logo

Crime News: బయట కాపలా కాసి.. భర్తను హత్య చేయించిన భార్య

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్న భర్తను ప్రియుడితో హత్య చేయించిందో భార్య. ఇరు కుటుంబాల మధ్యనున్న పాతకక్షను మనసులో పెట్టుకుని నిందితుడి ఇల్లాలూ అతడికి సహకరించిన అమానవీయ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది.

Updated : 11 Jul 2024 09:21 IST

సాహు ఈశ్వర్‌కుమార్‌

కొత్తగూడెం నేరవిభాగం, న్యూస్‌టుడే: వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్న భర్తను ప్రియుడితో హత్య చేయించిందో భార్య. ఇరు కుటుంబాల మధ్యనున్న పాతకక్షను మనసులో పెట్టుకుని నిందితుడి ఇల్లాలూ అతడికి సహకరించిన అమానవీయ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. హత్యవెనుక దాగిఉన్న విస్తుపోయే నిజాలు పోలీసు విచారణలో ఆలస్యంగా బయటపడ్డాయి. డీఎస్పీ షేక్‌ అబ్దుల్‌ రెహ్మాన్‌ కథనం ప్రకారం.. కొత్తగూడెం పట్టణం గౌతంపూర్‌ కాలనీకి చెందిన అరికె రమేశ్‌ ఆటోడ్రైవర్‌. అదే ఏరియాకు చెందిన సాహు ఈశ్వర్‌కుమార్‌ (38) భార్య ఎండీ రెహనాతో ఆయనకు వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం కొన్నాళ్ల క్రితం ఈశ్వర్‌కుమార్‌కు తెలిసింది. సింగరేణి క్వార్టర్‌లో    అక్రమంగా నివసిస్తున్న రమేశ్‌ను అక్కడ్నుంచి పంపించేయాలని నిశ్చయించుకున్నాడు. కొందరు స్థానికులతో కలిసి సింగరేణి అధికారులకు ఫిర్యాదు చేశారు. రమేశ్‌ కుటుంబాన్ని అధికారులు ఖాళీ చేయించారు. మరోవైపు తన భార్య వివాహేతర సంబంధాన్ని సహించలేని ఈశ్వర్‌కుమార్‌ తరచూ ఆమెతో గొడవపడేవారు. ఈ విషయాన్ని రెహనా తన ప్రియుడు రమేశ్‌కు చెప్పడంతో పాటు, ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని రెచ్చగొట్టింది. అతడితో కలిసి భర్త హత్యకు కుట్రపన్నింది. ఇందులో భాగంగా ఈనెల 6న ఇంట్లో ఒంటరిగా ఉన్న ఈశ్వర్‌కుమార్‌పై రమేశ్, అతడి అల్లుడు బట్టు చందు, భార్య ఇందిర కత్తులతో దాడిచేశారు. భర్త జాడ గురించి ఉప్పందించిన రెహనాయే  అతడిపై దాడి జరుగుతున్న సమయంలో ఇంటిబయట కాపలా కాసింది. గతంలో ఇల్లు ఖాళీ చేయించాడనే కక్షతోనే  శత్రు కుటుంబం ఈ ఘాతుకానికి పాల్పడినట్లు స్థానికులు, ఇతర కుటుంబ సభ్యులను నమ్మించింది. కత్తిపోట్లకు గురైన ఈశ్వర్‌కుమార్‌ను ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించగా అక్కడ చికిత్స పొందుతూ మరుసటి రోజు మృతిచెందాడు. ఈ ఘటనపై టూటౌన్‌ సీఐ రమేశ్‌కుమార్‌ కేసు నమోదు చేశారు. హతుడి భార్యపై అనుమానం వచ్చి ఆమెను విచారించగా అసలు విషయం వెలుగుచూసింది. నలుగురు నిందితులను బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ వెల్లడించారు. స్థానిక ఠాణాలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హతుడు కూడా ఆటో డ్రైవరే కాగా, ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని