logo

చిన్నారిని మింగిన నీటికుంట

చిప్పగిరి మండలం సంగాల గ్రామంలో అఖిల్‌(3) అనే చిన్నారిని మంగళవారం నీటికుంటలో పడి మృతిచెందాడు. తల్లిదండ్రులు, బంధువులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన కువర గాయత్రి, మహానంది దంపతులకు ఐదుగురు సంతానం.

Published : 12 Jun 2024 01:50 IST

అఖిల్‌ (పాతచిత్రం) 

చిప్పగిరి, న్యూస్‌టుడే: చిప్పగిరి మండలం సంగాల గ్రామంలో అఖిల్‌(3) అనే చిన్నారిని మంగళవారం నీటికుంటలో పడి మృతిచెందాడు. తల్లిదండ్రులు, బంధువులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన కువర గాయత్రి, మహానంది దంపతులకు ఐదుగురు సంతానం. నలుగు కుమార్తెలు, ఒక్కగానొక్క కుమారుడు ఉన్నారు. బాలుడు అఖిల్‌ ఆడుకుంటూ వెళ్లి గ్రామం సమీపంలోని బీసీ కాలనీలోని నీటికుంటలో పడ్డాడు. ఆ సమయంలో ఎవరూ చూడకపోవడంతో బాలుడిని కాపాడులేకపోయారు. తర్వాత బాలుడు కనిపించడం లేదని గాలించారు. కుంటలో శవమై కనిపించాడు. ఒక్కగానొక్క కుమారుడు మృతిచెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. 


బతుకుదెరువుకు వెళ్లి వలస కూలీ మృతి 

మంత్రాలయం గ్రామీణం (కౌతాళం), న్యూస్‌టుడే: బతుకుదెరువు కోసం బెంగళూరుకు వలస వెళ్లిన కౌతాళం మండలం గుడికంబాలి గ్రామానికి చెందిన మేకల మౌల (32) అనే వ్యక్తి భవనం నుంచి కాలుజారి కింద పడి మృతి చెందారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. మేకల మౌల ఇక్కడ పనులు లేకపోవడంతో బెంగళూరుకు వలస వెళ్లారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసేందుకు స్వగ్రామానికి వచ్చి వెళ్లారు. భవన నిర్మాణ పనులు చేస్తుండగా కాలు జారి భవనం పైనుంచి కింద పడిపోయారు. అక్కడున్న కూలీలు, భవన నిర్మాణ యజమానులు వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందారు. మౌలకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. మంగళవారం కౌతాళం మండలం తెదేపా అధ్యక్షుడు ఉలిగయ్య, శివ, గోవిందు, గోపాల్‌ ఆయన మృతదేహానికి నివాళి అర్పించారు.  


పోలీసుల అదుపులో హత్య కేసు నిందితులు!

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే : వెల్దుర్తి మండలం బొమ్మిరెడ్డిపల్లెకు చెందిన ఇద్దరు నిందితులను కర్నూలు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈనెల 9న  బొమ్మిరెడ్డిపల్లెకు చెందిన తెదేపా నాయకుడు గిరినాథ్‌ చౌదరి హత్యకు గురైన సంగతి విదితమే. ఈ ఘటన నేపథ్యంలో సివిల్‌ పోలీసులతోపాటు కేంద్ర బలగాలను సైతం గ్రామంలో మోహరింపజేశారు. వెల్దుర్తి పోలీసుస్టేషన్‌లో 16 మందిపై హత్య కేసు నమోదు చేశారు. నిందితుల కోసం పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఇద్దరు ప్రధాన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని