logo

‘పట్టా’తప్పిన డిగ్రీ చదువులు

డిగ్రీ చదువు ‘పట్టా’ తప్పింది. ఇంటర్మీడియట్‌ ఫలితాలొచ్చి 45 రోజులు గడిచినా డిగ్రీ ప్రవేశాల షెడ్యూల్‌ విడుదల కాలేదు.

Updated : 28 May 2024 04:41 IST

గందరగోళంగా ప్రవేశాల ప్రక్రియ 
ఇప్పటి వరకు విడుదలకాని ప్రకటన

నంద్యాల పట్టణం, కర్నూలు విద్య, న్యూస్‌టుడే : డిగ్రీ చదువు ‘పట్టా’ తప్పింది. ఇంటర్మీడియట్‌ ఫలితాలొచ్చి 45 రోజులు గడిచినా డిగ్రీ ప్రవేశాల షెడ్యూల్‌ విడుదల కాలేదు. దీనిపై ఎలాంటి స్పష్టత లేకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో 14 ప్రభుత్వ, 88 ప్రైవేటు, ఎయిడెడ్‌ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. 2020 నుంచి డిగ్రీ ప్రవేశాలను ఆన్‌లైన్‌ విధానంలో చేపడుతున్నారు. గతేడాది (2023-24) 9,985 మంది విద్యార్థులు డిగ్రీలో చేరారు. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాల ప్రకటన ఇప్పటివరకు విడుదల కాలేదు. కర్నూలు నగరంలోని క్లస్టర్‌ వర్సిటీ పరిధిలో ఉన్న ఫర్‌ మెన్, సిల్వర్‌జూబ్లీ, కేవీఆర్‌ మహిళా డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు ప్రారంభమయ్యాయి.

పేరుకే విద్యా క్యాలెండర్‌

రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి 2023 జులైలో ప్రారంభం కావాల్సిన తరగతులు ఆగస్టులో మొదలుపెట్టి అదే నెల 23వ తేదీన పరీక్షలు నిర్వహించడం గమనార్హం. రెండో సెమిస్టర్‌ పరీక్షలు ఈ ఏడాది జనవరిలో నిర్వహించాలని ఆర్‌యూ రూపొందించిన విద్యా క్యాలెండరులో ఉంది. కానీ మే నెలలో నిర్వహిస్తున్నారు. విద్యా క్యాలెండర్‌ ప్రకారం ఏప్రిల్, మే నెలల్లో వేసవి సెలవులు ఉంటాయి. ఆర్‌యూ పరిధిలో గత మూడేళ్లుగా వేసవి సెలవులు ఇచ్చిన దాఖలాలు లేవు. ఈ వేసవి సెలవుల్లో పరీక్షలు ఎలా నిర్వహిస్తారంటూ విద్యార్థి సంఘాల నేతలు నిలదీసినా.. ఉన్నత విద్యా మండలికి ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయింది.

కొత్త కోర్సులకు అనుమతి వచ్చేనా

ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్త కోర్సులు ప్రవేశపెట్టేందుకు డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు దరఖాస్తు చేసుకున్నాయి. నంద్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీకాంలో డిజిటల్‌ మార్కెటింగ్, బీఏ ఆనర్స్, బీఎస్సీ కెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్స్‌ తదితర కోర్సులకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ కోర్సులకు అనుమతి వస్తే కొత్తగా 180 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ కళాశాలల్లో కొన్ని గ్రూపులకు సంబంధించి అత్యధిక శాతం మార్కులు వచ్చిన వారికే ప్రవేశాలు లభిస్తాయి. ఇలాంటి కళాశాలల్లోనూ గతేడాది బీకాం, బీఎస్సీ గ్రూపుల్లో కొన్ని సీట్లు మిగిలిపోయాయి.

పీజీ ప్రవేశాలు అంతంతే?

ఆర్‌యూ పరిధిలో సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కింద ఆరు కోర్సులు, రెగ్యులర్‌గా 8 కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఒక్కో గ్రూపునకు 35 నుంచి 60 సీట్లు అందుబాటులో ఉన్నాయి. మొత్తం 625 సీట్లు ఉన్నప్పటికీ 45 శాతం కూడా భర్తీ కాకపోవడం గమనార్హం. గతేడాది జరిగిన పీజీ ప్రవేశాల్లో 344 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. దీనికితోడు అధ్యాపకుల కొరతతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.

అక్టోబరులో చేరిక ఆ వెంటనే పరీక్ష

రాష్ట్రంలో ఉన్నత విద్యా మండలి అమలుచేస్తున్న డిగ్రీ దరఖాస్తు విధానంతో కొత్త చిక్కులు తలెత్తుతున్నాయి. గతేడాది ఇంజినీరింగ్, డిగ్రీ కౌన్సెలింగ్‌ ప్రక్రియను ఒకేసారి నిర్వహించారు. కొంతమంది విద్యార్థులు ఇంజినీరింగ్, డిగ్రీ ప్రవేశాలకు ఒకేసారి దరఖాస్తు చేసుకుంటున్నారు. పలువురు ఇంజినీరింగ్‌కు తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు. డిగ్రీ కళాశాలలో సీటు వచ్చినా.. ఇంజినీరింగ్‌ సీటొస్తే అందులోనే చేరిపోతున్నారు. ఫలితంగా వారికి కేటాయించిన డిగ్రీ సీటు మరొకరికి ఇచ్చే అవకాశం లేకుండా బ్లాక్‌ అయిపోతుంది. గతేడాది మూడో విడత కౌన్సెలింగ్‌ అక్టోబరులో జరిగింది. జులైలో ప్రారంభమైన ప్రవేశాల ప్రక్రియ అక్టోబరు వరకు సుదీర్ఘంగా సాగింది. అక్టోబరులో చేరిన విద్యార్థులు వెంటనే సెమిస్టర్‌ పరీక్షలకు హాజరవ్వాల్సి వచ్చింది.

గందరగోళంగా సింగిల్‌ మేజర్‌ సబ్జెక్ట్‌

2022-23 విద్యా సంవత్సరంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి తీసుకొచ్చిన సింగిల్‌ మేజర్‌ సబ్జెక్టు విధానంపై విద్యార్థులకు పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే సమయంలో ప్రధాన సబ్జెక్టు వివరాలు మాత్రమే చూపుతోంది. దానికి అనుబంధంగా బోధించే మిగతా సబ్జెక్టుల వివరాలు విద్యార్థులకు తెలియడం లేదు. తమకు నచ్చిన మేజర్‌ సబ్జెక్టును ఎంచుకుని కోర్సులో చేరాక తమకు ఆసక్తిలేని అనుబంధ సబ్జెక్టులు బోధిస్తుండటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇది ఫలితాలపై ప్రభావం చూపుతోంది. గతేడాది పలు ప్రభుత్వ కళాశాలల్లో సింగిల్‌ మేజర్‌ సబ్జెక్టు గురించి, దానికి దరఖాస్తు చేసుకునే విధానంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అధ్యాపకులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ఏడాది ఆ అవగాహన కార్యక్రమాలపైనా ఇంతవరకు స్పష్టత కరవైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని