logo

రూ.18లక్షల విలువైన సొమ్ము స్వాధీనం

కారు డ్రైవర్‌గా ఉద్యోగానికి చేరిన ఇంటికే కన్నాం వేసి బంగారం, నగదును దొంగలించిన ఘటన దొర్నిపాడు మండలంలోని డబ్ల్యూకొత్తపల్లె గ్రామంలో చోటుచేసుకుంది.

Published : 15 Jun 2024 03:26 IST

దొర్నిపాడు, న్యూస్‌టుడే : కారు డ్రైవర్‌గా ఉద్యోగానికి చేరిన ఇంటికే కన్నాం వేసి బంగారం, నగదును దొంగలించిన ఘటన దొర్నిపాడు మండలంలోని డబ్ల్యూకొత్తపల్లె గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై  శుక్రవారం ఆళ్లగడ్డ డీఎస్పీ కార్యాలయంలో  విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి  డీఎస్పీ షర్ఫుద్దీన్‌  వివరాలు వెల్లడించారు. డబ్ల్యూకొత్తపల్లె గ్రామానికి చెందిన యోగేశ్వర్‌రెడ్డి అనే యువకుడు అదే గ్రామానికి చెందిన భూమా బ్రహ్మానందరెడ్డి కారు డ్రైవర్‌గా పనిచేస్తుండేవాడు. ముద్దాయి సోదరి వివాహం జరగడంతో తన కుటుంబానికి రూ. 4 లక్షలు అప్పు అయింది. ఈ అప్పును తీర్చాలని ఈ దొంగతనానికి పాల్పడ్డాడు. 7నెలల క్రితం భూమ బ్రహ్మనందరెడ్డి కారులో బీరువా తాళంచెవి పడటంతో దానిని దొంగలించాడు. భూమ ఇంట్లోని  బీరువాలో ఉన్న డైమండ్‌ నెక్లస్, రెండు బంగారు నెక్లస్‌లు, నాలుగు బంగారు గాజులు, డాలరుతో పాటు రూ.50వేల నగదును దొంగలించాడు. దీని విలువ దాదాపు రూ.18 లక్షల 20వేల రూపాయలు ఉంటుంది. ఈ సొమ్ము మొత్తాని ముద్దాయి నుంచి  స్వాధీనం చేసుకొన్నట్లు డీఎస్పీ తెలిపారు. బాధితుడి కుమారుడు భూమా సందీప్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేశారు. ఈ సమావేశంలో సీఐ హనుమంతు నాయక్, ఎస్సై సురేశ్‌ పాల్గొన్నారు. 


గాయపడిన మహిళ మృతి

రుద్రవరం, న్యూస్‌టుడే:  మండలంలోని  ఎల్లావత్తుల గ్రామంలో ఈ నెల 10వ తేదీన దాయాదుల మధ్య జరిగిన ఘర్షణలో ప్రకాశమ్మ(60) అనే మహిళ తీవ్రంగా గాయపడి ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటూ శుక్రవారం మృతి చెందినట్లు ఎస్సై నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఇంటి వద్ద అభ్యంతరకరంగా మాట్లాడుతున్న రామనరసింహారావు, నర్సింగరావులను  ప్రకాశమ్మ భర్త నర్సింగరావు ప్రశ్నించడంతో  గొడవ ప్రారంభమైంది. ఈ దాడిలో ప్రకాశమ్మ గాయపడింది. కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని