logo

అందని రుణం.. సాగు భారం

రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. విస్తారంగా వర్షాలు కరుస్తున్నాయి. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమైన పది రోజులకే సాధారణ వర్షపాతం వంద శాతం పడింది. ఇప్పటికే కొందరు అన్నదాతలు విత్తనాలు విత్తారు.. మరికొందరు పెట్టుబడుల కోసం నిరీక్షిస్తున్నారు.

Published : 12 Jun 2024 02:13 IST

ఖరారు కాని వార్షిక రుణ ప్రణాళిక
పెట్టుబడులకు తప్పని అవస్థలు

కర్నూలు, నంద్యాల వ్యవసాయం, న్యూస్‌టుడే: రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. విస్తారంగా వర్షాలు కరుస్తున్నాయి. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమైన పది రోజులకే సాధారణ వర్షపాతం వంద శాతం పడింది. ఇప్పటికే కొందరు అన్నదాతలు విత్తనాలు విత్తారు.. మరికొందరు పెట్టుబడుల కోసం నిరీక్షిస్తున్నారు. కర్షకుల చేతిలో చిల్లిగవ్వ లేదు. జిల్లా వార్షిక రుణ ప్రణాళిక ఇంకా ఖరారు చేయకపోవడం ఇబ్బందికరంగా మారింది. జిల్లా సాగు విస్తీర్ణం, పెట్టుబడి అవసరాలను దృష్టిలో పెట్టుకొని బ్యాంకులు వార్షిక రుణ ప్రణాళిక ఖరారు చేస్తాయి. సాధారణంగా ఏటా మే నెలలో వార్షిక రుణ ప్రణాళిక ఖరారవుతుంది. వ్యవసాయ రంగానికి బ్యాంకుల వారీగా ఏ మేరకు రుణాలివ్వాలనేది నిర్దేశిస్తారు. దాని ప్రకారంగా బ్యాంకులు రైతులకు రుణాలు ఇస్తాయి. ఎన్నికల కోడ్‌ ముగిసినా అధికారుల్లో కదలిక లేకపోవడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

కొర్రీలు పెడుతున్న బ్యాంకర్లు

గతేడాది ఖరీఫ్, రబీ సీజన్లలో తీవ్ర వర్షాభావం కారణంగా పంటలు పెద్దగా పండలేదు. రుణాలు తీసుకున్న వేలాది మంది రైతులు సకాలంలో చెల్లించలేదు. పాత బాకీ చెల్లించి తిరిగి కొత్త రుణాలు తీసుకోవాలని బ్యాంకు అధికారులు చెబుతుండటంతో అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏటా వార్షిక రుణ ప్రణాళికలో భాగంగా లక్ష్యం భారీగా నిర్ణయించుకున్నా రుణాలు ఇవ్వడంలో కొన్ని బ్యాంకులు కఠిన నిబంధనలు అమలుచేస్తున్నాయి. కొన్ని బ్యాంకులు లక్ష్యానికి మించి రుణాలిస్తుంటే.. మరికొన్ని బ్యాంకులు రుణ ప్రణాళికను పట్టించుకోవడం లేదు. పంట రుణాలను దీర్ఘకాలికంగా చెల్లించలేదన్న కారణంతో ఉమ్మడి జిల్లాలో 20 వేల మందికిపైగా రైతులను ఎన్‌పీఏ (నాన్‌ పర్‌ఫార్మింగ్‌ అసెట్స్‌) జాబితాలో చేర్చినట్లు సమాచారం. 

అధిక వడ్డీలకు అప్పులు చేసి

  • ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌పై అన్నదాతలు ఆశలు పెంచుకున్నారు. ముందస్తు వర్షాలు మురిపించడంతో కర్షకులు సాగు వైపు దృష్టి పెట్టారు. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసేందుకు చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి అధిక వడ్డీలకు, మార్కెట్‌ కమిటీల్లో కమీషన్‌ ఏజెంట్ల దగ్గర అప్పులు చేసి పెట్టుబడులు పెట్టే పరిస్థితి నెలకొంది. వ్యాపారులు, దళారులు, కమీషన్‌ ఏజెంట్లు.. ఇలా వివిధ మార్గాల్లో రైతులు రూ.వెయ్యి కోట్లకుపైగా అప్పులు చేసి ఉంటారని అధికారులే చెబుతున్నారు. 
  • కర్నూలు జిల్లాలో ఖరీఫ్‌ సాధారణ సాగు 4,19,221 హెక్టార్లు. ప్రధాన పంటలైన పత్తి 2,43,689 హెక్టార్లు, వేరుశనగ 58,969, మిరప 29,998, కంది 25,557, ఉల్లి 15,698, వరి 12,771 హెక్టార్లలో సాగవుతుందని అంచనా. ఇప్పటి వరకు 4,598 హెక్టార్లలో పంటలు సాగయ్యాయి.
  • నంద్యాల జిల్లాలో ఖరీఫ్‌ సాధారణ సాగు 2,36,539 హెక్టార్లు. ప్రధాన పంటలైన వరి 65,787, మొక్కజొన్న 45,210, కంది 36,234, పత్తి 23,516, మిర్చి 12,262, వేరుశనగ 13,148, మినుము 8,072, ఉల్లి 4,091 టమాట 2,349 హెక్టార్లలో పంటలు సాగవుతాయని అంచనా వేశారు. ఇప్పటికే 5,558 హెక్టార్లలో రైతులు వివిధ రకాల పంటలు వేశారు.

ఎగనామం పెట్టిన వైకాపా

  • గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రైతు భరోసా పెట్టుబడి సాయం, కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్‌ సాయం కలిపి ఒక్కో రైతుకు రూ.7,500 వరకు వచ్చేవి. ప్రస్తుతం ఆ డబ్బులు కూడా రాలేదు. కనీసం విత్తనాలకైనా డబ్బులు ఆసరాగా ఉండేవి. ఉమ్మడి జిల్లాలో సుమారు 5 లక్షల మంది రైతులకు సుమారు రూ.375 కోట్ల పెట్టుబడి సాయం అందకుండా పోయింది. 
  • గతేడాది ఖరీఫ్‌ సీజన్‌లో కరవు మండలాలను ప్రకటించిన ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నట్లు చెప్పింది. ఎన్నికల పోలింగ్‌ అనంతరం మే 18న పంట నష్టపరిహారం జమ చేసినట్లు పేర్కొంది. మొత్తం 3,75,244 మంది రైతులకు రూ.460.57 కోట్లు రావాల్సి ఉండగా అందులో సుమారు 2 లక్షల మంది రైతులకు రూ.280 కోట్లకుపైగా పంట నష్టపరిహారం రావాల్సి ఉంది. సుమారు 60 శాతం మంది రైతులు పరిహారం కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ప్రతిరోజూ బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా పరిహారం మాత్రం రైతుల ఖాతాల్లో జమ కాలేదు. 
  • రబీ సీజన్‌లో వైకాపా ప్రభుత్వం కరవు మండలాలను ప్రకటించింది. ఓట్ల లెక్కింపు అనంతరం రబీ సీజన్‌ కరవు మండలాల జాబితాను ప్రభుత్వానికి నివేదించారు. 31 మండలాల్లో 1.16 లక్షల మంది రైతులకు రూ.128.87 కోట్ల పంట నష్టపరిహారం అవసరమని గత మే నెలలో అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. పంట నష్టపరిహారం రావాలంటే మరో మూడు నెలలు పడుతుందని అధికారులు అంటున్నారు. ఈ నేపథ్యంలో రబీ కరవు సాయం కథ కంచికే అన్నట్లు మారింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని