logo

నిధుల ఆటంకం

క్రీడాకారులను నిరంతరం ప్రోత్సహిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతున్నా అవి కేవలం మాటలకే పరిమితమయ్యాయి. ఆటలు అటకెక్కాయి. క్రీడాభివృద్ధికి నిధుల కేటాయింపు అంతంతమాత్రంగానే ఉంది.

Published : 20 May 2024 01:12 IST

క్రీడాకారులను నిరంతరం ప్రోత్సహిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతున్నా అవి కేవలం మాటలకే పరిమితమయ్యాయి. ఆటలు అటకెక్కాయి. క్రీడాభివృద్ధికి నిధుల కేటాయింపు అంతంతమాత్రంగానే ఉంది. దీనికితోడు రాష్ట్రస్థాయి స్కూల్‌ గేమ్స్‌ను పక్కన పెట్టేశారు. వేసవి శిబిరాలు నిర్వహించాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు.

 న్యూస్‌టుడే, కర్నూలు క్రీడలు

గ్రామీణ క్రీడాకారులను వెలుగులోకి తీసుకొచ్చేందుకు అప్పటి తెదేపా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 2016లో ఎన్టీఆర్‌ క్రీడా వికాస కేంద్రాల నిర్మాణానికిగాను కర్నూలు జిల్లా తడకనపల్లె గ్రామంలో శంకుస్థాపన చేశారు. మరోవైపు ఒక్కో స్టేడియానికి రూ.2 కోట్ల నిధులను తెదేపా ప్రభుత్వం కేటాయించింది. ఉమ్మడి జిల్లాలో గూడూరు, ఎమ్మిగనూరు, ఆలూరు, పత్తికొండ, డోన్, ఆత్మకూరు, నంద్యాలలో స్టేడియాల నిర్మాణాలు పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చింది. ఇందులో షటిల్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, జిమ్నాస్టిక్‌ క్రీడా కోర్టులు అందుబాటులోకి వచ్చాయి.

ఎన్టీఆర్‌ వికాస కేంద్రానికి వేసిన శిలాఫలకం

ఫీజులు పెంచేసి..

  • 2019లో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్రీడలను పూర్తిగా విస్మరించింది. ఎన్టీఆర్‌ క్రీడా వికాస కేంద్రాలను పట్టించుకోలేదు. జిల్లా వ్యాప్తంగా ఉన్న క్రీడా వికాస కేంద్రాల నిర్వహణను గాలికొదిలేయడంతో భవనాలు అధ్వానంగా మారాయి. స్విచ్‌ బోర్డులు, క్రీడా మైదానాలు దెబ్బతిన్నాయి. 25 శాతం పనులు పూర్తి చేయని కారణంగా కర్నూలు, నందికొట్కూరు, బనగానపల్లిలోని ఎన్టీఆర్‌ క్రీడా వికాస కేంద్రాల పనులను ఆపేశారు.
  • రూ.2 కోట్లతో నిర్మించాల్సిన మైదానాల్లో కేవలం నందికొట్కూరు, పగిడ్యాలలో రూ.1.60 లక్షలతో ఇండోర్‌ స్టేడియాలను మాత్రమే పూర్తి చేశారు. ప్లే అండ్‌ పే పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. శిక్షణకు వచ్చే క్రీడాకారుల నుంచి డబ్బులు వసూలు చేయాలన్న నిబంధన పెట్టి ప్రతి నెలా ఫీజులు నిర్ణయించింది. ఆ తర్వాత కొంతకాలానికే నెలకు రూ.500 ఉన్న ఫీజును పిల్లలకు రూ.1,500, పెద్దలకు రూ.3 వేలకు పెంచడంతో పేద క్రీడాకారుల పరిస్థితి దయనీయంగా మారింది.

వందలాది మైదానాల అభివృద్ధి

2015-16లో గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఉపాధి హామీ పథకం కింద ఉమ్మడి జిల్లాలో ప్లే ఫీల్డ్‌ మైదానాలకు శ్రీకారం చుట్టింది. జడ్పీ ఉన్నత పాఠశాలల్లో రెండెకరాల భూమి ఉండాలని నిబంధనలు ఉన్నాయి. మొదట 516 పాఠశాలలను ఎంపిక చేశారు. ఆ తర్వాత రెండెకరాల నుంచి 1.50 ఎకరాల భూమి నిబంధనలు సడలిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 216 పాఠశాలల్లో వాలీబాల్, ఫుట్‌బాల్, కబడ్డీ, ఖోఖో కోర్టులతోపాటు వాకింగ్‌ ట్రాక్‌ సైతం నిర్మించారు.

ప్రతిభ గుర్తించి.. ఉపకార వేతనాలిచ్చి

అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా గాంఢీవ ప్రాజెక్టును తెదేపా ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాల మైదానాలు, స్టేడియాల్లో అథ్లెటిక్స్‌లో శిక్షణ ఇచ్చింది. తర్ఫీదు పొందిన చిన్నారులకు అంతర్జాతీయ శిక్షకుల ఆధ్వర్యంలో నాగార్జున విశ్వవిద్యాలయంలో ప్రత్యేక శిక్షణ కేంద్రం ఏర్పాటుచేసి క్రీడా భవిష్యత్తుకు పునాది వేసింది. కర్నూలు కేంద్రంగా ఈత శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసింది. పేద క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభను గుర్తించి నెలకు రూ.1,500 ఉపకార వేతనం ఇచ్చి అథ్లెటిక్స్, ఈత వంటి అంశాల్లో తర్ఫీదు ఇచ్చారు.

ఏటా జిల్లా, రాష్ట్రస్థాయిలో నిర్వహించిన స్కూల్‌ గేమ్స్‌ పోటీల్లో ప్రతిభ కనబరిచిన జిల్లా క్రీడాకారులు జాతీయ స్థాయిలో పతకాలతో మెరిశారు. 

క్రీడాకారులకు ఇబ్బందులే..

  •  ఏటా స్కూల్‌ గేమ్స్‌ ఆధ్వర్యంలో నిర్వహించే క్రీడా పోటీలు గత మూడేళ్లుగా జరగడం లేదు. ఫలితంగా పాఠశాల విద్యార్థులు, ఉమ్మడి జిల్లాలో 200 మంది క్రీడాకారులు జాతీయస్థాయి పోటీలకు దూరం కావాల్సి వచ్చింది. వారంతా ఉన్నత విద్య ప్రవేశాల్లో 2 శాతం క్రీడా కోటాను కోల్పోవాల్సి వచ్చింది.   
  • ఏటా మే నెలలో వేసవి శిబిరాలు నిర్వహించి విద్యార్థులను ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దాల్సి ఉంది. దీని కోసం నిధులు కేటాయించాల్సి ఉంది. ఈ ఏడాది ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో శిబిరాలు ప్రారంభం కాలేదు. దీనికితోడు ప్రస్తుతం వర్షాలు పడుతున్న నేపథ్యంలో పోటీలు నిర్వహించే పరిస్థితి కానరావడం లేదు. ఫలితంగా గ్రామీణ క్రీడాకారుల్లో ప్రతిభ వెలికితీయలేని పరిస్థితి ఏర్పడింది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని