logo

అందని పుస్తకం.. దక్కని ఫలితం

ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో కేవలం 183 మంది రెగ్యులర్‌ అధ్యాపకులే బోధిస్తున్నారు. కొన్నిచోట్ల ప్రిన్సిపల్‌ పోస్టులే లేవు.

Published : 13 Apr 2024 02:47 IST

ఇంటర్‌ విద్య అంతా మిథ్య
కర్నూలు విద్య, న్యూస్‌టుడే

అతిథి అధ్యాపకులే దిక్కు

 • ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో కేవలం 183 మంది రెగ్యులర్‌ అధ్యాపకులే బోధిస్తున్నారు. కొన్నిచోట్ల ప్రిన్సిపల్‌ పోస్టులే లేవు. సీనియర్‌ అధ్యాపకులే ఆ బాధ్యతలు చూస్తున్నారు. వీరి ఆధ్వర్యంలోనే ఒప్పంద అధ్యాపకులు పాఠాలు బోధిస్తున్నారు.
 • పోస్టులు మంజూరు కాని చోట్ల క్రమబద్ధీకరణకు అవకాశం ఉండదనే భావనతో ఒప్పంద అధ్యాపకులు పని చేసేందుకు ఇష్టపడటం లేదు. రెండు జిల్లాల్లో 223 మంది ఒప్పంద అధ్యాపకులు ప్రస్తుతం పనిచేస్తున్నారు. వీరికి వేతనాలు సరిగ్గా అందడం లేదు.
 • చాలాచోట్ల అతిథి అధ్యాపకులే బోధిస్తున్నారు. వీరికి గంటకు రూ.150 చొప్పున నెలకు రూ.10 వేలకు మించకుండా వేతనాలు చెల్లించాలనే నిబంధన ఉంది. వీరు జూన్‌ నుంచి పాఠాలు చెబుతున్నా వేతనాలు మాత్రం సరిగ్గా అందడం లేదు.

17 కళాశాలల్లో 20 శాతం లోపే ఉత్తీర్ణత

ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు వెనుకబడ్డాయి. పాఠ్య పుస్తకాలు, అధ్యాపకుల కొరత, కళాశాలల్లో మౌలిక వసతుల లేమి బోధనంపై తీవ్ర ప్రభావం చూపింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 43 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఉండగా.. 17 కాలేజీల్లో 20 శాతం లోపే ఉత్తీర్ణత సాధించారు. కౌతాళంలో 73 మందికి 24, నాగులదిన్నెలో 70 మందికి 9, డోన్‌లో 58 మందికి 18 మంది, ఆలూరులో 82 మందికి 36 మంది ఉత్తీర్ణులయ్యారు. ఆయా కళాశాలల్లో ప్రథమ సంవత్సరంలో ఉత్తీర్ణత శాతం ఇలానే ఉంది.

ఇక్కడా అంతంతే

ఒకేషనల్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో మొదటి ఏడాది .. కర్నూలు జిల్లాలో 718 మందికిగాను 414, నంద్యాలలో 394 మందికి 229 మంది ఉత్తీర్ణత సాధించారు. రెండో ఏడాది.. కర్నూలు జిల్లాలో 594 మందికి 388 మంది, నంద్యాల జిల్లాలో 314 మందికిగాను 208 మంది ఉత్తీర్ణులయ్యారు. ఆదర్శ పాఠశాలల్లో.. మంత్రాలయంలో 68 మందికి 17 మంది, మద్దికెరలో 60 మంది ఆరుగురే పాసయ్యారు.


ఆశయం: ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న మార్పులను ఒడిసి పట్టుకోలేకపోతే పాశ్చాత్య దేశాల పిల్లల మాదిరిగా మన పిల్లలు సమాధానాలు చెప్పగలిగే స్థితిలో ఉండరు. పిల్లలను ప్రపంచ స్థాయికి తీసుకుపోవాలన్న లక్ష్యంతో పని చేస్తున్నాం. ఐటీ నిపుణులు, కంపెనీ ప్రతినిధులుగా నిలబెట్టాలన్నది మా ఆశయం.

- జులై 20న సీఎం జగన్‌ ప్రకటన.

ఫలితం: సంజామల ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో ముగ్గురు విద్యార్థులు ఉండగా ఇద్దరు పరీక్షలకు హాజరయ్యారు.. వారిద్దరూ ఫెయిలయ్యారు. 17 మంది ప్రథమ సంవత్సరం చదువుతుండగా 10 మంది పరీక్షలు రాశారు. ఇద్దరు ఉత్తీర్ణులయ్యారు. చిప్పగిరి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ప్రథమ సంవత్సరంలో 67 మంది విద్యార్థులకు ఒక్కరు, ద్వితీయ సంవత్సరంలో 54 మందికి నలుగురే ఉత్తీర్ణత సాధించారు.


లక్ష్యం దాటని కేజీబీవీలు

 • ఉమ్మడి జిల్లాలో 55 కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలు ఉన్నాయి. 2022-23 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్‌ తరగతులు ప్రారంభించారు. ఆయా కళాశాలల్లో పూర్తిగా అతిథి అధ్యాపకులతోనే బోధిస్తున్నారు. వీరికి వేతనాలు సరిగ్గా రాకపోవడంతో బోధనపై ప్రభావం చూపింది. గతేడాది చిప్పగిరి, కౌతాళం, హాలహర్వి కేజీబీవీల్లో సున్నా ఫలితాలు వచ్చాయి. ఈసారీ ఫలితాలు మెరుగుపడలేదు.
 • ద్వితీయ సంవత్సరం ఫలితాలను పరిశీలిస్తే గోనెగండ్లలో నలుగురికి ముగ్గురు, కౌతాళంలో 9 మందికి నలుగురు, వెల్దుర్తిలో 19 మందికి ఏడుగురు, ఎమ్మిగనూరులో 16 మందికి నలుగురు, ఓర్వకల్లులో 11 మందికి ఇద్దరు, హాలహర్విలో ఏడుగురికి ఒకరు, పెద్దకడబూరులోని ఏడుగురికి ఒకరు పాసయ్యారు.

భోజనం పెట్టని జగన్‌

తెదేపా ప్రభుత్వ హయాంలో జూనియర్‌ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేశారు. ఇది గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉండేది. వైకాపా ప్రభుత్వం రాగానే దీన్ని రద్దు చేసింది. ఉమ్మడి జిల్లాలో రూ.70 లక్షలు ఖర్చయ్యే ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీని సైతం నిలిపివేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ పేద విద్యార్థులపై ఆర్థిక భారం మోపింది. ఈ రెండు అంశాలు పేద విద్యార్థుల చదువుపై తీవ్ర ప్రభావం చూపాయి. దీంతో  రెండేళ్లుగా ఇంటర్‌ ఫలితాలు పడిపోయాయి. మరోవైపు ఉమ్మడి జిల్లాలో మూడు ప్రాంతాల్లో హైస్కూల్‌ ప్లస్‌లో ఇంటర్మీడియట్‌ ప్రవేశపెట్టింది. పదో తరగతి పూర్తయిన వారు ఇక్కడే కొనసాగుతుండటంతో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో ప్రవేశాలు తగ్గాయి.

 • ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ ప్రిన్సిపల్స్‌ లేని కళాశాలలు : 12
 • జూనియర్‌ కళాశాలలు : 43
 • కేజీబీవీలు : 55
 • రెగ్యులర్‌ అధ్యాపకులు : 183
 • ఒప్పంద అధ్యాపకులు : 223
 • అతిథి అధ్యాపకులు : 70
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని