logo

నిర్లక్షయం ఎప్పటికి తొలిగేనో?

కఠినమైన రాయిని అందమైన శిల్పంగా మార్చడంలో ఆళ్లగడ్డ శిల్పులు నేర్పరులు. రాయిని శిల్పంగా మార్చే క్రమంలో ప్రస్తుతం ఉపయోగిస్తున్న అధునాతన పరికరాల కారణంగా రాతి దుమ్ము శిల్పుల పాలిట శాపంగా మారుతోంది.

Published : 15 Jun 2024 03:37 IST

పట్టించుకోని ప్రభుత్వాలు
ఆర్థిక ఇబ్బందులు, రోగాలతో శిల్ప కళాకారులు సతమతం
న్యూస్‌టుడే, ఆళ్లగడ్డ

కఠినమైన రాయిని అందమైన శిల్పంగా మార్చడంలో ఆళ్లగడ్డ శిల్పులు నేర్పరులు. రాయిని శిల్పంగా మార్చే క్రమంలో ప్రస్తుతం ఉపయోగిస్తున్న అధునాతన పరికరాల కారణంగా రాతి దుమ్ము శిల్పుల పాలిట శాపంగా మారుతోంది. రాతి ధూళి ఊపిరితిత్తుల్లోకి వెళ్లి తీవ్ర రోగాల బారిన పడుతున్నారు. మరోవైపు వరుస ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. కొత్త ప్రభుత్వమైనా వారి కష్టాలను తీర్చేదిశగా అడుగులు వేయాలని కోరుతున్నారు.

వైద్య పరీక్షలేవీ...?

ప్రమాదకర పరిస్థితిలో పనిచేస్తూ ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారికి వైద్య పరీక్షలు నిర్వహించిన దాఖలాలు లేవు. ఏడాదికోమారు క్షయ సిబ్బంది శిల్పులతో సమావేశమైనా...తదుపరి ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని కార్మికులు వాపోతున్నారు. అటు ఆరోగ్యంగానూ, ఇటు ఆర్థికంగా నష్టపోతున్న శిల్పులను ఆంతకు మించి శిల్పుల ఆరోగ్య పరిరక్షణకు వైద్య ఆరోగ్య శాఖ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. 

అంతర్జాతీయంగా గుర్తింపు

ఆళ్లగడ్డ శిల్పకళకు అంతర్జాతీయంగా భౌగోళిక గుర్తింపు(జియోగ్రాఫికల్‌ ఐడెంటిటీ) పొందినా శిల్పుల జీవితాల్లో మాత్రం మార్పు రాలేదు. శిల్పాలను తయారు చేసేందుకు ఎన్నో ఉలిదెబ్బలు, యంత్రాలతో కోతలు, నునుపు చేసేందుకు పాలిష్‌ పనులు చేయాల్సి ఉంటుంది. ఉదయం మొదలు సూర్యాస్తమయం వరకు రాళ్లమధ్యనే, దుమ్ము, ధూళిలోనే వీరి పనిచేస్తుంటారు. శిలను శిల్పంగా మార్చే క్రమంలో కటింగ్‌ యంత్రంతో పని చేయాలి. ఈ యత్రంతో రోజుల్లో, వారాల్లో చేయాల్సిన పని గంటల్లో, రోజుల్లో పూర్తి చేయాలి. శిల్పానికి మెరుగులుదిద్దేందుకు పాలిష్‌ యంత్రం ఉపయోగిస్తారు. వాటితో పనిచేస్తున్నప్పుడు రాయి నుంచి ప్రమాదకరంగా ధూళి బయటకు వస్తుంది. ఇది నేరుగా శ్వాస ద్వారా ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది. సాధారణ ధూళికంటే ఇది బరువుగా ఉండటం వల్ల ఊపిరితిత్తుల గోడలకు హత్తుకునిపోతుంది. ఎక్కువగా పేరుకోవడంతో రోగాలు ముసురుతున్నాయి.


మరొకొన్ని సంఘటనలు ఇలా...

  • నాలుగు నెలల కిందట శిల్పాలకు విద్యుత్తు యంత్రంతో సుధాకర్‌ పాలిష్‌ చేస్తుండగా విద్యుత్తు సరఫరా అవ్వడంతో విద్యుదాఘాతానికి గురై మృతి చెందారు. 
  • వృత్తిలో భాగంగా ఆలయాలపై శిల్పాల పనులు చేస్తూ పైనుంచి కింద పడి ఓ శిల్పి గాయపడ్డారు.
  • రామలక్ష్మి కొట్టాల ప్రాంతానికి చెందిన ఓ శిల్పి క్షయతో 30 ఏళ్ల వయసులోనే ప్రాణాలొదిలారు. కుమార్‌ యాదవ్‌ కూడా ఇలానే మరణించారు. రామాంజనేయులు ఊపిరితిత్తుల వ్యాధితో మరణించారు.
  • ఆళ్లగడ్డలోని కోర్టుదారిలో ఉన్న ఓ శిల్పి ప్రాణాంతక వ్యాధితో మృతి చెందారు.
  • మరోశిల్పి ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నారు.
  • 32 ఏళ్ల వయసులోనే రాఘవేంద్ర గుండెపోటుతో మృతి చెందడంతో ఆయన ముగ్గురు పిల్లలను, భార్యను అనాథను చేశారు. జానీ అనారోగ్యంతో మృతి చెందారు
  • ఉయ్యాలవాడ మండలం కాకరవాడకు చెందిన ఇద్దరు శిల్పులు అనార్యోగంతో మృతి చెందారు.ఇలా మరణించిన అందరి వయసు 35-45 ఏళ్ల మధ్యనే ఉండటం గమనార్హం. 
  • విద్యుదాఘాతంతో దొర్నిపాడుకు చెందిన విశ్వనాథం(40) ఇటీవల మృతి చెందారు. శిల్పాలను క్రేన్‌ ద్వారా ట్రాక్టర్‌లోకి ఎక్కించే క్రమంలో హైటెన్షన్‌ తీగ క్రేన్‌ పైభాగం తాకింది. ట్రాక్టరు డ్రైవరుగా పనిచేస్తున్న విశ్వనాథం శిల్పాన్ని ఇనుపగునపంతో సరిచేస్తూ విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు.  

45 ఏళ్ల నుంచే ఆరోగ్య సమస్యలు 

-నరసింహారెడ్డి, శిల్పి

స్థానికంగా శిల్పశాలల్లో పనిచేస్తున్న వారిలో 45 ఏళ్ల నుంచే ఆరోగ్య సమస్యలు తలెత్తున్నాయి. 50 ఏళ్లలోపే ఎంతో మంది అనారోగ్య, ఆర్థిక సమస్యలతో ప్రాణాలు వదిలేస్తున్నారు. ఎక్కువ మంది క్షయ బారిన పడుతున్నారు. మా ఆరోగ్యంపై ఎవ్వరికీ శ్రద్ధలేదు.


వైద్యశిబిరం ఏర్పాటుకు చర్యలు

- పవన్, క్షయ, పర్యవేక్షణాధికారి, ఆళ్లగడ్డ

శిల్పులు పనిచేసే క్రమంలో వచ్చే రాతిపొగ అతిప్రమాదకరమైనది. డబుల్‌ ఫిల్టర్‌ మాస్కు ధరించి పనిచేయాల్సి ఉన్నా చాలా మంది అలా చేయడంలేదు. ఇదే రోగాలకు కారణంగా మారుతోంది. క్షయ వారోత్సవాల సమయంలో అవగాహన సమావేశం ఏర్పాటు చేస్తుంటాం. చికిత్స తీసుకునే వారిలో శిల్పులే ఎక్కువ మంది వస్తుంటారు. సిబ్బంది తరచూ అక్కడికి వెళ్లేలా చర్యలు తీసుకుంటుంటారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని