logo

ఉపాధ్యాయ ఖాళీలు 1,600

కూటమి అధికారంలోకి వస్తే తొలి సంతకం మెగా డీఎస్సీ పైనే చేస్తానని.. ఉమ్మడి జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చింది.

Published : 12 Jun 2024 02:16 IST

చిగురిస్తున్న మెగా డీఎస్సీ ఆశలు
తొలి సంతకం చేయనున్న చంద్రబాబు

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే : కూటమి అధికారంలోకి వస్తే తొలి సంతకం మెగా డీఎస్సీ పైనే చేస్తానని.. ఉమ్మడి జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఆయన మెగా డీఎస్సీ పైనే తొలి సంతకం చేయనున్నారని పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు చెబుతున్నారు. ఈమేరకు ఉమ్మడి జిల్లాలో పాఠశాల విద్యాశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. మూడు రోజులుగా కర్నూలు, నంద్యాల జిల్లాల వ్యాప్తంగా ఉపాధ్యాయుల ఖాళీలను గుర్తించే పని ప్రారంభించారు. రెండు డీఈవో కార్యాలయాలతో పాటు ఇతర సిబ్బంది రోజంతా కుస్తీ పట్టి ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన ఖాళీల లెక్క తేల్చి ఉన్నతాధికారులకు నివేదించారు. 53 మండలాల్లో సుమారు 1600 ఎస్జీటీ పోస్టులు ఖాళీలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గతేడాది డిసెంబరు వరకు ఉద్యోగ విరమణ చేసిన వారితో పాటు ప్రస్తుతం ఉన్న ప్రతి ఖాళీని గుర్తించి వివరాలు వెలికితీశారు. ఐదేళ్ల వైకాపా పాలనలో ఒక్క డీఎస్సీ నిర్వహించలేదు. ఎన్నికల ముందు హడావుడిగా విడుదల చేశారు. నూతన ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా విద్యాశాఖాధికారులు ఖాళీలను గుర్తించి నివేదికను తయారు చేశారు.

నిరుద్యోగుల హర్షం

వైకాపా ప్రభుత్వం ఐదేళ్లలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేదు. దీంతో బీఈడీ, డీఈడీ చదివిన అభ్యర్థులు నిరాశకు గురయ్యారు. ప్రస్తుతం మెగా డీఎస్సీ నిర్వహణకు కూటమి ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించడంతో బీఈడీ, డీఈడీ అభ్యర్థుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. కర్నూలు, నంద్యాల జిల్లాలో వేలాదిమంది అభ్యర్థులు రూ.వేలల్లో ఖర్చు పెట్టుకుని హైదరాబాద్, విజయవాడ, గుంటూరు వంటి దూర ప్రాంతాలకు వెళ్లి డీఎస్సీకి శిక్షణ పొందారు. ఐదేళ్ల పాటు నోటిఫికేషన్లు రాక నిరాశ చెందారు. మరోవైపు కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు తగినంత మంది ఉపాధ్యాయులు లేకపోవడంతో ఉన్న వారిపై అధిక భారం పడింది. పనిభారం పెరగడంతో నాణ్యమైన విద్య కరవైంది. ఈ క్రమంలో నూతన ప్రభుత్వం మెగా డీఎస్సీకి సన్నాహాలు చేస్తుండటం పట్ల అటు నిరుద్యోగులు, ఇటు ఉపాధ్యాయ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. మరోవైపు ఉపాధ్యాయ పోస్టుల భర్తీతో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు కూడా పెరిగే అవకాశం ఉందని విద్యావేత్తలు పేర్కొంటున్నారు.

విలీన కష్టాలను అధిగమించే దిశగా

పాఠశాలల విలీనంతో ప్రాథమిక విద్య అస్తవ్యస్తంగా తయారైంది. 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారు. ఈ ప్రక్రియతో సెకండరీ గ్రేడ్‌ ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించి వారిని ఉన్నత పాఠశాలలకు తీసుకెళ్లారు. దీంతో కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని చాలావరకు ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ అయ్యాయి. కొన్ని పాఠశాలల్లో ఒకటి, రెండు తరగతులను ఒకే ఉపాధ్యాయుడు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. అత్యవసరంగా ఉపాధ్యాయులు సెలవు పెడితే ఆ రోజు పాఠశాలకు తాళం వేయాల్సిందే. ఈ సమస్యలను పరిగణనలోకి తీసుకుని ప్రస్తుతం ఉపాధ్యాయుల ఖాళీల జాబితాను తయారు చేశారు. తొలుత ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన ఖాళీలను గుర్తించినా.. నోటిఫికేషన్‌ నాటికి మండలాల వారీగా ఖాళీల జాబితా తయారు చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని