logo

గొర్రెల పంపిణీ కుంభకోణంపై విచారణ వేగవంతం

త ప్రభుత్వ హయాంలో జిల్లాలో జరిగిన గొర్రెల సరఫరా కుంభకోణంపై కాంగ్రెస్‌ సర్కారు ప్రత్యేక దృష్టి పెట్టింది.

Published : 21 Jun 2024 02:36 IST

ఖమ్మం వ్యవసాయం, న్యూస్‌టుడే: గత ప్రభుత్వ హయాంలో జిల్లాలో జరిగిన గొర్రెల సరఫరా కుంభకోణంపై కాంగ్రెస్‌ సర్కారు ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రధానంగా విజిలెన్స్, ఏసీబీ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్లను రంగంలోకి దింపింది. ఈ మూడు శాఖలు కొద్దిరోజుల నుంచి ఇక్కడ జరిగిన అక్రమాలపై ఆరా తీస్తున్నాయి. సంబంధిత అధికారులు తరచూ జిల్లాలో పర్యటించి వివరాలు సేకరిస్తున్నారు.

మొదటి నుంచి తిరిగి దర్యాప్తు... 2017-18 నుంచి 2023 వరకు మొదటి, రెండో విడతల్లో గొర్రెల సరఫరా విషయంలో అధికారులు, దళారుల పాత్రపై దర్యాప్తు జరుపుతున్నారు. మొదటి విడతలో యూనిట్‌ ఖరీదు రూ.1.25 లక్షలు ఉండగా, రెండో విడతలో రూ.1.75 లక్షలకు అప్పటి ప్రభుత్వం పెంచింది. రెండు విడతలకు సంబంధించి ఎంతమందికి  సరఫరా చేశారు, ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు, లబ్ధిదారుల దరఖాస్తులు, డీడీలు వివరాలు, రవాణా ఎక్కడి నుంచి చేశారు, వాహనాల నంబర్లు, సరఫరా చేసిన గుత్తేదారు, బ్యాంకు ఖాతాల వివరాలను వెంటనే అందించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. వారం నుంచి జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారులు ఈ వివరాలు సేకరిస్తున్నారు. జిల్లాలో పశువైద్యులకు బదులు ఇద్దరు పారావెట్స్‌ కొనుగోళ్లలో పాల్గొని సంతకాలు పెట్టిన విషయంలో లోతైన అధ్యయనం చేస్తున్నారు. గొర్రెల ఆరోగ్యం, వయసు ధ్రువీకరించాలంటే పశువైద్యులు తప్పనిసరిగా ఉండాలి. నిబంధనలకు విరుద్ధంగా బాధ్యతలు నిర్వర్తించిన ఉద్యోగులపైనా విచారణ చేస్తున్నారు.
అక్రమాలపై ఆరా... గొర్రెలను సరఫరా చేసిన తర్వాత వాటికి అవసరమైన మందులు, దాణాకూ ప్రభుత్వం నిధులు కేటాయించింది. జిల్లాలో కేవలం 222 మంది లబ్ధిదారులకు మాత్రమే ఈ నిధులు విడుదల చేశారు. మిగతా వారికి ఇవ్వలేదు. దాణాకు నిధులివ్వలేదు. బీమా కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించినా వాటికీ మంజూరు చేయలేదు. జిల్లాకు గొర్రెలను సరఫరా చేయకుండా రీసైక్లింగ్‌ విషయం, తప్పుడు ధ్రువపత్రాలతో ప్రభుత్వాన్ని బురిడీకొట్టించిన విషయంపై ఇప్పుడు అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. కొంతమంది ఏసీబీ అధికారులకు ఫిర్యాదు ఇచ్చిన నేపథ్యంలో గతంలో పనిచేసిన జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి పాత్రపై సైతం ఆరా తీస్తున్నారు.   అధికారులు ఇచ్చిన నివేదికల ఆధారంగా అక్రమార్కులపై ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

పూర్తి వివరాలు సేకరిస్తున్నాం

వెంకటనారాయణ, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి, ఖమ్మం

మొదటి, రెండో విడతలో గొర్రెల పంపిణీకి సంబంధించిన పూర్తి వివరాలను విజిలెన్స్, ఏసీబీ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు అడిగారు. ప్రస్తుతం పూర్తి వివరాలు సేకరించే పనిలో ఉన్నాం. వచ్చే సోమవారం నాటికి నివేదికలను సంబంధిత అధికారులకు అందిస్తాం.

జిల్లాలో ఇలా...

  • మొదటి విడతలో మంజూరైన గొర్రెల యూనిట్లు: 15,666
  • రెండో విడతలో మంజూరైనవి: 978
  • మంజూరు కావాల్సినవి: 9,623
  • లబ్ధిదారులకు తిరిగి ఇచ్చిన డీడీలు: 10,601
  • వీటి విలువ: రూ.26.25 కోట్లు
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని