్రయించి ఎక్కువ మొత్తంలో డబ్బులు సంపాదించాలని పథకం రచించారు. ఈనెల 16న కొత్తగూడెంలో ఒకటి, నెల్లిపాక - కూనవరం ప్రధాన రహదారిపై మరో రెండు ద్విచక్ర వాహనాలు చోరీ చేశారు. అక్కడి నుంచి సీలేరు వెళ్లి రెండు రోజులపాటు జల్సాగా గడిపారు. ఒడిశాలోని రాసబెడ వెళ్లి అయిదు కిలోల గంజాయి కొన్నారు. గురువారం మధ్యాహ్నం సీలేరు నుంచి తిరుగుపయనంలో మణుగూరు వెళ్తుండగా డొంకరాయి ఎస్సై శివకుమార్‌కు పట్టుబడ్డారు. మండి వెంకటేష్, షేక్‌ షంషీద్, మెరుగు సాయికృష్ణ, కూకట్ల అఖిల్‌తోపాటు మరో మైనర్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాలుగు ద్విచక్ర వాహనాలు సీజ్‌ చేశారు. అరెస్టు అయిన వారిలో నలుగురిని రంపచోడవం కోర్టుకు, మైనర్‌ను రాజమహేంద్రవరం జువైనల్‌ హోంకు తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని