logo

కూలిన చదువులు

ఆదోని పట్టణంలోని నెహ్రూ మెమోరియల్‌ పురపాలక ఉన్నత పాఠశాలలో సుమారు రెండు వేల మంది విద్యార్థులు చదువుతున్నారు.

Updated : 13 Jun 2024 05:26 IST

పూర్తికాని నాడు-నేడు పనులు
నేటి నుంచి పాఠశాలల పునః ప్రారంభం

ఎక్కడి పనులు అక్కడే గప్‌చుప్‌

ఆదోని పట్టణంలోని నెహ్రూ మెమోరియల్‌ పురపాలక ఉన్నత పాఠశాలలో సుమారు రెండు వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. గత ఏడాది ప్రభుత్వం నాడు-నేడు పథకం కింద పాఠశాలలో 14 అదనపు తరగతి గదుల నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. ఇందు కోసం సుమారు రూ.1.68 కోట్లు వెచ్చించారు. ప్రస్తుతం నాలుగు అదనపు గదుల నిర్మాణం పూర్తయింది. మరో 10 గదులను పాఠశాల పాతభవనం పై అంతస్తులో నిర్మించారు. ఇవి గోడల వరకు  పూర్తయ్యాయి. పైకప్పు వేస్తే కింద ఉన్న భవనం తట్టుకునే పరిస్థితి లేదని ఇంజినీరింగ్‌ అధికారులు అనుమానం వ్యక్తం చేయడంతో.. పనులు నిలిపివేశారు.

ఆదోని విద్య, న్యూస్‌టుడే:

మొండి గోడలే దర్శనం

నాడు-నేడు రెండో విడత కింద ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1827 పాఠశాలలను ఎంపిక చేశారు. కర్నూలు జిల్లాలో మొత్తం 974 పాఠశాలలు ఎంపికయ్యాయి. వీటిలో 658 ప్రాథమిక, 105 ప్రాథమికోన్నత, 211 ఉన్నత పాఠశాలల్లో పనులు మంజూరయ్యాయి. వివిధ నిర్మాణాల కోసం రూ.425.94 కోట్ల నిధులు మంజూరయ్యాయి. నంద్యాల జిల్లాలో 853 పాఠశాలలను ఎంపిక చేశారు. వీటిలో ప్రాథమిక 608, ప్రాథమికోన్నత 59, ఉన్నత పాఠశాలలు 186 ఉన్నాయి. వీటిలో వివిధ నిర్మాణాలు చేపట్టేందుకు మొత్తం రూ.363.10 కోట్ల నిధులు మంజూరు చేశారు. నిధులు పూర్తిస్థాయిలో విడుదల కాలేదు. దీంతో చాలా పాఠశాలల్లో నిర్మాణాలు వివిధ దశల్లో ఆగిపోయాయి.

నంద్యాల జిల్లాలోని 79 పాఠశాలల్లో 394 అదనపు గదుల నిర్మాణానికి రూ.47.28 కోట్లు మంజూరు చేశారు. నిధులు విడుదల కాకపోవడంతో చాలా పాఠశాలల్లో పనులు నిలిచిపోయాయి. అదనపు గదుల నిర్మాణంతో పాటు ఆర్వో ప్లాంట్లు, మరుగుదొడ్ల నిర్మాణం, ర్యాంపులు, విద్యుత్తు సామగ్రి, ఫ్లోరింగ్‌ పూర్తి చేయాల్సి ఉంది. ఫర్నీచర్‌ సమకూర్చాల్సి ఉంది. గతేడాది చివర్లోనే ఈ పనులన్నీ ఆగిపోయాయి.

న్యూస్‌టుడే, కర్నూలు విద్య

వేసవి సెలవులు పూర్తయ్యాయి.. గురువారం నుంచి పాఠశాలలు పునః ప్రారంభం అవుతున్నాయి. నాడు-నేడు కింద చేపట్టిన పనులు పూర్తికాకపోవడంతో విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తనున్నాయి.
మరోవైపు పాఠశాలలు తెరిచే నాటికే పాఠ్య పుస్తకాల పంపిణీ పూర్తవ్వాల్సి ఉన్నా.. ఇంతవరకు జరగలేదు. ఏకరూప దుస్తుల పంపిణీ ఊసే లేదు. ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత వేధిస్తోంది. సమస్యల నిలయాలుగా మారిన ప్రభుత్వ విద్యాలయాల్లో విద్యార్థులు ఇబ్బందికరంగా చదువులు సాగించాల్సిన దుస్థితి నెలకొంది.


ఉన్నవి కూల్చి.. నిర్మాణం ఆపి

పత్తికొండ మండలం జూటూరు ప్రాథమికోన్నత పాఠశాలలో 220 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఐదు గదులు ఉండగా.. ఓ గదిలో నాడు-నేడు సామగ్రి నిల్వ ఉంచారు. రెండో విడత కింద చేపట్టిన పనులకు రూ.48 లక్షలు అంచనా వేశారు. చేపట్టిన పనులకు రూ.28 లక్షల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. నాలుగు గదులు కూల్చారు. ఆ స్థలంలో అదనపు గదుల నిర్మాణం చేపట్టారు. రెండేళ్లు గడుస్తున్నా.. నిర్మాణాలు మాత్రం పూర్తిచేయలేదు. దీంతో ఈ ఏడాది కూడా చెట్ల కింద చదువులు తప్పేలా లేవని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

పత్తికొండ గ్రామీణం, న్యూస్‌టుడే:


1,350 మందికి అవస్థ

ఎమ్మిగనూరు పట్టణంలోని నీలకంఠేశ్వర జడ్పీ ఉన్నత పాఠశాలలో శిథిలావస్థకు చేరుకున్న గదులను కూల్చివేసి గతేడాది రూ.2.40 కోట్లతో 20 గదుల నిర్మాణ పనులు ప్రారంభించారు. రూ.50 లక్షల నిధులతో పది గదుల నిర్మాణం చేపట్టారు. నిధులు సరిపోక గుత్తేదారు పనులు నిలిపివేశారు. కొన్ని గదులకు పైకప్పు వేయగా.. మరికొన్ని గదుల్లో బండల పరుపు, కరెంటు తదితర పనులు చేయకుండా అలాగే వదిలేశారు. 1,350 మంది విద్యార్థుల చదువు అవస్థల్లో పడింది.

న్యూస్‌టుడే, ఎమ్మిగనూరు


ఉమ్మడి జిల్లాలోని పాఠశాలలు : 3,393
పనిచేస్తున్న ఉపాధ్యాయుల సంఖ్య : 14,204
మొత్తం ఖాళీలు : 1600


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని