logo

మొక్కలు నాటి శ్వాస.. చెట్లు నరికితే గోస

మొక్క నాటితే చెట్టవుతుంది. ఫలాల్నిస్తుంది.. నీడ, ఆహ్లాదాన్ని కలిగిస్తుంది.. తరతరాలకు సేవలందిస్తుంది. అదే చెట్టును తొలగించాలంటే అనుమతి తీసుకోవాలి.

Updated : 21 Jun 2024 05:53 IST

మొక్క నాటితే చెట్టవుతుంది. ఫలాల్నిస్తుంది.. నీడ, ఆహ్లాదాన్ని కలిగిస్తుంది.. తరతరాలకు సేవలందిస్తుంది. అదే చెట్టును తొలగించాలంటే అనుమతి తీసుకోవాలి. లేకుంటే వాల్టా చట్టం కింద శిక్ష పడుతుంది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మినహా ఏ చెట్టును తొలగించాలన్నా అనుమతులు తీసుకోవాలి. పెంచిన చెట్లను తొలగించాల్సి వస్తే ఎలాంటి అనుమతులు తీసుకోవాలి? ఎంత ధరావత్తు చెల్లించాలి? అనే అంశాలపై ‘న్యూస్‌టుడే’ కథనం.

మణుగూరు, న్యూస్‌టుడే

అనుమతులు పొందాలిలా..

అశ్వారావుపేట, దమ్మపేట, సత్తుపల్లి, ఏన్కూరు, కూసుమంచి, ఖమ్మం, బూర్గంపాడు, కొత్తగూడెం, ఇల్లెందు తదితర ప్రాంతాల్లో కొందరు తమ పొలాల్లో టేకు, వేప, తుమ్మ, జిట్రేగు, తిరిసనం, బిల్గుడు తదితర చెట్లు పెంచుతున్నారు. వీరు ఆ చెట్లను నరికివేయాలన్నా, ఇతర ప్రాంతాలకు తరలించాలన్నా నిబంధనలు పాటించాలి. తమ పొలాల్లో తాము పెంచుకున్న చెట్లపై తమకు పూర్తి అధికారం ఉంటుందని కొందరు భావిస్తుంటారు. వాల్టా చట్టం నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఓరైతు తాను పెంచిన వృక్షాలను తొలగించాలంటే ముందుగా ఆన్‌లైన్‌లో తమ భూమికి సంబంధించిన అంశాలు నమోదు చేసుకోవాలి. తొలగిస్తున్న చెట్ల వివరాలు, సంఖ్య, వాటి వయస్సు తదితరాలను జోడించాలి. ఒక్కో చెట్టుకు రూ.450 చొప్పున అటవీశాఖ పేరుతో ధరావత్తు చేయాలి. వీటికి అదనంగా రూ.25 ఛార్జీలు వర్తిస్తాయి. స్థానిక అటవీశాఖ అధికారులు విచారణ జరుపుతారు. ఆన్‌లైన్‌లో అనుమతులు పొందాకే తొలగించిన కలపను ఎక్కడికైనా తరలించుకునే అవకాశముంది. కలపను తొలగించిన అనంతరం దానికి రెండు రెట్ల పచ్చదనం పెంచితే గతంలో ధరావత్తు చేసిన సొమ్ము తిరిగి రైతుకు వస్తుంది. 

పండ్ల చెట్లకు వర్తించదు

ఈ నిబంధనలు జామ, బత్తాయి, సపోట తదితర పండ్ల తోటలకు వర్తించవని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. జామాయిల్, ఇతర జాతులు అటవీశాఖ పరిధిలోకి రావు. కలపకు సంబంధించిన ఎలాంటి చెట్లు అయినా నిబంధనలకు లోబడి వ్యవహరించాలి. ఒకవేళ ఈ విషయం తెలియకుంటే అటవీశాఖ కార్యాలయానికి వెళ్లి వివరాలు తెలుసుకోవాలి. వీటిపై అవగాహన కల్పించేందుకు జనవరిలో వారం పాటు ప్రచార కార్యక్రమాలను అటవీశాఖ చేపడుతుంది. ఆయా ప్రాంతాల్లో కలపను పెంచుతున్న రైతుల వివరాలను గ్రామ పరిపాలనాధికారి సహాయంతో సేకరించనుంది. 

ఇవీ లెక్కలు...

  • ఉభయ జిల్లాల్లో సుమారు 27 లక్షల టేకుచెట్లు, 35 లక్షల వేపచెట్లు, 15 లక్షల తుమ్మచెట్లు ఉన్నాయి.
  • రెండేళ్లలో 2 కోట్ల టేకు, కోటి వేప మొక్కలు పంపిణీ చేశారు. అటవీశాఖ పరిధిలో 70 లక్షల తుమ్మ మొక్కలు నాటారు. 
  • రెండేళ్లలో 190 మంది మాత్రమే ధరావత్తు చేసి కలప వృక్షాలను తొలగించారు.
  • అనధికారికంగా సుమారు 50 వేల వృక్షాలను తొలగించారు. కేవలం 380 కేసులు నమోదయ్యాయి. 

అటవీశాఖ, వాల్టా చట్టాల ప్రకారం రెండు విధాలుగా చెట్లను విభజించవచ్చు. ప్రాథమికంగా ఏచెట్టు తొలగించాల్సి వచ్చినా అనుమతులు తీసుకోవాలి. టేకు, యాగీస, ఎర్రచందనం, బిలుగుడు, సండ్ర, అడవి జాతుల చెట్లు అటవీశాఖ పరిధిలోకి వస్తాయి. వీటితోపాటు మిగతా జాతులకూ వాల్టా చట్టం వర్తిస్తుంది. 

ద్వాలియా, అటవీక్షేత్రాధికారి, మణుగూరు 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని