logo

చెత్త పన్ను ఎత్తేశారు

వైకాపా ప్రభుత్వం చెత్త పన్ను విధించి.. పట్టణ ప్రజలను వేధించింది. కాలనీల్లో ఇళ్ల ముందుకు వెళ్లడం, ఇష్టానుసారంగా మాట్లాడటం, పన్ను చెల్లించకపోతే..

Updated : 14 Jun 2024 05:01 IST

నిలిచిన ఆటోలు

ఆదోని పురపాలకం, కర్నూలు, నంద్యాల పురపాలకం, న్యూస్‌టుడే: వైకాపా ప్రభుత్వం చెత్త పన్ను విధించి.. పట్టణ ప్రజలను వేధించింది. కాలనీల్లో ఇళ్ల ముందుకు వెళ్లడం, ఇష్టానుసారంగా మాట్లాడటం, పన్ను చెల్లించకపోతే.. కుళాయి కనెక్షన్లు తొలగించడం వంటి చర్యలకు అధికారులు పాల్పడ్డారు. కొన్ని చోట్ల వ్యతిరేకించినా.. మొండిగా వ్యవహరించారు. ప్రజల కష్టాలు చూసిన చంద్రబాబు.. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే చెత్తపన్ను పూర్తిగా ఎత్తేస్తామని హామీ ఇచ్చారు. హామీని నేడు నిలబెట్టుకున్నారు. పురపాలికల్లో చెత్త పన్ను వసూళ్లు ఆపాలని మౌఖిక ఆదేశాలు అందడంతో పురవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

లక్ష్యం ‘బుట్ట’దాఖలు

గత వైకాపా ప్రభుత్వంలో కర్నూలు నగరపాలక సంస్థతో, నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు పురపాలికల్లో క్లాప్‌(క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌) పేరుతో 2022లో ఇంటింటి చెత్త సేకరణకు శ్రీకారం చుట్టింది. ఇంటికి మూడేసి చెత్త బుట్టలు అందించి.. ఇళ్ల వద్దనే చెత్త సేకరిస్తారని పేర్కొన్నారు. దీంతో పురవాసులు ఎంతో సంతోషించారు. ఇందుకు నెలకు చెత్త పన్ను చెల్లించాలని పేర్కొనడంతో జనం అసహనం వ్యక్తం చేశారు. ఇంటికి రూ.30-60, వాణిజ్య దుకాణాలకు రూ.100-6వేల వరకు చెత్త పన్ను చెల్లించాలని ఆదేశించారు. దీనిపై క్షేత్రస్థాయిలో తీవ్ర ఆందోళన నెలకొనడంతో పాటు జనం వ్యతిరేకించారు. ఇళ్ల వద్దకు వసూళ్లకు వెళ్లిన పురపాలక, సచివాలయ సిబ్బందిని జనం నిలదీశారు. ఇచ్చిన చెత్త బుట్టలను వచ్చిన ఆటల్లోనే వేసి తమ నిరసన తెలిపారు. చెత్తకు పన్ను వేయడమేంటని, విస్తుపోవాల్సి వచ్చింది. 

రూ.16.20 కోట్లు వసూళ్లు 

నాడు పురపాలక, సచివాలయ సిబ్బంది ఇళ్ల వద్దకు వెళ్లి బలవంతంగా వసూళ్లు చేశారు. కర్నూలులో రూ.10 కోట్లు, నంద్యాలలో రూ.3 కోట్లు, ఆదోనిలో రూ.2 కోట్లు, ఎమ్మిగనూరులో రూ.1.20 కోట్ల వరకు వసూళ్లు చేశారు. వార్డు వాలంటీర్లు ద్వారా నెలకు అందించే సామాజిక పింఛన్లలో కోతలు విధించడంతోపాటు పొదుపు సంఘాల నుంచి వసూలు చేయడం.. ఇలా అవకాశం వచ్చిన ప్రతి దాంట్లో నుంచి బలవంతంగా వసూళ్లు చేశారు. 

గుత్తేదారుకు దోచిపెట్టారు

వైకాపా ప్రభుత్వం ప్రజలకు సేవ చేస్తామని నమ్మబలికి చివరికి తమ వారికి దోచిపెట్టడమే లక్ష్యంగా పనిచేసింది. ఇంటింటి చెత్త సేకరణ ఆటోల నిర్వహణను ఏజెన్సీ పేరుతో పార్టీ సానుభూతిపరులకు అప్పగించారు. ఇలా ఒక్కో ఆటో రూ.5-6 లక్షలు వెచ్చించి బ్యాంకు రుణంతో కొనుగోలు చేసి, ఇచ్చారు. ఇలా 200 దాకా ఆటోలను పురపాలక సంఘాలకు అప్పగించారు. నెలకు వసూలయ్యే చెత్త పన్ను నుంచి ఆటోలకు అద్దె మొత్తాలు చెల్లించాలని పురపాలికలకు ఆదేశాలు జారీచేశారు. ఆరంభంలో రూ.63 వేలు ఉండేది, తర్వాత ఖర్చులు పెరిగాయని రూ.69 వేలు చేశారు. క్షేత్రస్థాయిలో చెత్త పన్ను వసూలు కాకపోవడం, ఇటు ఆటోల అద్దెలు పురపాలికలకు తలకు మించిన భారంగా మారాయి. చివరికి స్థానిక సంస్థల నిధుల నుంచి ఆటో బకాయిలు చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనిపై అధికార పార్టీ కౌన్సిలర్లే వ్యతిరేకించారు. చివరికి ఆటోల భారం మోయలేక.. పురపాలికలు ఉన్నకాడికి నడుపుకోవాల్సి వచ్చింది.. మిగిలినవి మూలకు నెట్టక తప్పలేదు. 

  • పురపాలికలు: 4
  • ఆటోల సంఖ్య: 200
  • నెలకు ఒక్కో ఆటో అద్దె: రూ.63-69 వేలు
  • ఆటోల అద్దె భారం నెలకు: రూ.1.26 కోట్లు 
  • ఇప్పటి వరకు వసూలు చెత్తపన్ను: 16.20 కోట్లు 
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు