logo

రక్త బంధువులు.. ప్రాణ రక్షకులు

అత్యవసర సమయాల్లో రోగులు.. క్షతగాత్రుల ప్రాణాలు నిలిపే సంజీవని రక్తమే. సకాలంలో అవసరమైన గ్రూపు రుధిరం అందక ఎందరో ఊపిరి వదులుతున్నారు. ఇలాంటి ఘటనలు కొందరు దాతల్ని కదిలించాయి.

Published : 14 Jun 2024 02:51 IST

అభాగ్యులను ఆదుకుంటున్న స్వచ్ఛంద సేవకులు 
నేడు రక్తదాతల దినోత్సవం

నంద్యాల పాతపట్టణం, డోన్, న్యూస్‌టుడే : అత్యవసర సమయాల్లో రోగులు.. క్షతగాత్రుల ప్రాణాలు నిలిపే సంజీవని రక్తమే. సకాలంలో అవసరమైన గ్రూపు రుధిరం అందక ఎందరో ఊపిరి వదులుతున్నారు. ఇలాంటి ఘటనలు కొందరు దాతల్ని కదిలించాయి. తమ ఒంట్లో రక్తం ఉన్నంత వరకు మరొకరికి ఇబ్బంది రాకుండా చూడాలన్న లక్ష్యంతో ముందడుగు వేశారు. కొందరు వ్యక్తిగతంగా.. మరికొందరు బృందాలుగా ఏర్పడి రక్తదానం చేస్తూ పలువురి ప్రాణాలు నిలుపుతున్నారు. వారి కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారు.

సామాజిక మాధ్యమాల వేదికగా..

నంద్యాల, కర్నూలు పట్టణాల్లో సామాజిక మాధ్యమాల వేదికగా పలువురు రక్తదాతలు చేతులు కలుపుతున్నారు. ఉమ్మడి జిల్లాలో పలు వాట్సప్‌ గ్రూపుల ద్వారా సేవలు అందిస్తున్నారు. రోగి వివరాలతో పాటు కావాల్సిన రక్తం గ్రూపును వాట్సప్‌లో పోస్టు చేస్తే.. దాతలు స్వచ్ఛందంగా ఆసుపత్రులు, రక్తనిధి కేంద్రాలకు వెళ్లి రక్తదానం చేస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు.

కొరవడిన ప్రోత్సాహం

గతంలో ఆరు నెలలు, ఏడాదికి ఒకసారి రక్తదాతలకు అభినందన సభలు ఏర్పాటు చేసేవారు. సన్మానాలు, ప్రశంసాపత్రాలు అందజేసి వారిని ప్రోత్సహించే వారు. రక్తదానం చేయాలని అవగాహన సదస్సులు నిర్వహించే వారు. నంద్యాల జీజీహెచ్‌ రక్తనిధి కేంద్రానికి శిబిరాల, సదస్సుల నిర్వహణకు గతేడాదిలో రూ.2.43 లక్షలు మంజూరు చేశారు. శిబిరాలు ఏర్పాటు చేసి రక్తం సేకరించారు. రక్తదాతలను ప్రోత్సహించే విధంగా సన్మానాలు, అభినందన కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉన్నా వైద్యాధికారులు పట్టించుకోలేదని రక్తదాతలు విమర్శిస్తున్నారు. రక్తదాతల దినోత్సవం సందర్భంగా కూడా కనీస ప్రోత్సాహం లేదని వాపోతున్నారు.


74 సార్లు రక్తదానం చేసి..
- లక్ష్మీప్రసాద్, ఆదోని

ఆదోని పట్టనానికి చెందిన సి.లక్ష్మీప్రసాద్‌ రక్తదానం చేయడంలో ముందుంటున్నారు. బీ+ (పాజిటివ్‌) గ్రూపు రక్తం ఉన్న ఈ యువకుడు 2007 సంవత్సరం నుంచి రక్తదానం చేయడం మొదలెట్టారు. పట్టణంలో పాల డెయిరీ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. తెలిసిన వారికి రక్తం అవసరం ఉండడంతో తెలుసుకొని రక్తదానం చేశారు. అప్పట్లో రక్తదానం చేసేందుకు చాలా మంది భయపడేవారు. రక్తదానం చేసేందుకు భయపడరాదని కొన్ని సంస్థలు చైతన్యం చేయడంతో తాను రక్తదానం చేయడం మొదలెట్టానని,. ఆపదలో ఉన్నట్లు సమాచారం అందితే చాలు వెళ్లి రక్తం ఇస్తానన్నారు. ఇప్పటికి లక్ష్మీప్రసాద్‌ 74 సార్లు రక్తదానం చేసి మానవత్వం చాటుకున్నారు.


ఈ గ్రూపు రక్తం దొరకడం కష్టం
- ప్రతాప్‌రెడ్డి, గోవిందిన్నె, దొర్నిపాడు మండలం   

నాది అరుదైన బీ నెగెటివ్‌ రక్తం. ఈ గ్రూపు రక్తం దొరకడం కష్టం కావడంతో నావంతు ప్రజలకు ఉపయోగపడాలని నిర్ణయించుకున్నా. మదర్‌ యూత్‌ సొసైటీ తరఫున ఇప్పటి వరకు 49 సార్లు రక్తదానం చేశా. నేను వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నా. ఎవరైనా రోగులకు రక్తం అవసరమని చెబితే ఎన్ని పనులున్నా వాయిదా వేసుకుని వెళ్లి రక్తదానం చేస్తున్నా.


27 సార్లు ...
- గురుస్వామి, డోన్‌

డోన్‌కు చెందిన గురుస్వామి ఇప్పటివరకు 27 సార్లు రక్తదానం చేసినట్లు తెలిపారు. తనది ‘ఏ’ పాజిటివ్‌ అని, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి రక్తదానం చేస్తే వారికి ప్రాణదానం చేసినంత ఫలమని నమ్మి తాను చేస్తుంటానన్నారు. తనతో పాటు స్నేహితులు కూడా ఎవరికైనా రక్తం అవసరమని తెలిస్తే వెంటనే రక్తదానం చేస్తుంటారన్నారు. ఎవరికైనా రక్తం అవసరమనుకుంటే డోన్‌ పట్టణంలోని ద్రోణాచల సేవాసమితిని సంప్రదిస్తే చాలని...తాము ముందుకొస్తామని గురుస్వామి చెబుతున్నారు.


ఏపీలోనే కాకుండా తెలంగాణలోనూ..
- ఆలా మధు, సీసంగుంతల

సీసంగుంతల గ్రామానికి చెందిన ఆలామధు సేవా కార్యక్రమాలతో పాటు రక్తదానం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎవరైనా ఆపదలో ఉన్నారని, రక్తం అవసరమని తెలిస్తే చాలు వెళ్లి రక్తదానం చేస్తుంటానని చెబుతున్నారు. తనది ఓ పాజిటివ్‌ రక్తమని, ఇప్పటి వరకు 45 సార్లు రక్తదానం చేశానన్నారు. ఎవరికైనా రక్తదాతల వివరాలు గానీ, రక్తదానం గురించి సందేహాలుంటే తనను సంప్రదించొచ్చని చెబుతున్నారు. ఏపీలోనే కాకుండా తెలంగాణలోని పలు జిల్లాల్లోని స్నేహితుల ద్వారా రక్తదానం చేయిస్తున్నట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో తాము రక్తదానం చేయడంతో ఎంతోమంది ప్రాణాల్ని కాపాడామన్న సంతృప్తి తమకు మిగిలిందన్నారు.


సేవా సమితి నుంచి సాయం 
- చొక్కా సునీల్‌కుమార్, ఆపద్బాంధవ సేవా సమితి, మద్దికెర 

ఆపద్బాంధవ సేవా సమితి ద్వారా ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు రక్త దానం చేయడంతో పాటు, ఇతర సామాజిక కార్యక్రమాల్లో మా సంఘం సభ్యులు చురుగ్గా పాల్గొంటున్నారు. ఇప్పటికే మా సంఘంలోని సభ్యులు 511 మందికి రక్తదానం చేశారు. ఇంకా నిరంతరం చేస్తూనే ఉంటాం. తొమ్మిది మంది సభ్యులు అర్ధరాత్రి సమాచారం అందినా.. ఆ ప్రాంతానికి చేరుకుని బాధితులను కాపాడేందుకు తమ వంతుగా పాటుపడుతున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని