logo

Kothagudem: రైలు, ఫ్లాట్‌ఫాం మధ్య ఇరుక్కుని.. టీవీ ఆర్టిస్టు దుర్మరణం

ముందుకు కదులుతున్న రైలెక్కేందుకు ప్రయత్నించిన ఓ టీవీ ఆర్టిస్టు తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మరణించాడు

Updated : 22 Jun 2024 07:43 IST

మహ్మద్దీన్‌

కొత్తగూడెం నేరవిభాగం, న్యూస్‌టుడే: ముందుకు కదులుతున్న రైలెక్కేందుకు ప్రయత్నించిన ఓ టీవీ ఆర్టిస్టు తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మరణించాడు. ఈ ఘటన శుక్రవారం కొత్తగూడెంలో చోటుచేసుకుంది. కొత్తగూడెం రైల్వే ఎస్సై సురేశ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. చుంచుపల్లి మండలం నందాతండాకు చెందిన మేదర మహ్మద్దీన్‌ (53) భద్రాచలం రోడ్‌ రైల్వే స్టేషన్‌ (కొత్తగూడెం)కు ఉదయం వచ్చారు. అదే సమయంలో ముందుకు కదులుతున్న కాకతీయ ఎక్స్‌ప్రెస్‌ను ఎక్కేందుకు ప్రయత్నించారు. కిందకు జారిపడటంతో రైలు, ప్లాట్‌ఫాం మధ్య ఇరుక్కుపోయాడు. వెంటనే లోపలున్న ప్రయాణికులు చైన్‌లాగడంతో లోకోపైలెట్‌ రైలును ఆపారు. రైల్వే పోలీసులు సిబ్బంది సహాయంతో మహ్మద్దీన్‌ను బయటకు లాగి ‘108’లో కొత్తగూడెం జిల్లా సర్వజన ఆసుపత్రికి తరలించారు. నడుము, పక్కటెముకలకు తీవ్రగాయాలైన బాధితుడికి వైద్యులు అత్యవసర చికిత్స విభాగంలో సేవలందించారు. డా.రోషిణి సూచనలతో మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు ఖమ్మం తరలిస్తుండగా మార్గం మధ్యలో అతడు మృతిచెందాడు. మృతదేహాన్ని సర్వజన ఆసుపత్రి శవాల గదిలో భద్రపరిచారు. డ్యూటీ వైద్యురాలి ఫిర్యాదుతో స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు.

క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా గుర్తింపు..: మహ్మద్దీన్‌ ఈటీవీ జబర్దస్త్‌లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 50 ఎపిసోడ్స్‌లలో పలు పాత్రలు పోషించారు. షూటింగ్‌ ఉందని చెప్పి శుక్రవారం హైదరాబాద్‌కు వెళ్లేందుకు ఉదయం స్టేషన్‌కు వచ్చారు. ప్రమాదవశాత్తు మృత్యువాతపడ్డారు. మృతుడికి భార్య, డిగ్రీ, పదోతరగతి చదివే ఇద్దరు కుమార్తెలున్నారు. మహ్మద్దీన్‌ మృతితో నందాతండాలో విషాదం అలుముకుంది. కళాకారుడిగా రాణిస్తూ కుమార్తెలు చదివించుకుంటున్న వ్యక్తి ప్రమాదవశాత్తు మరణించడంపై స్థానికులు విచారం వ్యక్తం చేశారు.


పూటుగా తాగి.. పాఠశాల ఎదుట కూలబడి..!

మద్యం మత్తులో ఉపాధ్యాయుడి నిర్వాకం

గొడ్ల చావిడికి చేర్చిన విద్యార్థులు

ములకలపల్లి, న్యూస్‌టుడే: పూటుగా మద్యం తాగిన ఉపాధ్యాయుడు అదే మత్తులో పాఠశాలకు రాగా... అతడిని విద్యార్థులు, సిబ్బంది  గొడ్ల చావిడికి తరలించిన ఘటన మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలను పరిశీలిస్తే.. ములకలపల్లి మండలం తిమ్మంపేట పంచాయతీ పరిధిలోని రాజీవ్‌నగర్‌ మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో ఎస్‌జీటీగా విధులు నిర్వహిస్తున్న పి.వీరయ్య శుక్రవారం ఉదయం మద్యం మత్తులో బడికివచ్చాడు. ఆటో దిగిన దగ్గర నుంచి కనీసం రోడ్డు పక్కనే ఉన్న పాఠశాలకు సైతం నడవలేక మత్తులోనే అక్కడే కూర్చుండిపోయాడు. దీంతో విద్యార్థులు తొలుత అతడిని పాఠశాల ఆవరణకు తీసుకువెళ్లారు. అక్కడ సైతం కూర్చునే పరిస్థితిలో లేకపోవడంతో విద్యార్థులు, పాఠశాల ఆవరణలో అంగన్‌వాడీ ఆయా, మధ్యాహ్న భోజన కార్మికులు ఉపాధ్యాయుడ్ని మోసుకుంటూ తీసుకెళ్లి పాఠశాల వెనుకున్న గొడ్ల చావిడిలో పడుకోబెట్టారు. కాగా ఈ అంశంపై ఇన్‌ఛార్జి ఎంఈఓ ఎ.శ్రీరామ్మూర్తిని ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా ఉపాధ్యాయుడు వీరయ్యకు షోకాజ్‌ నోటీస్‌ ఇవ్వనున్నట్లు తెలిపారు.


భూవివాదంతో వ్యక్తి ఆత్మహత్య

కొణిజర్ల, న్యూస్‌టుడే: భూవివాద నేపథ్యంలో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం మేకాలకుంటలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం... మేకాలకుంట గ్రామానికి చెందిన భూక్యా సక్రియా(55) తనకున్న వ్యవసాయ భూమిని ముగ్గురు కొడుకులకు 1.20 ఎకరాలు చొప్పున పంచాడు. మిగిలిన 30 గుంటలు భూమిని సాగు చేయనివ్వకుండా ఆ గ్రామానికే చెందిన కొందరు వ్యక్తులు ఇబ్బందులకు గురిచేశారు. పక్కన పొలానికి చెందిన అజయ్, దానిని కౌలుకు చేస్తున్న బానోత్‌ కృష్ణ దారి ఇవ్వకుండా ఇబ్బందులు గురిచేస్తుండటంతో భూమి బీడుగా మారింది. అట్టి భూమిలో ఇటీవల వరద కాలువను తీయగా పక్క పొలానికి చెందిన అజయ్‌ జేసీబీతో పూడ్చాడు. మళ్లీ కాలువను సక్రియా తీస్తుండగా గురువారం బానోత్‌ కృష్ణ, బుజ్జి అతనిపై దాడి చేశారు. ఈ నేపథ్యంలో అతడు మనస్తాపానికి గురై గురువారం రాత్రి ఇంట్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో ఇంటి బయట రేకుల కింద ఉన్న కడ్డికి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే వైరాలోని ఓ ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం తరలించారు. పొలాన్ని అమ్మాలని ఒత్తిడి చేయడమే కాకుండా, సేద్యం చేయకుండా ఇబ్బందులకు గురిచేయడంతో మానసికంగా ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. మృతికి కారణమైన కృష్ణ, అజయ్, బుజ్జి, మదన్, మల్లయ్యపై కఠిన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరుతూ కొణిజర్ల పోలీసులకు మృతుని కుమారుడు నరేశ్‌ ఫిర్యాదు చేశారు. 

పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఆందోళన: మృతుని కుటుంబ సభ్యులు శుక్రవారం ఉదయం కొణిజర్ల పోలీస్‌స్టేషన్‌ వద్దకు చేరుకుని ఆందోళన నిర్వహించారు. స్టేషన్‌ ముందు బైఠాయించి తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. గత నెలలో సదరు వ్యక్తుల నుంచి ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఆ రోజే విచారణ చేసి వారిని హెచ్చరిస్తే తన తండ్రి చనిపోయేవాడే కాదని కుమారుడు నరేశ్‌ ఆరోపించారు. ఈ నేపథ్యంలో అక్కడకు చేరుకున్న సీఐ సాగర్‌ వారికి సర్దిచెప్పి ఫిర్యాదు ఇస్తే చర్యలు తీసుకుంటామని, కారకులైవారిని శిక్షిస్తామని పేర్కొన్నారు. మృతికి కారణమైన వ్యక్తులను శిక్షించాలని, భూమిని సేద్యం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. బాధితులతో చర్చలు జరిపిన సీఐ న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. దీనిపై ఎస్సై శంకరరావు మాట్లాడుతూ వారు ఫిర్యాదు చేసిన సమయంలోనే ఇరువర్గాలను పిలిచి కౌన్సెలింగ్‌ చేశామని, భూ వివాదం కావడంతో రెవెన్యూ అధికారులను సంప్రదించాలని సూచించామని తెలిపారు. 


విద్యుదాఘాతంతో దంపతుల మృతి

వైరా, న్యూస్‌టుడే: విద్యుదాఘాతంతో దంపతులు మృతి చెందిన సంఘటన ఖమ్మం జిల్లా వైరా పట్టణం హనుమాన్‌ బజార్‌లో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం... స్థానిక పాతబస్టాండ్‌ పెట్రోల్‌బంకు ఎదురుగా ఉన్న హనుమాన్‌ బజార్‌లో పల్లపు ఆంజనేయులు(62), పల్లపు నర్సమ్మ(56) దంపతులు తమ చిన్న కుమారుడు సతీశ్‌ ఇంట్లో వెనుక గదిలో ఉంటున్నారు. రాత్రి సమయంలో నర్సమ్మ బాత్‌రూమ్‌కు వెళ్తుండగా అటువైపుగా బట్టలు ఆరేసేందుకు కట్టి ఉన్న ఇనుప జీవైర్‌ను తాకింది. ఆ సమయంలో టవల్‌ లేదా ఇతర దుస్తులను తీసే ప్రయత్నంలో ఆమెకు విద్యుత్తు షాక్‌ రావడంతో బిగ్గరగా అరిసింది. సమీపంలో ఉన్న భర్త ఆంజనేయులు పరిగెత్తుకుంటూ ఏం జరిగిందోననే ఆతృతలో భార్యను పట్టుకోవడంతో అతడికి సైతం విద్యుత్తుషాక్‌ వచ్చింది. దీంతో ఆ సమయంలో శబ్దం రావడంతో కోడలు శ్యామిని అక్కడకు పరుగెత్తుకుంటూ వచ్చింది. దగ్గరకు రావొద్దంటూ మామ ఆంజనేయులు సైగ చేస్తూ చెబుతుండటంతో ఆమె కేకలు వేసింది. ఆ సమయంలో కుటుంబ సభ్యులతోపాటు చుట్టుపక్కల వారు వచ్చి వారిని రక్షణ చర్యలతో పక్కకు తీసుకొచ్చారు. ఇంట్లో బట్టలు ఆరేసేందుకు ఉన్న జీవైర్‌కు విద్యుత్తు ప్రవాహం వచ్చినట్లు ప్రాథమికంగా నిర్దారించారు. మృతి చెందిన దంపతులు కష్టజీవులు. నిత్యం మట్టి పని లేదా కాంక్రీటు పనులు చేసుకుంటూ ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలకు ఆదరవుగా ఉండే వారని స్థానికులు చెబుతున్నారు. ఊహించని సంఘటనతో వారింట విషాదం అలుముకుంది. దంపతుల చిన్న కుమారుడు సతీశ్‌ కుటుంబ సభ్యులతో శనివారం తిరుపతి వెళ్లేందుకు చేసుకున్న ఏర్పాట్లలో చివరి నిమిషం వరకు మృత దంపతులు పాలుపంచుకున్నారు. జాగ్రత్తగా వెళ్లి రావాలని సూచించిన దంపతులు అంతలోనే తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో వారింట శోకం మిగిలింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని