logo

పతకాల కిక్‌

చదువుతో పాటు ఆటల్లో రాణిస్తున్న ఆ విద్యార్థులు మిగిలిన వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. విద్యార్థి దశ నుంచే కరాటేలో రాటుదేలుతూ మాస్టర్‌ రమణ వద్ద తర్ఫీదు పొందుతూ మెలకువలు తెలుసుకుంటూ నైపుణ్యాలు పెంపొందించుకుంటున్నారు.

Published : 14 Jun 2024 02:23 IST

న్యూస్‌టుడే, డోన్‌పట్టణం 

చదువుతో పాటు ఆటల్లో రాణిస్తున్న ఆ విద్యార్థులు మిగిలిన వారికి ఆదర్శంగా నిలుస్తున్నారు. విద్యార్థి దశ నుంచే కరాటేలో రాటుదేలుతూ మాస్టర్‌ రమణ వద్ద తర్ఫీదు పొందుతూ మెలకువలు తెలుసుకుంటూ నైపుణ్యాలు పెంపొందించుకుంటున్నారు. వారు పంచ్‌ కొడితే పతకాల పంటే..రాష్ట్ర, జాతీయస్థాయి, సౌత్‌ ఇండియా, ఇంటర్‌ స్టేట్‌ కరాటేలోని కటా, కుమితి విభాగాల్లో రాణించి స్వర్ణ, రజత పతకాలను కైవసం చేసుకున్నారు డోన్‌ పట్టణానికి చెందిన చిన్నారులు. వారి విజయ ప్రస్థానంపై ‘న్యూస్‌టుడే’ కథనం.


బ్లాక్‌బెల్ట్‌ లక్ష్యం

నవదీప్‌

పట్టణంలోని తారకరామానగర్‌కు చెందిన వెంకటకృష్ణ, పద్మావతి దంపతుల కుమారుడు నవదీప్‌ ఏడోతరగతి చదువుతున్నాడు. 2022లో కర్నూలులో జరిగిన సౌత్‌ ఇండియా ఓపెన్‌ కరాటే ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో కటా విభాగంలో ద్వితీయస్థానం కైవసం చేసుకొని రజత పతకాన్ని సాధించాడు. 2023లో ఒంగోలులో జరిగిన ఏపీ ఇంటర్‌స్టేట్‌ ఇన్విటేషన్‌ కరాటే ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో కటా విభాగంలో తనదైన శైలిలో ప్రతిభను కనబరిచి ప్రథమస్థానంలో నిలిచి స్వర్ణాన్ని సొంతం చేసుకున్నాడు. 2024లో చిలకలూరిపేటలో జరిగిన నేషనల్‌ ఓపెన్‌ కరాటే-డు పోటీల్లో కటా విభాగంలో సత్తా చాటి తృతీయ స్థానం పొంది కాంస్య పతకాన్ని సాధించాడు. భవిష్యత్తులో కరాటేలో మరింత ప్రావీణ్యాన్ని సాధించి బ్లాక్‌బెల్టు సాధించాలనుందని నవదీప్‌ చెబుతున్నారు.


జాతీయస్థాయిలో సత్తా

భాను ప్రకాష్‌రెడ్డి 

జాతీయస్థాయి కరాటేలో సత్తా చాటుతూ భవిష్యత్తులో క్రీడా కోటలో ఉన్నతస్థాయి ఉద్యోగాన్ని సాధించాలన్నదే తన లక్ష్యమని చెబుతున్నారు భానుప్రకాష్‌రెడ్డి. కొండపేటకు చెందిన లక్ష్మీరెడ్డి, లావణ్య దంపతుల కుమారుడైన ఈ విద్యార్థి ఎనిమిదో తరగతి చదువుతున్నారు. ఆత్మరక్షణకు కరాటే నేర్చుకోవాలనే తపనతో మక్కువ పెంచుకున్నారు. 2023 ఫిబ్రవరిలో కదిరిలో జరిగిన జాతీయస్థాయి కరాటే పోటీల్లో తృతీయస్థానంలో నిలిచాడు. అక్కడి ప్రముఖుల నుంచి కాంస్యాన్ని ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు. 2023 మార్చిలో చిలకలూరిపేటలో జరిగిన జాతీయస్థాయి కరాటే పోటీల్లో కటా విభాగంలో ప్రత్యర్థిపై సత్తా చాటి తృతీయస్థానాన్ని పొందారు. కరాటేలో రాణించి మరిన్ని పతకాలు సాధిస్తానని చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని