logo

ముగ్గురు వారే..ఒక్కరు మారే

ఉత్కంఠ వీడింది.. కూర్పు కొలిక్కి వచ్చింది. విధేయతకు ప్రాధాన్యం ఇస్తూ.. రాజకీయ- సామాజిక సమీకరణాలు బేరీజు వేస్తూ... కొత్త మంత్రి మండలి చిట్టా సిద్ధమైంది. ఇందులో మూడు జిల్లాలకూ ప్రాధాన్యం దక్కింది. కాకినాడ జిల్లా నుంచి

Updated : 11 Apr 2022 06:47 IST

ఈనాడు - అమలాపురం, న్యూస్‌టుడే - అమలాపురం పట్టణం, రామచంద్రపురం :  ఉత్కంఠ వీడింది.. కూర్పు కొలిక్కి వచ్చింది. విధేయతకు ప్రాధాన్యం ఇస్తూ.. రాజకీయ- సామాజిక సమీకరణాలు బేరీజు వేస్తూ... కొత్త మంత్రి మండలి చిట్టా సిద్ధమైంది. ఇందులో మూడు జిల్లాలకూ ప్రాధాన్యం దక్కింది. కాకినాడ జిల్లా నుంచి తుని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ దాడిశెట్టి రాజాకు తొలిసారిగా చోటుదక్కింది. కోనసీమ జిల్లా అమలాపురం ఎమ్మెల్యే, తాజా మాజీ మంత్రి విశ్వరూప్‌.. రామచంద్రపురం ఎమ్మెల్యే, తాజా మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుకు రెండోసారి ప్రాధాన్యం లభించింది. తూర్పుగోదావరి జిల్లా నుంచి కొవ్వూరు ఎమ్మెల్యే, తాజా మాజీ మంత్రి తానేటి వనితకూ మళ్లీ అవకాశం దక్కింది. ఇన్నాళ్లూ మంత్రిగా ఉన్న కన్నబాబుకు మళ్లీ ప్రాతినిధ్యం లభించక పోవడం శ్రేణులను నిరుత్సాహపరిచింది.

అమాత్య.. రాజసం

పేరు: దాడిశెట్టి రాజా

నియోజకవర్గం: తుని

జిల్లా: కాకినాడ జిల్లా

నేపథ్యం: తుని మండలం ఎస్‌.అన్నవరం స్వస్థలం. తల్లిదండ్రులు సత్యనారాయణమ్మ, శంకర్రావు. భార్య లక్ష్మీచైతన్య, కుమారుడు శంకర్‌ మల్లిక్‌, కుమార్తె ఆశ్రిత.

సామాజిక సమీకరణల నేపథ్యంలో కాపు వర్గానికి చెందిన రాజాకు మంత్రి పీఠం వరించింది. ఈ సామాజిక వర్గం నుంచి ఇన్నాళ్లూ మంత్రిగా కొనసాగిన కన్నబాబును తప్పించడంతో.. కీలక నేతగా ఉన్న దాడిశెట్టి రాజాకు మంత్రిగా అవకాశం ఇవ్వడం అనివార్యమైంది. తొలుత ప్రజారాజ్యంలో చేరినా.. 2010లో వైకాపాలో చేరినప్పటి నుంచి పార్టీకి విధేయుడిగా ఉంటూ.. పార్టీ అభివృద్ధికి శ్రమించారు. తెదేపాలో కీలకమైన యనమల కోటలో వైకాపా జెండా ఎగరేయడంలో దాడిశెట్టి పాత్ర కీలకం.. ముఖ్యమంత్రితోపాటు.. పార్టీ పెద్దల దగ్గర ఉన్న పరపతితో తొలి కూర్పులోనే మంత్రి పదవి దక్కుతుందనే వాదన బలంగా వినిపించినా.. రెండో కూర్పులో మంత్రిగా అవకాశం లభించింది. కొత్తగా ఏర్పాటైన కాకినాడ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న తొలి మంత్రి రాజానే.

ఆనందంగా స్వీకరిస్తా..

ప్రతిపక్షంలో ఉన్నా.. అధికారంలో ఉన్నా.. నా వెంటే ఉన్న తుని ప్రజలు, కార్యకర్తలు, నాయకులకు కృతజ్ఞతలు. సీఎం జగన్‌ నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతా. ఏ బాధ్యత అప్పగించినా ఆనందంగా స్వీకరిస్తా.

వనితకు వరం

పేరు: తానేటి వనిత

నియోజకవర్గం: కొవ్వూరు

జిల్లా: తూర్పుగోదావరి

నేపథ్యం: గోపాలపురం పరిధి దేవరపల్లి మండలం యర్నగూడెం స్వగ్రామం. తండ్రి జొన్నకూటి బాబాజీరావు (మాజీ ఎమ్మెల్యే, గోపాలపురం), తల్లి సుశీల (విశ్రాంత ఉపాధ్యాయిని). భర్త డాక్టర్‌ తానేటి శ్రీనివాసరావు, కుమార్తె ప్రణవి.. 1995-97 వరకు వనిత నల్లజర్ల కె.ఎస్‌.ఆర్‌. కళాశాలలో జూనియర్‌ లెక్చరర్‌గా పనిచేశారు.

వైకాపా కష్టకాలంలో ఉన్నప్పటి నుంచి పార్టీకి విధేయురాలిగా ఉండడం.. సౌమ్యురాలిగా గుర్తింపు ఉండడం కలిసొచ్చింది. మాదిగ సామాజిక వర్గ మహిళ కావడంతో సమీకరణాలు అనుకూలించాయి. తొలివిడతలోనే పదవి దక్కించుకున్న ఈమె.. తాజాగా పీఠాన్ని పదిలం చేసుకోగలిగారు. క్యాడర్‌ను సమన్వయం చేసుకుని పార్టీ అభివృద్ధికి శ్రమించిన తీరూ సానుకూలంగా మారింది.

నమ్మకాన్ని నిలబెడతా..

నాకు రెండోసారి మంత్రి పదవి ఇస్తున్న సీఎంకు కృతజ్ఞతలు. విజన్‌ ఉన్న సీఎం సారథ్యంలో మళ్లీ అమాత్య బాధ్యతలు చేపట్టే అవకాశం రావడం ఆనందంగా ఉంది. సీఎం నమ్మకాన్ని నిలబెడతా. నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ విజయమే లక్ష్యంగా.. కార్యకర్తగా పనిచేస్తా.

అనుభవం.. చెల్లుబాటు

పేరు: చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ

నియోజకవర్గం: రామచంద్రపురం

జిల్లా: కోనసీమ

నేపథ్యం: రాజోలు నియోజకవర్గంలోని మలికిపురం మండలం శంకరగుప్తం పంచాయతీ పరిధి అడవిపాలెం స్వగ్రామం. తండ్రి వెంకన్న, తల్లి సుభద్రమ్మ.. భార్య వరలక్ష్మి, పిల్లలు నరేన్‌, ఉమాశివ శంకర్‌.

రామచంద్రపురం ఎమ్మెల్యే వేణు.. వివాదరహితులు. వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. పార్టీకి విధేయుడిగా ఉండటంతో అధిష్ఠానం మరోమారు చోటు కల్పించింది. శెట్టిబలిజ వర్గానికి చెందిన ఈయనకు సామాజిక సమీకరణ నేపథ్యంలో ప్రాధాన్యం ఇవ్వడం అనివార్యమైంది. కీలక అంశాల్లో సున్నితంగా వ్యవహరిస్తూ పార్టీ వాణిని బలంగా వినిపిస్తారు. గతంలో జడ్పీ ఛైర్మన్‌గా పనిచేసిన అనుభవం.. పరిచయాలు.. సేవ- ఆధ్యాత్మిక కార్యక్రమాలు.. రాజకీయ అనుభవం అన్నీ కలిసొచ్చిన అంశాలే.

అమ్మ దీవెన.. ప్రజల ఆశీస్సులు

అధినేత జగన్‌ నన్ను నమ్మి మళ్లీ అవకాశం కల్పించడం ఆనందంగా ఉంది. తల్లి దీవెనలు, కుటుంబ సహకారం.. ప్రజల ఆశీస్సులు.. అధినేత నమ్మకం నన్నీ స్థాయికి తెచ్చాయి. బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా బీసీలకు సీఎం ప్రోత్సాహంతో రూ.31 వేల కోట్ల లబ్ధిని వివిధ పథకాల ద్వారా అందించడం తృప్తినిచ్చింది.

విశ్వసనీయతకు పీఠం..

పేరు: పినిపే విశ్వరూప్‌

నియోజకవర్గం: అమలాపురం

జిల్లా: కోనసీమ

నేపథ్యం: ముమ్మిడివరం పరిధిలోని కాట్రేనికోన మండలం నడవపల్లి స్వస్థలం. తల్లిదండ్రులు సీతమ్మ, రెడ్డిపంతులు. భార్య బేబీ మీనాక్షి, కుమారులు కృష్ణారెడ్డి, అమిత్‌, శ్రీకాంత్‌.

అమలాపురం ఎమ్మెల్యే విశ్వరూప్‌కు సౌమ్యుడిగా.. వివాద రహితుడిగా పేరుంది. అంతకు మించి వైకాపా అధినేత దగ్గర వినయ విధేయుడిగా గుర్తింపు ఉంది. వైఎస్సార్‌కు అనుంగ శిష్యుడుగా గుర్తింపు ఉండడం.. కష్టకాలంలో అధినేత వెన్నంటి ఉండటం కలిసొచ్చింది. ఎస్సీ- మాల సామాజిక వర్గానికి చెంది.. కోనసీమలో పట్టున్న నాయకుడు కావడంతో సామాజిక, రాజకీయ సమీకరణాల్లో ప్రాధాన్యం ఇవ్వక తప్పలేదు. గతంలో కీలక శాఖలకు మంత్రిగా పనిచేసిన అనుభవమూ కలిసొచ్చింది.

బాధ్యత మరింత పెరిగింది

రెండోసారి మంత్రి పదవి రావడంతో నా బాధ్యత మరింత పెరిగింది. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి నా మీద ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయను. కోనసీమ జిల్లాలో తాగునీరు, రహదారుల సమస్యల పరిష్కారానికి.. ఆయా రంగాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తాం. సీఎస్సార్‌ నిధులతో మరింత అభివృద్ధికి చర్యలు తీసుకుంటాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని