logo

బాబు సంతకం.. జనం సంతసం

ఐదు సంతకాలు... మెగా డీఎస్సీ   ప్రకటన.. నైపుణ్య గణన నిర్ణయంతో యువత.. భూ హక్కు చట్టం రద్దుతో కర్షకులు, న్యాయవాదులు.. పింఛన్ల పెంపుతో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు..

Published : 14 Jun 2024 03:03 IST

ఐదు సంతకాలు... మెగా డీఎస్సీ   ప్రకటన.. నైపుణ్య గణన నిర్ణయంతో యువత.. భూ హక్కు చట్టం రద్దుతో కర్షకులు, న్యాయవాదులు.. పింఛన్ల పెంపుతో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు.. అన్న క్యాంటీన్ల పునరుద్ధరణతో తీరనున్న ఆకలి.. ఇలా వర్గాలకు మేలు చేయనున్నాయి.


1. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు గురువారం ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే  చేసిన మొదటి ఐదు సంతకాలు ఎంతో మందికి మేలు చేయనున్నాయి.   ఉమ్మడి కర్నూలు జిల్లాలో లక్షలాది మందికి ప్రయోజనం దక్కనుంది.


2. మెగా డీఎస్సీ ప్రకటనలో ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 53 మండలాల్లో సుమారు 1600 ఎస్జీటీ పోస్టులు, స్కూల్‌ అసిస్టెంట్లు 300 నుంచి 400 వరకు పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉంది. 


3. ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌-2023ను రద్దు చేయడంతో కర్నూలు జిల్లాలో 4,21,000 హెక్టార్లు, నంద్యాలలో 2,38,130 హెక్టార్ల సాగు భూమి హక్కుదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 


4. కర్నూలులో 2,11,431 మంది, నంద్యాలలో 1,90,725 మంది పింఛన్‌ లబ్ధిదారులు ఉన్నారు. ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు రూ.3 వేలతోపాటు జులై మాసంలో కొత్త పింఛను రూ.4 వేలు కలిపి ఒకేసారి రూ.7 వేలు అందించే అవకాశం ఉంది.


5.ఉమ్మడి కర్నూలు జిల్లాలో పురపాలికల్లో మూత పడిన అన్న క్యాంటీన్లను పునరుద్ధరించనున్నారు. ఇప్పటికే పుర అధికారులు భవనాలు పరిశీలించారు. 


నైపుణ్యాల గణనతో ఉమ్మడి జిల్లాలో లక్షల మంది యువతకు ప్రయోజనం చేకూరనుంది. ఉపాధి కార్యాలయంలో నమోదైన లెక్క ప్రకారం 51,459 మంది నిరుద్యోగులు ఉన్నారు. నమోదు చేసుకోని వారు ఇంతకు రెట్టింపు ఉన్నట్లు అంచనా.


ఐదు రూపాయల ‘ఆహా’రశాలలు

పేదోళ్ల ఆకలి తీర్చిన అన్న క్యాంటీన్లను పునరుద్ధరించాలని సీఎం చంద్రబాబునాయుడు నిర్ణయించారు. ఉద్యోగం, ఉపాధి, ఇతర పనుల నిమిత్తం పల్లెల నుంచి పట్టణాలకు పేదల ఆకలి తీర్చడానికి రూ.5కే భోజనం అందించేవారు. ఉదయం అల్పాహారం కింద ఉప్మా, పొంగల్, ఇడ్లీ, వడ ఇచ్చేవారు. మధ్యాహ్నం, రాత్రి అన్నం, పప్పు, రసం, సాంబారు, పెరుగు, పచ్చడి, అప్పడం, కూర, రాత్రి సమయంలో పుల్కాలు అందించేవారు. ఆదోని పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రి పక్కన ఖాళీ స్థలంలో నిర్వహించిన అన్న క్యాంటీన్‌లో నిత్యం వెయ్యి మంది వరకు భోజనం చేసేవారు. కర్నూలు కలెక్టరేట్‌ వద్ద కేంద్రం ఎదుట బారులు తీరేవారు. పక్కనే ప్రభుత్వాసుపత్రి ఉండటంతో రోగుల సహాయకులు ఇక్కడికి వచ్చేవారు. నంద్యాల ప్రభుత్వాసుపత్రి వద్ద నిత్యం వెయ్యి మందికి పైగా భోజనం చేసేవారు. ఆత్మకూరులోని పాత బస్టాండులో ఉదయం, మధ్యాహ్నం వేళ కలిపి 1,400 మంది తినేవారు. ఇలా ప్రతి పట్టణంలో ఆసుపత్రి, బస్టాండు, ముఖ్య కూడళ్లల్లో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లు ఎంతో మంది కడుపు నింపాయి. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత వీటికి తాళం వేసి పేదోడి నోటికాడ ముద్ద లాగేసింది. ఆయా భవనాలకు రంగులు మార్చి ఇతర కార్యాలయాలకు అప్పగించారు. వీటిని పునరుద్ధరిస్తూ సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకోవడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

న్యూస్‌టుడే, ఆదోని పురపాలకం


మెగా డీఎస్సీ... నిరుద్యోగులకు  వరం

పేదింటి బిడ్డలు.. పల్లెటూరి పిల్లలు..డీఈడీ, బీఈడీ పూర్తి చేశారు.. అప్పులు చేసి శిక్షణకు వెళ్లి ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)లో ఉత్తీర్ణులయ్యారు. ఇంకో మెట్టు ఎక్కితే గమ్యం చేరుకోవచ్చని ఆశించారు. వైకాపా ఐదేళ్ల పాలనలో ఒక్క డీఎస్సీ ప్రకటన లేక నరకం అనుభవించారు. తెదేపా అధికారంలోకి వస్తే మొదటి సంతకం మెగా డీఎస్సీపైనే చేస్తానంటూ చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ ప్రకారమే తొలి సంతకం మెగా డీఎస్సీ దస్త్రంపై పెట్టారు. ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా 30 వేల మందికిపైగా బీఈడీ, డీఈడీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఉన్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వస్తుందనగా యువతను మభ్యపెట్టేందుకు వైకాపా అరకొర పోస్టులతో డీఎస్సీ ప్రకటించారు. ఉమ్మడి జిల్లాలో స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు 550, ఎస్జీటీ పోస్టులు 1,022, టీజీటీ 121 కలిపి మొత్తం 1,693 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు చూపారు. వీటికి 20 వేల మందికిపైగా దరఖాస్తులు చేసుకున్నారు. వైకాపా ప్రభుత్వంలో జారీ చేసిన డీఎస్సీ ప్రకటనను సరి చేసి కొత్తగా ప్రకటన విడుదల చేశారు. 53 మండలాల్లో సుమారు 1600 ఎస్జీటీ పోస్టులు ఖాళీలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గతేడాది డిసెంబరు వరకు ఉద్యోగ విరమణ చేసిన వారితో పాటు ప్రస్తుతం ఉన్న ప్రతి ఖాళీని గుర్తించి వివరాలు వెలికితీశారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో అన్ని రకాల పోస్టులు కలిపి రెండువేలకు పైగా భర్తీ చేసే అవకాశం ఉంది.. ఇందులో స్కూల్‌ అసిస్టెంట్లు 300 నుంచి 400 వరకు ఉండే అవకాశం ఉందని అదికారులు చెబుతున్నారు.

న్యూస్‌టుడే, నంద్యాల పట్టణం


యువశక్తికి నైపుణ్య మార్గం

యువ‘శక్తి’లో నైపుణ్యం సన్నగిల్లింది. దీంతో చదువుకు తగ్గట్టు ఉద్యోగాలు రావడం లేదు. ఈ నేపథ్యంలో నైపుణ్య గణన చేయాలని సీఎం చంద్రబాబునాయుడు నిర్ణయించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే దీనిపై సంతకం చేశారు. గణన ద్వారా ఎవరిలో ఎలాంటి నైపుణ్యాలున్నాయనేది తేల్చనున్నారు. ఇది యువతకు ఎంతో మేలు చేయనున్నది నిపుణులు భావిస్తున్నారు. గతంలో తెదేపా అధికారంలో ఉన్న సమయంలో యువతకు ఉద్యోగ నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కర్నూలులోని జి.పుల్లారెడ్డి ఇంజినీరింగ్, నంద్యాలలోని రాజీవ్‌గాంధీ మెమోరియల్‌ కళాశాల, శ్రీశైలంలోని ప్రభుత్వ ఆదర్శ రెసిడెన్షియల్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలో సాంకేతిక శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. జి.పుల్లారెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాలలో సుమారు రూ.2 కోట్ల విలువ చేసే యంత్రాలు, పరికరాలు, సాఫ్ట్‌వేర్‌తో 2017లో సీమెన్స్‌ సాంకేతిక నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. ఇవి యువతకు ఎంతో మేలు చేశాయి.. ఆయా కేంద్రాల్లో శిక్షణ పొందిన వారు ఉన్నత ఉద్యోగాలు పొందారు. వైకాపా అధికారంలోకి వచ్చిన వీటికి తాళం వేసింది. నేషనల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కళాశాల నిబంధనల ప్రకారం డిగ్రీ, పీజీ విద్యార్థులకు లెవెల్‌ 4, 5, 6 స్థాయిల్లో శిక్షణ ఇప్పించాలి. స్థాయి-5 కింద తర్ఫీదు ఇచ్చి మమ అనిపించారు. చివరకు నిరుద్యోగుల సంఖ్యను తగ్గించే ప్రయత్నం చేశారు.  - న్యూస్‌టుడే, కల్లూరు గ్రామీణ


భూభక్ష చట్టం రద్దు

తేడాది అక్టోబరు 31న వైకాపా అమల్లోకి తీసుకొచ్చిన ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌-2023ను రద్దు చేస్తూ సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకోవడంపై రైతులు, న్యాయవాదులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చట్టం అమల్లోకి వస్తే భూ యజమానులు, కొనుగోలుదారులు భూ హక్కులపై భరోసా కోల్పోవాల్సిన పరిస్థితి ఉండేది. భూ వివాదాల పరిష్కారాల కోసం కోర్టుకు వెళ్లకుండా నిబంధనలు పెట్టి యజమాని స్వేచ్ఛను వైకాపా ప్రభుత్వం హరించివేసింది. దీనిపై రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. శాశ్వత భూహక్కు.. భూరక్ష అంటూ వైకాపా ప్రభుత్వం భూ సర్వే చేశారు. కర్నూలు జిల్లాలో 4,21,000 హెక్టార్లు, నంద్యాలలో 2,38,130 హెక్టార్ల సాగు భూమి ఉంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2020 డిసెంబరులో భూరీసర్వేకు శ్రీకారం చుట్టారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 919 రెవెన్యూ గ్రామాల్లో 4,84,662 సర్వే నంబర్లు ఉన్నాయి. ఇప్పటి వరకు 489 గ్రామాల్లో రీ సర్వే పూర్తయ్యిందని అధికారులు చెబుతున్నారు. దశాబ్దాలకాలంగా ఉన్న సర్వే నంబర్ల స్థానంలో ల్యాండ్‌ పార్సిల్‌ మ్యాప్‌ (ఎల్‌పీఎం)లను తీసుకొచ్చారు. భూములకు పునాదులుగా ఉన్న ఆర్‌ఎస్‌ఆర్‌ కనుమరుగు చేసే పరిస్థితి తీసుకొచ్చారు. రైతులకు సమాచారం ఇవ్వకుండానే..హడావుడిగా సర్వే చేశారు. సర్వేలో నిర్దిష్ట ప్రమాణాలు పాటించకపోవడంతో భూ విస్తీర్ణంలో తేడాలొచ్చాయి. పట్టాదారు పాసుపుస్తకాలు, సరిహద్దు రాళ్లపై జగన్‌ బొమ్మ వేశారు. వీటన్నింటినీ రద్దు చేయాలని రైతులు విన్నవిస్తున్నారు.

న్యూస్‌టుడే, కర్నూలు వ్యవసాయం 


అవ్వా తాతల ఆనందం

సామాజిక పింఛను సొమ్ము పెంపుతో ఉమ్మడి జిల్లాలో 4 లక్షల మందికిపైగా లబ్ధిదారులకు మేలు జరుగనుంది. కొన్ని కుటుంబాల్లో వృద్ధాప్య పింఛను సొమ్ము తెచ్చి ఇస్తేనే అవ్వా, తాతలకు అన్నంపెట్టే పరిస్థితి. మలి వయస్సులో ఏ పని చేతకాని వృద్ధులకు సీఎం చంద్రబాబు పెంచిన పింఛను సొమ్ముతో నెలంతా బతికేయవచ్చని భరోసా కలిగింది. రూ.200 పింఛన్‌ను 2014లో తెదేపా హయాంలో చంద్రబాబు ఐదు రెట్లు పెంచి రూ.1,000 చేశారు. ఆ తర్వాత దాన్ని రూ.2 వేలకు పెంచారు. ఈసారి రూ.4 వేలకు పెంచుతామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. ఏప్రిల్‌ నుంచి పెంచిన పింఛన్‌ను వర్తింపజేస్తామని ప్రకటించారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు తదితర విభాగాల వారికి జులై 1న రూ.7 వేల పింఛను అందనుంది. జులై నెల పింఛను రూ.4 వేలతోపాటు ఏప్రిల్, మే, జూన్‌ నెలలకు సంబంధించి నెలకు రూ.వేయి చొప్పున అందించనున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 10 రకాల సామాజిక పింఛనుదారులకు నెలకు రూ.4 వేలు ఇవ్వనున్నారు. కర్నూలు జిల్లాలో 2,11,431 మంది, నంద్యాల జిల్లాలో 1,90,725 మంది కలిపి మొత్తం 4,02,156 మందికి పెంచిన పింఛను ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు రూ.3 వేలతోపాటు జులై మాసంలో కొత్త పింఛను రూ.4 వేలు కలిపి ఒకేసారి రూ.7 వేలు పంపిణీ చేయనున్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 4.02 లక్షల మంది పింఛనుదారులు ఉండగా, ఇందులో వృద్ధాప్య పింఛనుదారులే 2.41 లక్షల మంది ఉన్నారు. మొత్తం పది విభాగాల్లో వృద్ధాప్యంలోని అవ్వా, తాతలకే పెంచిన సొమ్ము ఆసరా కానుంది. ఆ తర్వాత వితంతువులకు, ఒంటరి మహిళలకు ఆర్థిక లబ్ధి చేకూరనుంది.

న్యూస్‌టుడే, కర్నూలు సచివాలయం 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని