logo

గెలుపు ధీరులు.. ప్రగతి సారథులు

ఐదేళ్ల అరాచక పాలనను జనం ఓటుతో తరిమి తరిమి కొట్టారు. ‘పంకా’ రెక్కలు విరిచి మూలనపెట్టారు. అభివృద్ధి జోడీగా జనం ముందుకొచ్చిన చంద్రబాబు-పవన్‌-మోదీ కూటమికే ప్రజలు జైకొట్టారు.

Published : 13 Jun 2024 03:01 IST

ఐదేళ్ల అరాచక పాలనను జనం ఓటుతో తరిమి తరిమి కొట్టారు. ‘పంకా’ రెక్కలు విరిచి మూలనపెట్టారు. అభివృద్ధి జోడీగా జనం ముందుకొచ్చిన చంద్రబాబు-పవన్‌-మోదీ కూటమికే ప్రజలు జైకొట్టారు.గతంలో ఎన్నడూ లేనివిధంగా 12 (11 చోట్ల తెదేపా, 1 భాజపా) అసెంబ్లీ స్థానాల్లో కూటమి అభ్యర్థులు గెలుపొందారు. తాజాగా కొలువుదీరిన కొత్త ప్రభుత్వం ఉమ్మడి జిల్లాకు చెందిన ముగ్గురికి మంత్రి పదవులు కట్టబెట్టింది. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన సీనియర్‌ నాయకుడు ఎన్‌ఎండీ ఫరూక్, బీసీ జనార్దన్‌రెడ్డి, టీజీ భరత్‌లు ‘ఈనాడు’తో మాట్లాడారు.

ఈనాడు, కర్నూలు


నాలుగోసారి..  అమాత్య యోగం

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే: నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన సీనియర్‌ నేత ఎన్‌ఎండీ (నశ్యం మహమ్మద్‌) ఫరూక్‌ నాలుగో సారి మంత్రి పదవిని దక్కించుకున్నారు. చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో మూడోసారి పదవి పొందడం విశేషం. 75 ఏళ్ల వయస్సున ఫరూక్‌ తెదేపా ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్నారు. 1982లో నంద్యాల మున్సిపాల్టీ కౌన్సిలర్‌గా గెలిచి రాజకీయాల్లోకి వచ్చారు. 1985లో తెదేపా తరఫున ఎమ్మెల్యేగా గెలిచి దివంగత ఎన్టీఆర్‌ మంత్రివర్గంలో చక్కెర, వక్ఫ్‌బోర్డు, మైనార్టీ శాఖల మంత్రిగా పనిచేశారు. 1989లో ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. 1994లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి 1999 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ డిప్యూటీ స్పీకరుగా సేవలు అందించారు. 1999లో మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచి మైనార్టీ, వక్ఫ్‌బోర్డు, మున్సిపల్‌ శాఖల మంత్రిగా 2002 వరకు పనిచేశారు. ఆ తర్వాత 2002 నుంచి 2004 వరకు విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. 2004లో ఎమ్మెల్యేగా ఓడిపోయారు. 2009, 2014లో నంద్యాల ఎంపీగా పోటీచేసి ఓడిపోయారు. 2017లో ఎమ్మెల్సీగా ఎన్నికై శాసనమండలి ఛైర్మన్‌గా పనిచేశారు. 2018లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా కొంతకాలం పనిచేశారు. 2023 వరకు ఎమ్మెల్సీగా కొనసాగారు. 2024లో నంద్యాల ఎమ్మెల్యేగా పోటీచేసి నాలుగోసారి విజయం సాధించారు.

అభివృద్ధికి బాటలేశారు

ఫరూక్‌ మున్సిపల్‌ శాఖ మంత్రిగా ఉన్న (2000-2001) హయాంలో డీఎఫ్‌ఐడీ పథకానికి నంద్యాలలో శ్రీకారం చుట్టారు. ఒక్క నంద్యాల మున్సిపాల్టీకే రూ.10 కోట్ల వరకు నిధులొచ్చాయి.  వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా కొంతకాలమే పనిచేసినా నంద్యాల జిల్లా స్థాయి ప్రభుత్వ ఆసుపత్రిని 200 పడకల స్థాయి నుంచి 300 పడకల స్థాయికి పెంచారు. నంద్యాల మున్సిపాల్టీ 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా టౌన్‌హాల్‌ మంజూరు చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున షాదీఖానాలు , ఉర్దూ భవనాలు మంజూరు చేశారు. ప్రస్తుతం నాలుగోసారి మంత్రి పదవి చేపట్టడం అనుభవం, ఆయా శాఖలపై పూర్తి అవగాహన ఉండటంతో అభివృద్ధికి బాటలు పడనున్నాయి.

మంత్రి మాట
రహదారుల బాగుకు ప్రథమ ప్రాధాన్యం : ఎన్‌ఎండీ ఫరూక్, మంత్రి

ఉమ్మడి కర్నూలు జిల్లాలో చాలా రహదారులు దెబ్బతిన్నాయి. వాటిపై ప్రయాణించడానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదాలకు గురై కొందరు ప్రాణాలు కోల్పోయారు. రహదారుల మరమ్మతులకు తగిన ప్రాధాన్యం ఇస్తాం. ఉమ్మడి జిల్లాలో చాలా గ్రామాల్లో తాగునీరు కూడా సరిపడా అందడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తా. కర్నూలు నుంచి నంద్యాలకు నూతన రైల్వే లైన్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటా. నంద్యాల జిల్లాలో పరిశ్రమలు ఏర్పడకపోవడంతో ఉద్యోగాలు, ఉపాధి లభించని దుస్థితి తలెత్తింది. ఈ నేపథ్యంలో పలు పరిశ్రమలు రావడానికి నా వంతుగా కృషి చేస్తా.


గనుల ఖిల్లాలో తొలి మంత్రి

బనగానపల్లి, న్యూస్‌టుడే: ‘‘ గనుల ఖిల్లా బనగానపల్లి ప్రతినిధికి తొలిసారిగా మంత్రివర్గంలో చోటు దక్కింది.. గతంలో బనగానపల్లి కేంద్రంగా ఉన్న పాణ్యం నియోజకవర్గం నుంచి రాజకీయ ఉద్ధండులు గెలుపొందారు.. ఏ ఒక్కరికీ మంత్రి పదవి దక్కలేదు. పునర్విభజనలో భాగంగా 2009లో బనగానపల్లి నియోజకవర్గం ఏర్పడింది. ఇక్కడి నుంచి రెండోసారి తెదేపా తరఫున గెలుపొందిన బీసీ జనార్దన్‌రెడ్డికి మంత్రి పదవి వరించింది. 1978 నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏ ఒక్కరికీ మంత్రిగా పని చేసే అవకాశం రాలేదు.. ఈ ప్రాంతం నుంచి మంత్రి పదవి దక్కించుకున్న మొదటి వ్యక్తిగా బీసీ చరిత్రలో నిలిచిపోనున్నారు. దండిగా వనరులున్నా పూర్తిగా వెనుకబడిన బనగానపల్లి నియోజకవర్గానికి మంచి రోజులు రానున్నాయని ఇక్కడి ప్రజలు అభిప్రాయపడుతున్నారు.’’

మూడుసార్లు పోటీ.. రెండుసార్లు గెలుపు

బనగానపల్లి మండలం యనకండ్లకు చెందిన బొబ్బల చిన్నోళ్ల జనార్దన్‌రెడ్డి హైదరాబాద్‌లో స్థిరాస్తి వ్యాపారం చేసుకొనే వారు. 2011లో తెదేపాలో చేరారు.. మూడేళ్లపాటు పల్లె పల్లెకు వెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేశారు. 2014లో తెదేపా తరఫున పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. 2019లో ‘ఫ్యాన్‌’ గాలి బలంగా ఉండటంతో ఓటమి చవిచూశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో 25,556 ఓట్లతో గెలుపొందారు. భార్య బీసీ ఇందిరమ్మ, కుమారుడు బీసీ మనోహర్‌రెడ్డి, కుమార్తెలు మనోరమ, శ్రీలక్ష్మి ఉన్నారు. తండ్రి బీసీ గుర్రెడ్డి యనకండ్ల సర్పంచిగా తమ్ముడు బీసీ రాజారెడ్డి బనగానపల్లి మేజర్‌ పంచాయతీకి సర్పంచిగా పనిచేశారు.  సొంత నిధులు వెచ్చించి నీటి శుద్ధి కర్మాగారాలు ఏర్పాటు చేసి బనగానపల్లి పట్టణ ప్రజలకు మంచినీటిని అందించారు. బేతంచెర్ల మండలం మద్దిలేటి స్వామి ఆలయం, గోర్లగుట్ల సమీపంలోని రోడ్డు పక్కన వాటర్‌ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. బీసీ సోదరుడు రాజారెడ్డి ప్రతి నెలా 160 మంది అంధులకు నెలకు రూ.500 చొప్పున అందిస్తున్నారు.

ఐదేళ్లు అలుపెరగని పోరాటం

గత ఐదేళ్ల కాలంలో బీసీ కుటుంబాన్ని వైకాపా ప్రభుత్వం వేధింపులకు గురి చేసింది. బీసీ జనార్దన్‌రెడిపై ఏడాది కిందట ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి నెల రోజుల పాటు ఆదోని సబ్‌జైల్లో ఉంచారు. అనుచరులనూ బెదిరించారు.. ఎక్కడా ఆత్మస్థైర్యం కోల్పోలేదు.. వైకాపా ఎన్ని బెదిరింపులకు పాల్పడినా ప్రజా పోరాటం కొనసాగించారు. 2019లో స్వల్ప ఓట్లతో ఓడిపోయినా ప్రజా సమస్యలపై పోరాటం చేశారు.. తెదేపా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బాదుడే.. బాదుడు, ప్రజాగళం కార్యక్రమాలు చురుగ్గా నిర్వహించారు. ప్రకాశం, నెల్లూరు పార్లమెంటు స్థానాలకు ఇన్‌ఛార్జిగా పని చేశారు. పార్టీ కష్టకాలంలో ఉండగా అన్నీతానై ముందుండి నడిపించారు. బీసీ జనార్దన్‌రెడ్డి ఇతర ప్రాంతాలకు వెళ్లిన సమయంలో ఆయన భార్య బీసీ ఇందిరమ్మ గ్రామాల్లో తిరుగుతూ కార్యకర్తలకు అండగా నిలిచారు.

మంత్రి మాట
ప్రాజెక్టుల పూర్తిపై ప్రత్యేక దృష్టి
- బీసీ జనార్దన్‌రెడ్డి, మంత్రి

ఉమ్మడి జిల్లా ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతాను. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో ఒకసారి సమావేశమై ఏయే ప్రాజెక్టులను ముందుగా చేపడితే బాగుంటుందన్న అంశాలను సమీక్షిస్తా. ఏ ప్రాజెక్టులు చేపడితే ఎక్కువ మందికి ప్రయోజనకరంగా ఉంటుంది? ఏవి వేగంగా పూర్తవుతాయి, దీర్ఘకాలంలో జిల్లాకు మేలు చేసే ప్రాజెక్టులు ఏమిటి? పెండింగ్‌లోని ప్రాజెక్టుల పరిస్థితి ఏమిటి? తదితర అన్ని విషయాలను సమగ్రంగా విశ్లేషించి తగిన నిర్ణయం తీసుకుంటాం.


తొలి గెలుపు.. మంత్రిగా కొలువు


కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: కర్నూలు నియోజకవర్గంలో 25 ఏళ్ల తర్వాత తెదేపా జెండా రెపరెపలాడింది.. రెండోసారి బరిలో దిగి తొలిసారి గెలిచిన టీజీ భరత్‌ను అమాత్య పదవి వరించింది. యూకేలో ఎంబీఏ పూర్తి చేసిన ఆయన మాజీ మంత్రి, మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్‌ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చారు. 2019లో కర్నూలు నుంచి తెదేపా తరఫున పోటీ చేసి 5,353 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఎక్కడా నిరాశ చెందకుండా లోపాలను సరిచేసుకుంటూ ముందుకెళ్లారు. నిరంతరం జనంలో ఉంటూ వారి సమస్యలు తెలుసుకుంటూ వ్యూహాత్మక అడుగులేశారు. టీజీవీ గ్రూప్స్‌ తరఫున నియోజకవర్గంలో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.  2024 సార్వత్రిక ఎన్నికల్లో కర్నూలు నుంచి రెండోసారి పోటీ చేసి 18,876 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.తెదేపా ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు గత 40 ఏళ్లలో ఆ పార్టీ తరఫున కర్నూలు ఎమ్మెల్యేలుగా ఇద్దరు గెలుపొందారు.48 ఏళ్ల వయస్సులో టీజీ భరత్‌  ఎమ్మెల్యేగా మొదటిసారి ఎన్నికైన వెంటనే మంత్రి పదవి దక్కడం విశేషం.

మంత్రి మాట
కర్నూల్‌ను స్మార్ట్‌ సిటీగా మారుస్తా
- టీజీ భరత్, మంత్రి

కర్నూలును స్మార్ట్‌ సిటీగా మార్చాలన్న ప్రతిపాదన సాకారం కావడం లేదు. ఫలితంగా నగరం ఆధునిక రూపం సంతరించుకోవడం లేదు. మౌలిక వసతుల కొరత కూడా తీవ్రంగా ఉంది. నగరంలోని ప్రజలకు సమృద్ధిగా తాగునీరందేలా చర్యలు చేపడతాం. ప్రభుత్వం నుంచి పౌరసేవలు మరింత వేగంగా అందేలా చర్యలు తీసుకుంటా. వ్యాపార, వాణిజ్య రంగాల్లో కర్నూలు అభివృద్ధి చెందాలంటే పారిశ్రామికవేత్తల రాకపోకలకు నగరం అత్యంత అనువుగా ఉండాలి. ఈ నేపథ్యంలో కర్నూలు నుంచి రాష్ట్ర రాజధాని అమరావతికి (విజయవాడ), దిల్లీకి విమాన సర్వీసులు ఉంటే బాగుంటుంది. కర్నూలు నుంచి విజయవాడ వెళ్లేందుకు విమానాన్ని కచ్చితంగా అందుబాటులోకి తెస్తా. ఆ మేరకు కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడుతో ఇప్పటికే మాట్లాడాను. ఓర్వకల్లు మెగా ఇండస్ట్రియల్‌ హబ్‌ను అభివృద్ధి చేస్తే వేలాది మందికి ఉద్యోగాలు వస్తాయి. ఈ హబ్‌లో భారీ ఎత్తున పరిశ్రమలు ఏర్పడేలా నా వంతు కృషి చేస్తా. ??

భరత్‌ మూడో వ్యక్తి

కర్నూలు నియోజకవర్గంలో 1952 నుంచి 1978 వరకు కాంగ్రెస్‌ గెలిచింది. 1962లో స్వతంత్ర అభ్యర్థి టి.కె.ఆర్‌. శర్మ విజయం సాధించారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో పరిస్థితి మారిపోయింది. రాంభూపాల్‌ చౌదరి ఒకసారి తెదేపా తరఫున, రెండుసార్లు కాంగ్రెస్‌ తరఫున గెలుపొందారు. ఎంఏ గఫూర్‌ (సీపీఎం) రెండుసార్లు విజయం సాధించారు. టీజీ వెంకటేశ్‌ ఒకసారి తెదేపా, మరోసారి కాంగ్రెస్‌ తరఫున గెలుపొందారు. కర్నూలు నియోజకవర్గం నుంచి గెలుపొందిన వారిలో రాంభూపాల్‌ చౌదరి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి హయాంలో మంత్రిగా పని చేశారు. అదే విధంగా 2009-14 మధ్య కాలంలో రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో టీజీ వెంకటేశ్‌ మంత్రిగా పని చేశారు. మంత్రి పదవి దక్కించుకున్న మూడో వ్యక్తిగా భరత్‌ గుర్తింపు పొందారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని