logo

అటకెక్కిన యునాని పరిశోధన

ఐదేళ్లు అధికారంలో ఉన్న వైకాపా ప్రభుత్వం స్థలం కేటాయించకపోవడంతో యునాని వైద్య పరిశోధన ప్రాజెక్టు అటకెక్కింది. రాష్ట్రంలోని ఒకే ఒక్క యునాని వైద్య కళాశాల కర్నూలులో ఉంది.

Published : 12 Jun 2024 02:14 IST

స్థలం కేటాయించని గత ప్రభుత్వం

షెడ్డులో కొనసాగుతున్న ‘క్లినికల్‌ రీసెర్చ్‌ యూనిట్‌’

ఈనాడు, కర్నూలు: ఐదేళ్లు అధికారంలో ఉన్న వైకాపా ప్రభుత్వం స్థలం కేటాయించకపోవడంతో యునాని వైద్య పరిశోధన ప్రాజెక్టు అటకెక్కింది. రాష్ట్రంలోని ఒకే ఒక్క యునాని వైద్య కళాశాల కర్నూలులో ఉంది. యునాని వైద్య రంగంలో పరిశోధనలు పెంచాలన్న ఉద్దేశంతో నగరంలోని అబ్దుల్‌హక్‌ యునాని వైద్య కళాశాల ఆవరణలో కేంద్ర ప్రభుత్వం 2010లో క్లినికల్‌ రీసెర్చ్‌ యూనిట్‌ (సిఆర్‌యూ)ను ఏర్పాటు చేసింది. ఇద్దరు వైద్యులు, ఇద్దరు పరిశోధక అసొసియేట్లు, ఇద్దరు ఫార్మసిస్టులతోపాటు మరో నలుగురు సిబ్బందిని కేటాయించారు. పరిశోధనలు మరింత విస్తృతం చేయాలన్న లక్ష్యంతో సెంట్రల్‌ కౌన్సిల్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఇన్‌ యునాని మెడిసిన్‌ (సీసీఆర్‌యూఎం) అధునాతన పరిశోధన కేంద్రం నిర్మించేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఇందుకు అవసరమైన భూమిని కేటాయిస్తే నిధులు విడుదల చేస్తామని కేంద్ర ఆయుష్‌ మంత్రిత్వశాఖ ముందుకొచ్చింది. జగన్నాథగట్టు ప్రాంతంలో రెండెకరాలు ఇచ్చేందుకు కలెక్టర్‌ తొలుత సుముఖత వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారులూ పరిశీలించారు. గత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పరిశోధన కేంద్రానికి పునాది పడలేదు. చిన్నపాటి రేకుల షెడ్డులో పరిశోధనలు కొనసాగిస్తున్నారు.

వేతనాలు నిలిపివేసిన వైకాపా

నగరంలో అబ్దుల్‌హక్‌ యునాని వైద్య కళాశాలను 1954లో ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఒకే ఒక్క ఎయిడెడ్‌ వైద్య కళాశాలగా ఇది గుర్తింపు పొందింది. ఎయిడెడ్‌ కళాశాలల్లో పోస్టులకు ప్రభుత్వం వేతనాలిచ్చే విధానాన్ని నిలిపివేయడంతో కళాశాల నిర్వహణ యాజమాన్యానికి భారంగా మారింది. ఒకప్పుడు వైద్యకళాశాలలో 32 మందికి ప్రభుత్వం వేతనాలిచ్చేది. ప్రస్తుతం బోధన విభాగంలో ఏడుగురికే చెల్లిస్తోంది. మిగిలిన వారి వేతనాలు ‘అంజుమన్‌ ఇస్లామియా’ సంస్థ భరిస్తోంది. 150 నుంచి 200 మంది వరకు రోగులు వైద్యం కోసం వస్తుంటారు. కళాశాలకు అనుబంధంగా 50 పడకల ఆసుపత్రి కొనసాగుతోంది. గత ప్రభుత్వం కళాశాల అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోలేదు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు