logo

Singareni: పవన విద్యుత్తు వైపు.. సింగరేణి చూపు..

‘పవన విద్యుత్తు ప్రయోజనాన్ని గ్రహించి.. దాన్ని ఒడిసిపడదాం’ అనే నినాదాన్ని ఈ ఏడాది ప్రపంచ పవన దినోత్సవం ప్రపంచానికి అందిస్తోంది.

Updated : 15 Jun 2024 09:31 IST

‘పవన విద్యుత్తు ప్రయోజనాన్ని గ్రహించి.. దాన్ని ఒడిసిపడదాం’ అనే నినాదాన్ని ఈ ఏడాది ప్రపంచ పవన దినోత్సవం ప్రపంచానికి అందిస్తోంది. ఇదే స్ఫూర్తితో సింగరేణి సంస్థ ఇటీవల ఓ నిర్ణయం తీసుకుంది. సౌర కేంద్రాలతో పాటే పవన విద్యుత్తు తయారీ ప్లాంట్‌ నిర్మించాలని యోచిస్తోంది. ఓ సంస్థతో అధ్యయనం చేయిస్తోంది.

కొత్తగూడెం సింగరేణి, న్యూస్‌టుడే: భూతాపాన్ని తగ్గించడమే లక్ష్యంగా పరిశ్రమలు ఉత్పత్తి విధానాల్లో సాంకేతికతకు ప్రాధాన్యమివ్వాలని కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది. కొత్త లక్ష్యాలను నిర్దేశిస్తోంది. ఈ దిశగా అడుగులు వేసే క్రమంలో సింగరేణి సంస్థ వినూత్న విధానాలను అనుసరిస్తోంది. కేవలం బొగ్గు ఉత్పత్తికే పరిమితం కాకుండా పునరుద్ధరణీయ వనరుల సద్వినియోగంపై దృష్టిసారించింది. థర్మల్‌ విద్యుత్తు వాడకాన్ని తగ్గించే లక్ష్యంతో ఇప్పటికే సౌర విద్యుదుత్పత్తిలో గణనీయమైన ప్రగతి సాధించింది. పవన్‌ విద్యుత్తు ఉత్పత్తిలోనూ నిర్ణయాత్మక అడుగులు వేస్తోంది. నేటి ‘ప్రపంచ పవన దినోత్సవ’ స్ఫూర్తిని చాటుతోంది. ‘నెట్‌ జీరో’ లక్ష్యానికి చేరువై మిగతా పరిశ్రమలకు దిక్సూచిగా నిలవనుండటం విశేషం.

ఎత్తయిన ప్రదేశాల్లో సానుకూలత

సింగరేణి సంస్థ రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో విస్తరించి ఉంది. దీని పరిధిలోని ఖాళీ ఉపరితల గనుల మట్టి దిబ్బలు, ఎత్తయిన కొండలు, గుట్టలపై గాలిమరల ఏర్పాటు ద్వారా పవన విద్యుత్తును ఉత్పత్తి చేయాలని తాజాగా నిర్ణయించింది. దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఇలాంటి ప్లాంట్లు ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారో వాటిపై అధ్యయనం చేస్తోంది. ముందుగా సింగరేణి పరిధిలోని ఓసీ గుట్టలను అధ్యయనం చేయాలని న్యూదిల్లీకి చెందిన మెస్సర్స్‌ పీఈసీ అనే సంస్థకు ఇటీవల బాధ్యతలు అప్పగించింది. ఓసీలు, ఎత్తయిన ప్రాంతాల్లో పవన విద్యుత్తు తయారీపై ఆసంస్థ పూర్వ ప్రాథమిక పరిశీలన చేపట్టింది. ఈనెలాఖరులోగా యాజమాన్యానికి నివేదిక అందజేయనుంది. ‘గాలిమరల ఏర్పాటుకు అనువైన ప్రదేశాలేవి? ఏ దిశలో వాటిని అమర్చాలి? తద్వారా ఎక్కడెక్కడ ఎన్ని వాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయొచ్చు?’ అనే ప్రాథమిక అంచనాలను సాధ్యాసాధ్యాల నివేదిక (ఫీజిబులిటీ రిపోర్ట్‌)లో అధ్యయన సంస్థ పేర్కొంటుంది. ఆ నివేదికపై సింగరేణి యాజమాన్యం.. ఉన్నతస్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించి తుది   నిర్ణయాన్ని వెల్లడిస్తుంది.

‘100 మెగావాట్ల పవన విద్యుత్తు ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకోవాలని ప్రాథమికంగా భావిస్తున్నాం. నెలాఖరులోగా అధ్యయన సంస్థ నుంచి నివేదిక అందుతుంది. సమీక్ష అనంతరం తుది నిర్ణయం వెల్లడిస్తాం.’ అని సింగరేణి ఛైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్‌.బలరాం ‘న్యూస్‌టుడే’కు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని