logo

చదువులమ్మ ఇంట.. సమస్యల గంట

నూనెపల్లె పురపాలక ఉన్నత పాఠశాల నాడు-నేడు రెండో విడత కింద ఎంపికైంది. పాత భవనాలు కూల్చి వేసి కొత్త భవనాల నిర్మాణం చేపట్టారు.

Published : 13 Jun 2024 02:36 IST

పూర్తికాని నాడు-నేడు పనులు
నేటి నుంచి పాఠశాలల పునః ప్రారంభం

నూనెపల్లె పురపాలక ఉన్నత పాఠశాల నాడు-నేడు రెండో విడత కింద ఎంపికైంది. పాత భవనాలు కూల్చి వేసి కొత్త భవనాల నిర్మాణం చేపట్టారు. మొత్తం ఐదు గదుల నిర్మాణానికి నిధులు కేటాయించారు. ఇంతవరకు నిధులు విడుదల కాకపోవడంతో ఆరు నెలల నుంచి పనులు ఆపేశారు.

నంద్యాల పట్టణం

వేసవి సెలవులు పూర్తయ్యాయి.. గురువారం నుంచి పాఠశాలలు పునః ప్రారంభం అవుతున్నాయి. నాడు-నేడు కింద చేపట్టిన పనులు పూర్తికాకపోవడంతో విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తనున్నాయి.
మరోవైపు పాఠశాలలు తెరిచే నాటికే పాఠ్య పుస్తకాల పంపిణీ పూర్తవ్వాల్సి ఉన్నా.. ఇంతవరకు జరగలేదు. ఏకరూప దుస్తుల పంపిణీ ఊసే లేదు. ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత వేధిస్తోంది. సమస్యల నిలయాలుగా మారిన ప్రభుత్వ విద్యాలయాల్లో విద్యార్థులు ఇబ్బందికరంగా చదువులు సాగించాల్సిన దుస్థితి నెలకొంది.

మొండి గోడలే దర్శనం

నాడు-నేడు రెండో విడత కింద ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1827 పాఠశాలలను ఎంపిక చేశారు. కర్నూలు జిల్లాలో మొత్తం 974 పాఠశాలలు ఎంపికయ్యాయి. వీటిలో 658 ప్రాథమిక, 105 ప్రాథమికోన్నత, 211 ఉన్నత పాఠశాలల్లో పనులు మంజూరయ్యాయి. వివిధ నిర్మాణాల కోసం రూ.425.94 కోట్ల నిధులు మంజూరయ్యాయి. నంద్యాల జిల్లాలో 853 పాఠశాలలను ఎంపిక చేశారు. వీటిలో ప్రాథమిక 608, ప్రాథమికోన్నత 59, ఉన్నత పాఠశాలలు 186 ఉన్నాయి. వీటిలో వివిధ నిర్మాణాలు చేపట్టేందుకు మొత్తం రూ.363.10 కోట్ల నిధులు మంజూరు చేశారు. నిధులు పూర్తిస్థాయిలో విడుదల కాలేదు. దీంతో చాలా పాఠశాలల్లో నిర్మాణాలు వివిధ దశల్లో ఆగిపోయాయి.

పాఠ్య పుస్తకాలు.. ఏకరూప దస్తులేవీ

ఉమ్మడి జిల్లాలో విద్యార్థులకు 4,23,432 పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయాల్సి ఉంది. ఇంతవరకు ఈ ప్రక్రియ ప్రారంభం కాలేదు. జిల్లా విద్యాశాఖ ఇప్పటికే పాఠశాలలకు సరఫరా చేసింది. కాని విద్యార్థులకు మాత్రం అందించలేదు.  విద్యార్థులకు ఏకరూప దుస్తులు పంపిణీ ఇంతవరకు మొదలే కాలేదు. ఎప్పుడిస్తారనే విషయంపై స్పష్టత కూడా లేదు.

పాఠాలు చెప్పేవారేరీ

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉంది. పాఠశాలల విలీనంతో ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయులు తగ్గిపోయారు. రెండు తరగతులకు ఒకరు మాత్రమే బోధిస్తున్నారు. ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఉపాధ్యాయుడు సెలవు పెడితే బడికి తాళం వేస్తున్నారు.


కొత్తపేట ప్రాథమిక పాఠశాలకు రూ.16 లక్షలు మంజూరు చేశారు. నాడు..నేడు రెండో విడత పనులు ఇంకా పూర్తి కాలేదు. ఇక్కడ 40 మంది విద్యార్థులు చదువుకొంటున్నారు. సిమెంట్‌ అందుబాటులో లేకపోవడంతో పనులు జరగడం లేదు. ఇప్పటి వరకు రూ.6 లక్షల వరకు ఖర్చు చేశారు.

డోన్‌ పట్టణం


అందుబాటులోకి రాని అదనపు గదులు

నంద్యాల జిల్లాలోని 79 పాఠశాలల్లో 394 అదనపు గదుల నిర్మాణానికి రూ.47.28 కోట్లు మంజూరు చేశారు. నిధులు విడుదల కాకపోవడంతో చాలా పాఠశాలల్లో పనులు నిలిచిపోయాయి. అదనపు గదుల నిర్మాణంతో పాటు ఆర్వో ప్లాంట్లు, మరుగుదొడ్ల నిర్మాణం, ర్యాంపులు, విద్యుత్తు సామగ్రి, ఫ్లోరింగ్‌ పూర్తి చేయాల్సి ఉంది. ఫర్నీచర్‌ సమకూర్చాల్సి ఉంది. గతేడాది చివర్లోనే ఈ పనులన్నీ ఆగిపోయాయి.

బడిబాట మరిచారు

కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలను పెంచేందుకు ఏటా నిర్వహిస్తున్న బడిబాట కార్యక్రమం ఈసారి ఎక్కడా కనిపించలేదు. ఇప్పటి వరకు ఈ కార్యక్రమంలో భాగంగా పిల్లల్ని చేర్చుకున్న దాఖలాల్లేవు. ఒకవైపు ప్రైవేటు పాఠశాలలు పోటీలు పడి ఇళ్ల వద్దకే వచ్చి పిల్లలను తమ పాఠశాలల్లో చేర్పించుకుంటున్నాయి. మరోవైపు విద్యాశాఖ అధికారులు స్తబ్దుగా ఉన్నారు.


ఉమ్మడి జిల్లాలోని పాఠశాలలు : 3,393
పనిచేస్తున్న ఉపాధ్యాయుల సంఖ్య : 14,204
మొత్తం ఖాళీలు : 1600


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని