logo

ఆర్‌యూలో దస్త్రాలు గల్లంతు

రాయలసీమ విశ్వవిద్యాలయంలో ముఖ్యమైన దస్త్రాలు, విలువైన పత్రాలు మాయమైనట్లు ఆరోపణలు వస్తున్నాయి.. పలు అంశాలకు సంబంధించి స.హ. చట్టం కింద వివరాలు కోరినా అధికారులు ఇవ్వకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Published : 14 Jun 2024 02:33 IST

ఈనాడు, కర్నూలు: రాయలసీమ విశ్వవిద్యాలయంలో ముఖ్యమైన దస్త్రాలు, విలువైన పత్రాలు మాయమైనట్లు ఆరోపణలు వస్తున్నాయి.. పలు అంశాలకు సంబంధించి స.హ. చట్టం కింద వివరాలు కోరినా అధికారులు ఇవ్వకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దస్త్రాలు మాయమవ్వడానికి కొందరు అధికారుల ప్రయత్నాలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమవ్వడం, ఆయా దృశ్యాల వీడియోలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేయడంతో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ప్రాథమిక విచారణ అనంతరం పోలీసులు కేసు నమోదు చేశారు. విశ్వవిద్యాలయంలో గతంలో పెద్దఎత్తున అక్రమాలు జరిగాయి. రూ.కోట్లలో నిధుల దుర్వినియోగం, ఉద్యోగోన్నతుల్లో నిబంధనల ఉల్లంఘన, వివిధ వస్తువుల కొనుగోలుల్లో అక్రమాలు తదితర ఘటనలు విశ్వవిద్యాలయ ప్రతిష్ఠను మసకబార్చాయి. వాటిపై విజిలెన్స్, సీఐడీ అధికారులు విచారణ కూడా జరిపారు. 2017లో అక్రమాలు వెలుగులోకి వచ్చిన వెంçనే నాటి ప్రభుత్వం చట్టపరమైన చర్యలకు శ్రీకారం చుట్టింది. విచారణలు పూర్తయ్యే సమయానికి ప్రభుత్వం మారడంతో అక్రమార్కులకు కలిసిసొచ్చినట్లైంది. పలుకుబడిని ఉపయోగించుకున్న వారు అయిదేళ్లుగా ఎలాంటి చర్యలు తీసుకోనివ్వకుండా అధికారులను అడ్డుకున్నారు. 

వారికి కీలక పదవులు

విశ్వవిద్యాలయం నుంచి కీలక దస్త్రాలు మాయం చేయడానికి ప్రయత్నించారన్న ఆరోపణలు ఎదుర్కొన్న ఆచార్య ఎన్‌.టి.కె.నాయక్‌కు అప్పట్లో మెమో ఇచ్చారు. ఆ విషయాన్ని ఆనాటి రిజిస్ట్రార్‌ అమర్‌నాథ్‌ అధికారికంగా ప్రకటించారు.  అలాంటి వ్యక్తి కొంతకాలం కిందట రెక్టార్‌ పదవిని పొందారు. దస్త్రాలను భద్రపరచడంలో విఫలమయ్యారన్న ఆరోపణలు ఎదుర్కొన్న ఓ అధికారిణికి తాజాగా పరిపాలన విభాగంలో నియామకానికి ప్రయత్నించడంపై విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేయడంతో ఆ నిర్ణయాన్ని అధికారులు ఉపసంహరించుకున్నారు. 

తీర్మానాల ప్రతి ఏమైందో

విశ్వవిద్యాలయంలో జరిగిన అక్రమాలకు బాధ్యులుగా కొందరిని గుర్తించారు. వారిపై చర్యలు తీసుకునేందుకు వర్సిటీ ఉన్నతాధికారులు ఒకటిన్నర సంవత్సరం పాటు ప్రయత్నించారు. గతేడాది జనవరి 24న పాలక మండలి సమావేశంలో చర్యలకు తీర్మానించినట్లు తెలుస్తోంది. అయినా నేటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నాడు పాలక మండలి తీర్మానాలు అమలు చేయకుండా తాత్సారం చేస్తుండటం గమనార్హం. భారీ ఎత్తున డబ్బులు చేతులు మారిన నేపథ్యంలోనే పాలక మండలి తీర్మానాలను తుంగలోకి తొక్కారన్న విమర్శలున్నాయి. ఒకటిన్నర సంవత్సరం గడిచినా వాటిలో ఏముందన్న విషయం వెలుగుచూడకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

తాజా విచారణలోనూ తాత్సారమే

అనర్హులను ఉత్తీర్ణులను చేయడం, నకిలీ ధ్రువపత్రాలు జారీ ద్వారా రూ.16 లక్షల వరకు దండుకున్నారనే ఆరోపణలు ఎక్కువవుతున్నాయి. దీనిపై రాష్ట్ర ఉన్నత విద్యామండలి సూచనల మేరకు విచారణ కమిటీని కూడా వీసీ నియమించారు. ఆ కమిటీ విచారణ ముందుకు సాగకుండా వర్సిటీ అధికారులు అడుగడుగునా అడ్డుతగులుతున్నారని విమర్శలు రేగుతున్నాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని