logo

కుళాయివాటా.. జగన్‌ టాటా

ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రస్తుతం 1,000 గ్రామాల్లో బిందెడు నీళ్లు దొరకడం లేదు. ఏ పల్లెకు వెళ్లినా బిందెలు పట్టుకొని చకోర పక్షిలా జనం జలం కోసం ఎదురుచూస్తున్నారు.

Published : 13 Apr 2024 02:39 IST

ఆగిపోయిన జల్‌జీవన్‌
పల్లెల్లో ప్ర‘జల’ కష్టాలు
పత్తికొండ, న్యూస్‌టుడే

ఇంటింటికి కుళాయి ద్వారా నీటిని ఇవ్వాలన్న ఉద్దేశంతో జల్‌జీవన్‌ మిషన్‌ (జేజేఎం) పథకాన్ని తీసుకొచ్చాం.. 2021-22 తర్వాత ఆంధ్రప్రదేశ్‌ ఒక్క పైసా వినియోగించుకోలేకపోయింది.
- రాజ్యసభలో కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ చెప్పిన మాట ఇది.

స్వచ్ఛమైన జలాలు సరఫరా చేసి ప్రజల దాహార్తి తీర్చడంలో జగన్‌ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చు.!!

మ్మడి కర్నూలు జిల్లాలో ప్రస్తుతం 1,000 గ్రామాల్లో బిందెడు నీళ్లు దొరకడం లేదు. ఏ పల్లెకు వెళ్లినా బిందెలు పట్టుకొని చకోర పక్షిలా జనం జలం కోసం ఎదురుచూస్తున్నారు. కోడుమూరులో నీటి కోసం రోడ్డు దాటుతున్న ఓ వృద్ధుడిని వాహనం ఢీకొట్టడంతో మృతి చెందారు.. ఆస్పరి మండలంలో ఎద్దులబండ్లు కట్టుకొని నీటి కోసం వెళ్తున్నారు. ఆర్థిక మంత్రి బుగ్గన ఇలాకాలోనూ ‘పానీ’పట్టు యుద్ధాలు జరుగుతున్నాయి. గ్రామీణుల అవస్థలు మనసున్న ప్రతి ఒక్కరినీ కన్నీళ్లు పెట్టిస్తున్నా... సీఎం జగన్‌ను కదిలించలేకపోతున్నాయి. ప్ర‘జల’ కష్టాలు తీర్చేందుకు ఉద్దేశించిన జేజేఎం పథకాన్ని వినియోగించుకోలేని అసమర్థత కారణంగా ప్రజలు బలైపోవాల్సిన దుస్థితికి కారకులెవరు? ఉన్న నిధులనూ ఎందుకు వినియోగించుకోలేకపోయారు? అనవసర విషయాల్లో గొంతెత్తి గోల చేసే జిల్లా ఎమ్మెల్యేలు.. అవసరమైన అంశాల్లో ఎందుకు నోరు మెదపలేకపోతున్నారని జనం ప్రశ్నిస్తోంది.

ద్దికెరలోని సాయినగర్‌ కాలనీలో జల్‌జీవన్‌ మిషన్‌ కింద ఏర్పాటు చేసిన పైపులైన్‌ ఇది. బురుజుల, మద్దికెర, కొత్తపల్లి తదితర గ్రామాల్లో చేపట్టిన పనులు పూర్తిగా నాసిరకంగా ఉన్నాయి. స్థానికులకు చుక్క నీరందలేదు. మద్దికెరలో ఇంటింటికీ కుళాయి పేరుతో ఒక్కో దానికి రూ.వెయ్యి వసూలు చేస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు.

ప్రజల పథకం

ప్రతి ఇంటికీ నిత్యం 55 లీటర్ల రక్షిత తాగునీటిని అందించాలన్న సంకల్పంతో కేంద్రం 2019లో జల్‌జీవన్‌ మిషన్‌ (జేజేఎం) పథకానికి శ్రీకారం చుట్టింది.

నిధులు దండి

కర్నూలు జిల్లాలో 1,026, నంద్యాలలో 1,124 పనులు చేయాలని ప్రణాళిక రూపొందించారు. మొదటి విడత కర్నూలులో 526 పనులకు రూ.116.69 కోట్లు, నంద్యాలలో 554 పనులకు రూ.177.47 కోట్లు కేటాయించారు.


జగన్‌ గండి

2024 చివరి నాటికి వంద శాతం పనులు పూర్తి చేయాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా నిధులు వెచ్చించాలి. కేంద్రం తన వాటాను ఎప్పటికప్పుడు కేటాయిస్తున్నా పనులు పూర్తి చేయడంలో జగన్‌ ప్రభుత్వం చిత్తశుద్ధి చూపడం లేదు. పనుల తీరు చూస్తుంటే జగన్‌ ఏలుబడిలో పదేళ్లయినా పథకం పూర్తయ్యేలా లేదు.


1,080 పనులు.. రూ.294.16 కోట్లు

గ్రామాల్లో రక్షిత మంచినీటి పథకాల నిర్మాణంతోపాటు పైపులైన్లు, ఇంటింటికీ కుళాయిలు ఏర్పాటు చేయాలన్నది జల్‌జీవన్‌ పథకం ఉద్దేశం. ఇందులో భాగంగా కర్నూలు జిల్లాలో 24, నంద్యాలలో 29 మండలాల్లోని 672 గ్రామాల్లో 4.75 లక్షల మందికి సగటున రోజుకు 50 లీటర్ల నీటిని ఈ పథకం ద్వారా అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,080 పనులు చేయాల్సి ఉంది. ఇందుకు రూ.294.16 కోట్లు కేటాయించారు. రూ.5 లక్షల్లోపు పనులు నామినేషన్‌ పద్ధతిలో కట్టబెట్టారు. ఆపై విలువైన పనులను ఆన్‌లైన్‌లో టెండరు పిలిచి గుత్తేదారులకు అప్పగించారు.


గుత్తేదారుల వెనుకడుగు

రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో గుత్తేదారులు ముందుకు రావడం లేదు. ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు నాలుగుసార్లు  టెండర్లు పిలిచినా స్పందన లేదు. నంద్యాల జిల్లాలో రూ.58 కోట్ల విలువైన పనులు జరగ్గా కనీసం 20 శాతం మేర బిల్లులు చెల్లించలేదు. కర్నూలులో రూ.30 కోట్ల విలువైన పనులు జరిగాయి. ఆర్థిక మంత్రి నియోజకవర్గమైన డోన్‌లో 173 పనులకు మూడేళ్లలో 11 మాత్రమే చేశారు. 160 పనులు వివిధ దశల్లో ఆగుతూ సాగుతున్నాయి. రెండో విడతలో ఉమ్మడి జిల్లాలో రూ.575.58 కోట్ల పనులు చేపట్టాలి. రాష్ట్ర ప్రభుత్వం బిల్లులు చెల్లిస్తుందో లేదోనన్న సందేహంతో గుత్తేదారులు పనులు చేసేందుకు ముందుకు రావడం లేదు.


తేలిపోయిన నాణ్యత

ర్నూలు జిల్లాలో 203 పనులు పూర్తి చేసినట్లు 197 పనులు పురోగతిలో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. నంద్యాల జిల్లాలో 425 పనులు ప్రారంభించగా.. అందులో 207 వరకు పూర్తయ్యాయి. 137 పనులు పురోగతిలో ఉండగా 15 పనులు ఇంకా ప్రారంభమే కాలేదు. మిగిలినవి మధ్యలో ఆగిపోయాయి. ఇంటింటికీ కుళాయి కనెక్షన్‌ ఇచ్చేందుకు వీలుగా రోడ్లు తవ్వి, పైపులు ఏర్పాటు చేసి కుళాయిలు బిగించే పనులను స్థానిక జల సంఘాలను బినామీలుగా ముందుంచి స్థానిక నాయకులే పనులు చేసి మమ అన్పిస్తున్నారు. వాటిలో నాణ్యత తేటతెల్లమవుతోంది. గుత్తేదారుల ముసుగులో అధికార పార్టీ నాయకులే ఈ పనులను చేసి దోచుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. పత్తికొండ, ఆదోని, డోన్‌, నందికొట్కూరు, కోడుమూరు నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాల్లో వేసిన పైపులైన్లు ఇప్పటికే దెబ్బతిన్నాయి. కొన్ని గృహాలకు ఏర్పాటు చేసిన కుళాయిలు విరిగిపోయాయి. జల్‌జీవన్‌ మిషన్‌ పథకం పేరుతో రోడ్లను తవ్వేసి వదిలేయడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.


డబ్బా నీళ్లే గతి

‘‘ సురక్షిత నీరు అందక జిల్లాలో 3 లక్షల కుటుంబాలు నిత్యం కొనుగోలు చేస్తున్నాయి. ఒక్కో కుటుంబం రోజూ రూ.20 నుంచి రూ.30 వరకు వెచ్చిస్తోంది. వీరంతా నీటి కోసమే నెలకు రూ.60 లక్షల నుంచి రూ.90 లక్షల మేర ఖర్చు చేస్తున్నారు. ఏడాదికి రూ.10 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నారు. ’’’

బురుజులలో జల్‌జీవన్‌ మిషన్‌ పనులను రెండేళ్ల కింద ప్రారంభించారు. ఇక్కడ ఒక్క ఇంటికీ కుళాయి కనెక్షన్‌ ఇవ్వలేదు.. గ్రామంలో 600 కుటుంబాలున్నాయి. పత్తికొండ, హోసూరు నుంచి శుద్ధజలం తెప్పించుకుంటున్నారు. ఇందుకు నిత్యం రూ.20 నుంచి రూ.30 వరకు వెచ్చిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని