logo

హాయిగా తిరిగారు.. అద్దె మరిచారు!

ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ నిర్వహణ కోసం అద్దె కార్లను అధికారులు ఉపయోగించారు.

Updated : 21 Jun 2024 05:41 IST

ఎన్నికల సమయంలో నడిపిన కార్లు  

సత్తుపల్లి, న్యూస్‌టుడే: ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ నిర్వహణ కోసం అద్దె కార్లను అధికారులు ఉపయోగించారు. పోలింగ్‌ ముగిసి నెలరోజులు దాటినా కార్లకు సంబంధించి కిరాయిలు చెల్లించకపోవడంతో వాహనదారులు ఆవేదన చెందుతున్నారు. 

ఎన్నికల నిర్వహణకు వినియోగం

ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లోని పది శాసనసభ నియోజకవర్గాల్లో సెక్టార్‌ ఆఫీసర్లు, ఫ్లయింగ్‌ స్క్వాడ్, హోమ్‌ ఓటింగ్‌కు దాదాపు 350 కార్లను ఎన్నికల అధికారులు అద్దెకు తీసుకున్నారు. ఇందులో కొన్ని కార్లను పది రోజులు, మరికొన్నింటిని 20 నుంచి 30 రోజుల వరకు అధికారులు తిప్పుకొన్నారు. వాటికి సంబంధించిన బిల్లులు అందించకపోవడంతో కార్ల   యజమానులు, డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు   పడుతున్నారు. ప్రధానంగా ఎక్కువగా ఏడు సీట్లు కలిగిన కార్లను అధికారులు తీసుకున్నారు. వాటికి జీపీఎస్‌ ట్రాకింగ్‌ సిస్టంలు అమర్చి విస్తృతంగా పర్యటించారు. 

ఈఎంఐలకు డబ్బుల్లేక ఇబ్బందులు

అద్దె కార్లలో చాలా వరకు బ్యాంకులు, ఇతర ఫైనాన్స్‌ సంస్థల ద్వారా నెలవారీ చెల్లింపులు(ఈఎంఐ) పద్ధతిలో తీసుకున్నవే. చాలా మంది నిరుద్యోగులు ఉద్యోగాలు రాక   ఈఎంఐ పద్ధతి ద్వారా కార్లను కొనుగోలు చేసుకుని కిరాయిలకు నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఎన్నికల విధుల్లో పెట్టిన కార్లకు అధికారులు అద్దెలు చెల్లించకపోవటం, ప్రస్తుతం బయట కిరాయిలు కూడా పెద్దగా లేకపోవడంతో ఈఎంఐలు చెల్లించలేకపోతున్నామని ఆవేదన చెందుతున్నారు.  ఆయా నియోజకవర్గాల్లోని ఎన్నికల డీటీలు, ఆర్డీఓల చుట్టూ  ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా   ఎన్నికల అధికారులు స్పందించి తక్షణమే కిరాయిలు చెల్లించాలని కార్ల డ్రైవర్లు విజ్ఞప్తి చేస్తున్నారు. 

  • ఈ అంశమై కల్లూరు ఆర్డీఓ ఎల్‌.రాజేంద్రగౌడ్‌ మాట్లాడుతూ కార్ల కిరాయిల బిల్లులు జిల్లా అధికారులకు అందించామన్నారు. రెండుమూడు రోజుల్లోనే నేరుగా వాహన యజమానుల ఖాతాల్లో జమచేసే అవకాశం ఉందని తెలిపారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని