logo

ఉపాధిలో అవినీతి మేటలు

గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకంలో అవినీతి మేటలు వేసింది. పథకం లక్ష్యం నెరవేరకపోగా నిధులు దుర్వినియోగం అవుతున్నాయి. సాగునీటి వనరుల్లో పనులు చేస్తున్నట్లు ఏటా రూ.వందల కోట్లు వెచ్చిస్తున్నారు. అయినా ఎలాంటి ప్రయోజనం కలగడం లేదని రైతులు చెబుతున్నారు.

Published : 12 Jun 2024 02:10 IST

గడివేములలో కుందూనదిలో పది రోజుల కిందట చేసిన పనులు చిన్నపాటి వర్షానికే ఆనవాళ్లు చెదిరాయి

పాణ్యం, న్యూస్‌టుడే : గ్రామీణ జాతీయ ఉపాధి హామీ పథకంలో అవినీతి మేటలు వేసింది. పథకం లక్ష్యం నెరవేరకపోగా నిధులు దుర్వినియోగం అవుతున్నాయి. సాగునీటి వనరుల్లో పనులు చేస్తున్నట్లు ఏటా రూ.వందల కోట్లు వెచ్చిస్తున్నారు. అయినా ఎలాంటి ప్రయోజనం కలగడం లేదని రైతులు చెబుతున్నారు. ఈ ఏడాది చేసిన పనులు వచ్చే ఏడాది కనిపించడం లేదు.. అక్కడ పనులు చేసినట్లు ఆనవాళ్లు లేవని సామాజిక తనిఖీ బృందం తాఖీదులిచ్చి వదిలేస్తున్నారు. చేసిన పనులే మళ్లీ చేయడం పరిపాటిగా మారింది. పనులు చేయకుండానే కూలీల పేరుతో నిధులు స్వాహా చేస్తున్నారు. 

కూలీల పేరుతో మెక్కేస్తున్నారు

ఉపాధిహామీ పనుల్లో జరిగిన అవకతవకలను గుర్తించేందుకు ఏటా సామాజిక తనిఖీలు చేపడుతున్నారు. నదులు, కేసీ కాల్వలో పూడిక తీసినట్లు ఆనవాళ్లే కనిపించడం లేదు.. పనులెక్కడ చేశారో తెలియడం లేదని తనిఖీ అధికారులు తేల్చారు. సిబ్బంది మాత్రం సమీపంలోని రైతులు ఇసుక, మట్టి తరలించారని చెప్పి తమ అక్రమాలను కప్పిపుచ్చుకొంటున్నారు. ఉపాధి పనులకు రాని వారి పేర్లనూ సిబ్బంది మస్టర్లలో నమోదు చేస్తున్నారు. వారికి వేతనాలు చెల్లించి చెరో సగం పంచుకుంటున్నారు. గతంలో గడిగరేవుల గ్రామంలో ఉపాధి పనులకు వెళ్లని వారికి వేతనాలు చెల్లించినట్లు విచారణలో నిర్ధారణ జరిగింది. కాల్వల్లో పూడిక లేకున్నా తొలగించినట్లు బిల్లులు చేసి నిధులు దోచేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో ఉపాధి సిబ్బంది స్థానిక నాయకులకు పెద్దఎత్తున మామూళ్లు ఇస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

కరిమద్దెలలోని సీసీ కాల్వల్లో పూడిక తొలగించినట్లు బిల్లులు మంజూరు చేశారు 

పూడికతీత పేరుతో నిధుల దుర్వినియోగం

ఏటా కేసీ , ఎస్సార్బీసీ, తెలుగుగంగ కాల్వల్లో పూడికతీత పనులు చేస్తున్నారు. గతంలో చేసిన చోటనే మళ్లీ చేస్తున్నారు. గతంలో ముళ్లపొదల తొలగింపు, భూముల చదును, పొలాల్లో రాళ్ల తొలగింపు వంటి పనులు చేసేవారు.. ఇప్పుడు పూడికతీత పనులే చేస్తున్నారు. సాధారణంగా కాంక్రీటు బెడ్డింగ్‌ వేసిన సీసీ కాల్వల్లో పూడిక ఉండదు. ఉపాధిహామీ సిబ్బంది మాత్రం ఏటా పూడిక తీసినట్లు లెక్కలు రాసుకుంటోంది. ఉపాధి సిబ్బంది మరో అడుగు ముందుకేసి నదుల్లోనూ పూడిక తీయిస్తున్నారు. కుందూనదిలో పూడిక తొలగించినట్లు బిల్లులు చెల్లిస్తున్నారు. నదిలోని ఇసుకను తీసి పక్కనపోస్తున్నారు. వరద వస్తే మళ్లీ ఆ ప్రాంతంలో ఇసుక చేరుతోంది. ఇలా ఏటా జరుగుతోంది. అయినాసరే నదుల్లో పూడిక తీయించి బిల్లులు చెల్లిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని