logo

చెరువులో శవాలు

నగర శివారు.. గార్గేయపురం పరిధిలోని నగరవనం చెరువులో ముగ్గురు గుర్తు తెలియని మహిళలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఆదివారం కలకలం రేపింది.

Published : 20 May 2024 01:07 IST

నగరవనంలో కలకలం
ఎవరా ముగ్గురు మహిళలు

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే: నగర శివారు.. గార్గేయపురం పరిధిలోని నగరవనం చెరువులో ముగ్గురు గుర్తు తెలియని మహిళలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఆదివారం కలకలం రేపింది.. నిర్మాణంలో ఉన్న మసీదు వెనుక చెరువులో మొదట ఇద్దరు మహిళల మృతదేహాలు నీళ్లలో తేలాడుతూ కనిపించటంతో స్థానికులు కర్నూలు తాలుకా అర్బన్‌ పోలీస్‌స్టేషన్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ శ్రీధర్, ఎస్సై పీరయ్య మృతదేహాలను బయటకు తీయించి పరిశీలించారు. ఆధారాల కోసం అన్వేషిస్తుండగా రెండు మృతదేహాలకు కొద్ది దూరంలో గట్టున మరో మహిళ మృతదేహాన్ని గుర్తించారు. మొదట హిజ్రాలుగా భావించిన పోలీసులు హిజ్రాల సంఘం నాయకులను పిలిపించి చూపించగా కాదని నిర్ధారించారు. గాయాలు లేని మొదటి రెండు మృతదేహాలు మాత్రం శనివారం నదిలో పడినట్లు అనుమానిస్తున్నారు. తర్వాత దొరికిన మూడో మృతదేహంపై గాయాలు ఉండటంతో రెండు రోజుల కిందట మృతి చెందినట్లు భావిస్తున్నారు. సుమారు 35 నుంచి 45 ఏళ్ల వయసున్న మృతుల వివరాలు తెలియకపోవటంతో మిస్టరీగా మారింది. ఓ మృతురాలి ఎడమ చేతికి ప్రేమ ఆకారం గుర్తుతో పచ్చబొట్టు ఉంది. పోలీసు జాగిలం రప్పించటంతో చుట్టుపక్కల పరిసరాలు తిరిగింది. మొత్తం మూడు మృతదేహాలు కావటంతో కర్నూలు రేంజ్‌ డీఐజీ విజయరావు, జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్, అదనపు ఎస్పీ నాగరాజు ఘటనా స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. జిల్లా ఎస్పీ, డీఐజీ మీడియాతో మాట్లాడుతూ మహిళల మృతిపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. శవపరీక్ష ఆధారంగా ముందుకెళ్తామన్నారు.
మూడు బృందాల ఏర్పాటు
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కర్నూలు డీఎస్పీ విజయశేఖర్‌ మూడు బృందాలను ఏర్పాటు చేసి వేర్వేరు కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్లు తెలిసింది. వివాహేతర సంబంధాలు కలిగిన వ్యక్తులు, వ్యభిచార మహిళలతో వచ్చే విటులు ఆయా ప్రాంతాలకు రాత్రిపూట ఎక్కువగా వస్తారని తెలియడంతో పోలీసులు ఆయా కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఓ బృందం ఘటనా స్థలానికి అటు, ఇటు దగ్గరలోని సీసీ కెమెరాల పుటేజీని అన్వేషిస్తున్నారు. మూడో మృతదేహం ముందే ఎవరైనా చూశారా అనే అంశం విచారిస్తున్నారు. మృతులు తెలంగాణ వాసులుగా పోలీసులు అనుమానిస్తూ కర్నూలు ఆర్టీసీ బస్టాండు పరిసర ప్రాంతాల్లో విచారించారు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని