logo

ఆసనమే లేపనం

ఆధునిక సమాజంలో అనేక ఆరోగ్య సమస్యలు పుట్టుకొస్తున్నాయి. జీవన శైలి లోపాలతో చిన్నాపెద్ద తేడా లేకుండా పలు రుగ్మతలతో బాధపడుతున్నారు. దీనికి ఆహారంకూడా కారణభూతమవుతోంది.

Updated : 21 Jun 2024 05:42 IST

నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం

ఆధునిక సమాజంలో అనేక ఆరోగ్య సమస్యలు పుట్టుకొస్తున్నాయి. జీవన శైలి లోపాలతో చిన్నాపెద్ద తేడా లేకుండా పలు రుగ్మతలతో బాధపడుతున్నారు. దీనికి ఆహారంకూడా కారణభూతమవుతోంది. ఈ నేపథ్యంలో అందరూ ఆరోగ్య పరిరక్షణకు పెద్దపీట వేస్తున్నారు. ప్రశాంత చిత్తంతో యోగాసనాలు వేస్తూ మానసిక ఉల్లాసం పొందుతున్నారు. సర్వ రుగ్మతలకు ఆసనమే లేపనమవుతోంది. నేడు ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ‘న్యూస్‌టుడే’ కథనాలివి.. 

25 ఏళ్లలో 12వేల మందికి ఉచిత శిక్షణ 

సత్తుపల్లిలోని శిక్షణ కేంద్రంలో యోగాసనాలు..

సత్తుపల్లి, న్యూస్‌టుడే: సత్తుపల్లిలో రామకృష్ణ యోగా సమితి ఆధ్వర్యంలో దాదాపు 25 ఏళ్లుగా ఉచితంగా యోగా శిక్షణ ఇస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రతి ఏడాది సత్తుపల్లిలో ప్రజలకు ప్రత్యేకంగా యోగాపై అవగాహన కల్పించి ఇప్పటి వరకు 12వేల మందికిపైగా శిక్షణ ఇవ్వడం విశేషం.

దివ్యౌషధంగా పనిచేసింది: ఆర్‌.రాజ్యం, సత్తుపల్లి

గతంలో నేను వెన్నునొప్పి, స్పాండిలైటిస్‌తో బాధపడ్డాను. ఆ తర్వాత కళాభారతిలో ఇచ్చే ఉచిత శిక్షణలో చేరాను. క్రమం తప్పకుండా వెళ్తున్నాను. యోగాసనాలు చేయడం వల్ల ఆరోగ్యం మెరుగుపడింది. ఎటువంటి ముందులతో పనిలేకుండా రోజంతా ఉత్తేజంగా ఉంటుంది. నా పనులు నేను చేసుకుంటున్నాను. 

థైరాయిడ్‌ సమస్య తగ్గింది: గంజి ఝాన్సీ, సత్తుపల్లి

ఆరేళ్లుగా యోగా సాధన చేస్తున్నాను. గతంలో నాకు థైరాయిడ్‌ ఉంది. తెలిసిన వారి సలహాతో యోగాసనాలు చేయడం ప్రారంభించాను. నెల రోజులు సాధన చేసిన తర్వాత పరీక్ష చేయించుకోవడంతో సాధారణం అని రిపోర్ట్‌ వచ్చింది. అప్పటి నుంచి నిత్యం యోగాసనాలు వేస్తున్నాను. ఏ మాత్రం అశ్రద్ధ చేయకుండా యోగా చేయడంతో ఆరోగ్యం చాలా బాగుంది. 

బుడుగులు.. యోగా పిడుగులు

విక్రమాసనంలో వానియా తన్వీర్‌, విశ్వామిత్రాసనంలో లక్ష్మీప్రణిత 

ఖమ్మం క్రీడలు, న్యూస్‌టుడే: యోగా భారతీయ జీవన విధానంలో భాగమైంది. జాతీయ పాఠశాల క్రీడల సమాఖ్య జాబితాలోనూ చేర్చారు. నాటి నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలు జరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లా నుంచి జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులు ఉన్నారు. 
స్వీయ సమాజం కోసం... ఈ ఏడాది యోగా దినోత్సవాన్ని యోగా ఫర్‌ సెల్ఫ్‌ అండ్‌ సొసైటీ నినాదం ప్రకారం జరుపుకోవాలని ప్రభుత్వం ప్రకటించింది. ఉమ్మడి జిల్లాలో యోగా గురువులు, శిక్షణ సంస్థలు గణనీయంగా పెరిగాయి. ఖమ్మం నగరంలో పెద్ద సంఖ్యలో ప్రజలు ఆదరిస్తున్న సంస్థలు పది ఉన్నాయి. నగరంలోని సీబీఎస్‌ఈ పాఠశాలలు కొన్ని యోగాకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రైవేటు పాఠశాలలు ప్రత్యేక టీచర్లను నియమించుకుంటున్నాయి. స్కూల్‌ గేమ్స్‌ జాబితాలో చేరిన నాటి నుంచి రాష్ట్ర, జాతీయ పోటీలకు వెళ్లే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌ నిర్వహించే జాతీయ పోటీల్లో ఖమ్మం యోగా బృందం పతకాల పంట పండిస్తోంది. జాతీయ స్థాయిలో రాణించిన కొందరు విద్యార్థులు ప్రదర్శించిన యోగాసనాల చిత్రాలే ఇవి...

ఉత్తిత ఏకపాదసిరాసనంలో బి.అక్షయ

ఆరోగ్యం..ఆనందం

యోగా సాధనలో అభ్యాసకులు

కల్లూరు, న్యూస్‌టుడే: కల్లూరులోని కాకతీయ చక్కెర కర్మాగారంలో పనిచేస్తున్న సాంకేతిక ఇంజినీరు కొడాలి రఘునాథబాబు నిత్యం ఉచిత యోగా శిక్షణ ఇస్తున్నారు. పరిశ్రమ ఆవరణలో ఉదయం వేళ కల్లూరుతోపాటు కర్మాగారంలోని పలువురు ఇక్కడ యోగాసనాలు వేస్తునారు. నిత్య యోగాసాధనతో ఆరోగ్యంగా ఉంటారని రఘునాథబాబు అంటున్నారు. దీంతోపాటు ఆహారపు అలవాట్లను క్రమబద్ధీకరించుకుంటే రక్తపోటు, మధుమేహం తదితర వ్యాధులను నియంత్రణలో పెట్టుకోవచ్చంటున్నారు. దీంతో ఆనందంగా ఆరోగ్యంగా ఉల్లాసంగా జీవనాన్ని గడపవచ్చని ఆయన పేర్కొన్నారు. 

భర్త ఆరోగ్యం కాపాడి.. శిక్షకురాలిగా మారి

పాలా అరుణ 

వేంసూరు, న్యూస్‌టుడే: తన కుటుంబానికొచ్చిన కష్టాన్ని యోగాతో అధిగమించారు. అందరూ బాగుండాలన్న లక్ష్యంతో పదిమందికి ఉచిత యోగా తరగతులు నిర్వహిస్తున్నారు వేంసూరు మండలం మర్లపాడుకు చెందిన పాలా అరుణ. తనభర్త కాళ్లు, చేతులు చచ్చుబడి పోయాయి. ఎన్ని ఆస్పత్రులు తిరిగినా నయం కాలేదు. యోగా ద్వారా కోలుకుంటారని పలువురు చెప్పడంతో తొలుత తాను శిక్షణ పొందారు. అటుపై భర్తకు ప్రత్యేక వ్యాయామాలు చేయించడంతో ఆయన అనారోగ్యాన్ని జయించారు. కొద్ది కాలానికే నడిచారు. దీంతో యోగాను పలువురికి పంచాలని నిర్ణయించుకుని పన్నెండేళ్లుగా మర్లపాడు షిర్డీసాయి మందిరంలో శ్రీరామకృష్ణా యోగాశ్రమం పేరుతో ఉచిత శిక్షణనిస్తున్నారు.

కీళ్ల నొప్పులు మాయం: పుచ్చకాయల జయశ్రీ, మర్లపాడు

పన్నెండేళ్లుగా యోగాసాధన చేస్తున్నాను. అంతకుముందు కీళ్లనొప్పులు భరించలేకుండా ఉండేవి. యోగాసాధనతో కీళ్ల నొప్పులతోపాటు మలిదశలో వచ్చే పలు రుగ్మతలు తగ్గిపోయాయి. దీంతో మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటున్నాను. 

మధిరలో రెండు దశాబ్దాలుగా..

మధిరలోని వాసవీ కల్యాణ మండపంలో ఉచిత యోగా శిక్షణ

మధిర పట్టణం, న్యూస్‌టుడే: మధిరలోని శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి కల్యాణ మండపంలో రెండు దశాబ్దాలుగా ఉచిత యోగా శిక్షణ అందిస్తున్నారు. ఆరోగ్య పరిరక్షణ కోసం మహిళలు, వృద్ధులు, యువత సైతం యోగాభ్యాసంపై మక్కువ కనబరుస్తున్నారు. రోజూ ఉదయాన్నే ఐదు గంటల నుంచి సుమారుగా గంటన్నరకు పైగా యోగాసనాలు వేస్తూ ఆరోగ్యబాట పడుతున్నారు. చాలా మంది ఇక్కడ శిక్షణ పొంది ఇళ్లలోనే స్నేహితులు, బంధువులతో కలిసి గ్రూపులుగా నిత్య యోగాసాధన చేస్తుండటం విశేషం. ప్రతి రోజూ 40 నుంచి 50 మందికి యోగా నేర్పించడంతో పాటు సాధనలో చేపట్టాల్సిన మెళకువలు వివరిస్తున్నట్లు శిక్షకులు నాళ్ల శ్రీనివాసరావు తెలిపారు. 

పక్షవాతం నుంచి బయటపడ్డా: లింగంపల్లి అప్పారావు, మధిర

నాకు వృత్తిరీత్యా జీవన విధానంలో ఎదురైన ఒత్తిళ్లతో పక్షవాతం లక్షణాలు వచ్చాయి. దీంతో మూడేళ్ల నుంచి నిత్య యోగా సాధన చేస్తూ వాటిని అధిగమించి ఆరోగ్యంగా ఉండగలుగుతున్నా. వైద్యుల మందుల కంటే కూడా యోగాసనాల ద్వారానే త్వరగా కోలుకోగలిగాననే సంతృప్తి దక్కింది. దీంతో ప్రతిరోజూ ఉదయం యోగా కోసం సమయం కేటాయిస్తున్నా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని