logo

డెంగీ పంజా

సీజనల్‌గా వచ్చే జ్వరాల్లో డెంగీ ప్రాణాంతకంగా మారుతోంది. ఖమ్మానికి చెందిన ఓ యువ వైద్యుడు సోమవారం డెంగీతో మృత్యువాత పడ్డారు. వైద్య పరీక్షలు చేయించుకోవడంలో కాస్త ఆలస్యం చేయడంతో ఆయన ప్రాణాలే పోయాయి.

Updated : 11 Jul 2024 05:13 IST

ఖమ్మం వైద్యవిభాగం, న్యూస్‌టుడే

సీజనల్‌గా వచ్చే జ్వరాల్లో డెంగీ ప్రాణాంతకంగా మారుతోంది. ఖమ్మానికి చెందిన ఓ యువ వైద్యుడు సోమవారం డెంగీతో మృత్యువాత పడ్డారు. వైద్య పరీక్షలు చేయించుకోవడంలో కాస్త ఆలస్యం చేయడంతో ఆయన ప్రాణాలే పోయాయి. జిల్లాలో డెంగీ కేసులు పెరుగుతున్నాయని... అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని దోమలు పుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవడం, జ్వరం వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో  నిపుణుల సూచనలతో ప్రత్యేక కథనం...


లక్షణాలు ఇలా..

డెంగీ సోకిన బాధితుల్లో తీవ్ర జ్వరం, తలనొప్పి, అధిక దాహం, కళ్లు తెరవలేకపోవడం, కండరాలు, కీళ్ల నొప్పులు, చర్మంపై దద్దుర్లు, రక్తపోటు వంటి లక్షణాలు కన్పిస్తాయి. వెంటనే సంబంధిత పరీక్షలు చేయించుకొని నిర్ధారించుకోవాలి. సాధారణ జ్వరంగా భావించి నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం.


డెంగీ కేసులు 194 

ఖమ్మం జిల్లాలో జనవరి నుంచి జులై 10 నాటికి 183 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఎంవీపాలెం, పెద్దగోపతి, నేలకొండపల్లి, వల్లభి, తిరుమలాయపాలెం, మంచుకొండ, చింతకాని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 15 గ్రామాల్లో పది మందికి పైగా డెంగీ బాధితులు ఉన్నట్లు నిర్ధారణైంది. ఆయా గ్రామాలను హైరిస్క్‌ గ్రామాలుగా గుర్తించారు. భద్రాద్రి కొత్తగూడెంలో జిల్లాలో జూన్‌ 23వ తేదీ వరకు 11 కేసులు నమోదయ్యాయి.


ఎలా వస్తుంది?

ఎడిస్‌ ఇజిప్టీ దోమ కాటుతో డెంగీ జ్వరం వ్యాపిస్తుంది. ఇది మంచినీటిలో మాత్రమే గుడ్లు పెట్టే దోమ. తక్కువ నీటిలో వృద్ధి చెందుతుంది. ఎక్కువ దూరం, మోకాలి కన్నా ఎత్తు ఎగరలేదు. ఇళ్ల పరిసరాల్లో ప్లాస్టిక్‌ డబ్బాలు, గ్లాసులు, మూతలు, కొబ్బరి బొండాలు, టైర్లు వంటివాటిలో వాననీరు నిలువకుండా పారబోయాలి.


నిర్లక్ష్యం చేయొద్దు

వర్షాకాలం వైరల్‌ జ్వరాలు, డెంగీ, మలేరియా, చికన్‌గున్యా వంటివి ప్రబలుతాయి. డెంగీ నిర్ధారణ కోసం ఐజీఎం ఎలిసా పరీక్ష చేయించాలి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇది అందుబాటులో ఉంది. సాధారణ జ్వరం వచ్చినా ప్లేట్‌లేట్స్‌ తగ్గుతాయి. లక్ష ఉంటే వైద్యులను సంప్రదించాలి. 20 వేల కన్నా తగ్గితే ప్రమాదం. పల్లె, బస్తీ దవాఖానాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, ఏరియా ఆస్పత్రులు, సర్వజనాసుపత్రుల్లో వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి.


పారిశుద్ధ్యమే కీలకం: వ్యాధుల నిర్మూలన అన్ని ప్రభుత్వ శాఖల బాధ్యత. ఐదు కన్నా ఎక్కువ డెంగీ కేసులు నమోదైన గ్రామాలను హైరిస్క్‌ ప్రాంతాలుగా పరిగణించి వ్యాధి కారక దోమల వ్యాప్తిని నిర్మూలించే కార్యక్రమాలు చేపట్టాలి. గత ఏడాది ఖమ్మంలో 69 గ్రామాలను హైరిస్క్‌ ప్రాంతాలుగా నిర్ధారించారు. వైద్య ఆరోగ్య, పంచాయతీ, మున్సిపల్, విద్య, తాగునీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమశాఖల సమక్షంలో ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి నివారణ చర్యలు చేపట్టాలి. దోమల నివారణకు రసాయణాల పిచికారి, ఫాగింగ్, ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు, ఆయిల్‌ బాల్స్‌ వేయడం, గంబూషియా చేపలు వదలడం వంటివి చేయాలి. 


వైద్య పరీక్షలతో నిర్ధారించుకోవాలి
- డాక్టర్‌ ప్రియాంక, జనరల్‌ మెడిసిన్‌

వైరల్‌ జ్వరాలకు తప్పనిసరిగా రక్త పరీక్షలు చేయించాలి. మూడు రోజుల తర్వాత ఐజీఎం, ఎన్‌ఎస్‌-1 యాంటీజెన్‌ పరీక్షలు చేయించి డెంగీ జ్వరాన్ని నిర్ధారించుకోవాలి. ఫ్లూయిడ్‌ రీప్లేస్‌మెంట్‌తో దీన్ని నివారించవచ్చు. బాధితులు డీహైడ్రేషన్‌కు గురవుతారు. ముదిరితే అంతర్గత రక్తస్రావం అవుతుంది. ఈ పరిస్థితుల్లో రోగి ‘డెంగీ షాక్‌ సిండ్రోమ్‌’కు గురవుతారు. కొబ్బరి నీళ్లు, ఎలక్ట్రాల్‌ పౌడర్, పండ్ల రసాలు తీసుకోవాలి. దోమలు పుట్టకుండా/కుట్టకుండా చూసుకోవాలి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని