logo

క్రికెట్‌లో గెలుపు కెరటాలు

ఒకరు తన బ్యాటింగ్‌ స్టైల్‌తో పరుగుల వర్షం కురిపిస్తే.. మరొకరు తన బౌలింగ్‌ వేగంతో ప్రత్యర్థులకు సింహస్వప్నంలా మారి క్రికెట్‌ క్రీడలో తమ సత్తా చాటుతున్నారు ఇద్దరు క్రీడాకారిణులు.

Published : 15 Jun 2024 03:34 IST

బౌలింగ్, బ్యాటింగ్‌లో ప్రత్యేకత
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక 
న్యూస్‌టుడే, ఆదోని క్రీడలు

ఒకరు తన బ్యాటింగ్‌ స్టైల్‌తో పరుగుల వర్షం కురిపిస్తే.. మరొకరు తన బౌలింగ్‌ వేగంతో ప్రత్యర్థులకు సింహస్వప్నంలా మారి క్రికెట్‌ క్రీడలో తమ సత్తా చాటుతున్నారు ఇద్దరు క్రీడాకారిణులు. ఇటీవల కర్నూలు నగరంలో గత నెలలో జరిగిన క్రికెట్‌ ఎంపిక పోటీల్లో తమ సత్తా చాటి రాష్ట్ర స్థాయి క్రికెట్‌ పోటీల్లో పాల్గొననున్న కర్నూలు జిల్లా జట్టులో స్థానం సంపాదించారు. సంజన బ్యాటింగ్‌ నైపుణ్యంతో ప్రత్యేకత చాటగా.. మేఘనారెడ్డి బౌలింగ్‌లో రాణిస్తోంది. 

శిక్షణ ప్రత్యేకత 

ఆదోని తాలుకా క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆదోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల యాజమాన్యం సహకారంతో క్రికెట్‌ శిక్షణ శిబిరంలో క్రీడాకారిణులు సంజన, మేఘనారెడ్డి మెలకువలు నేర్చుకుంటున్నారు. కోచ్‌ బాలాజీరావు క్రీడాకారులకు ప్రత్యేక శిక్షణ ఇస్తూ తర్ఫీదు చేస్తున్నారు. ఇప్పటికే ఈ కోచింగ్‌లో శిక్షణ తీసుకున్న పలువురు క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయి క్రికెట్‌ పోటీల్లో పాల్గొని తమ సత్తాచాటుతున్నారు. 


సంచలనాల సంజన 

దోని పట్టణం అంబేడ్కర్‌నగర్‌లో నివాసం ఉంటున్న పొంపాపతి, మానస దంపతుల కుమార్తె బి.సంజన పదో తరగతి చదువుతోంది. క్రికెట్‌ క్రీడపై మక్కువతో ఆరేళ్లుగా ఆదోని పట్టణంలో కోచ్‌ బాలాజీరావు వద్ద బ్యాటింగ్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకుంటోంది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో క్రికెట్‌లో రాణిస్తోంది. ఓ వైపు చదువుతూనే మరోవైపు క్రికెట్‌ ఆడుతూ సాధన చేస్తోంది. ఇటీవల కర్నూలు నగరంలో కర్నూలు క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి క్రికెట్‌ ఎంపిక పోటీల్లో సంజన తన బ్యాటింగ్‌ ప్రతిభ చాటి.. అండర్‌-15 జిల్లా జట్టుకు, అండర్‌-19 జట్టుకు ఎంపికైంది. జూన్‌ 1 నుంచి 13వ తేదీ వరకు నెల్లూరు, వెంకటగిరిలో జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తోంది. గత ఏడాది సైతం అండర్‌-15, అండర్‌-19 కర్నూలు జిల్లా జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించి ప్రతిభ చాటింది. జాతీయ స్థాయిలో ఎంపికై తన సత్తా చాటడమే తన లక్ష్యమని చెబుతోంది క్రీడాకారిణి సంజన. 


ఘనవిజయాల మేఘన 

దోని పట్టణం తిరుమలనగర్‌లో నివాసం ఉంటున్న వై.రామ్మోహన్‌రెడ్డి, వై.శ్రీజ్యోతి దంపతుల కుమార్తె వై.మేఘనారెడ్డి ఎనిమిదో తరగతి చదువుతోంది. ఓ వైపు చదువుతో పాటు మరోవైపు గత ఏడాది నుంచి క్రికెట్‌ క్రీడలో సాధన చేస్తోంది. కోచ్‌ బాలాజీరావు వద్ద ప్రత్యేక శిక్షణ తీసుకుంటోంది. తన బౌలింగ్‌ పదునుతో బ్యాటింగ్‌ చేస్తున్న తన ప్రత్యర్థులకు  వణుకు పుట్టిస్తుంది. కర్నూలు నగరంలో జరిగిన ఎంపిక పోటీల్లో ప్రతిభ చాటి జిల్లా జట్టుకు ఎంపికైంది. జూన్‌ 1 నుంచి 13వ తేదీ వరకు జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో కర్నూలు జిల్లా జట్టు తరఫున పోటీలో నిలిచింది. చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని.. జాతీయ స్థాయిలో తన ప్రత్యేకతను చాటడమే లక్ష్యమని చెబుతోంది మేఘనారెడ్డి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు