logo

గుజరాత్‌ తరహాలో పరిశ్రమల స్థాపనకు కృషి

ఆంధ్రప్రదేశ్‌ను గుజరాత్‌ రాష్ట్రం తరహాలో పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని, పారిశ్రామికవేత్తలతో మాట్లాడి రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని, పెట్టుబడిదారులను ఆకర్షించి రాయితీలు కల్పిస్తామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య, ఆహార శుద్ధి మంత్రి టీజీ భరత్‌ అన్నారు.

Updated : 15 Jun 2024 04:39 IST

రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌
త్రికి ఘన స్వాగతం పలికిన ఎన్డీయే కూటమి నాయకులు 

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్‌ను గుజరాత్‌ రాష్ట్రం తరహాలో పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని, పారిశ్రామికవేత్తలతో మాట్లాడి రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని, పెట్టుబడిదారులను ఆకర్షించి రాయితీలు కల్పిస్తామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య, ఆహార శుద్ధి మంత్రి టీజీ భరత్‌ అన్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారిగా శుక్రవారం కర్నూలుకు వచ్చారు. ఈ సందర్భంగా సుంకేసుల రోడ్డు సెయింట్‌ జోసఫ్‌ డిగ్రీ కళాశాల వద్ద కర్నూలు పార్లమెంట్‌ తెదేపా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి, ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్యేలు కేఈ శ్యాంబాబు (పత్తికొండ), బొగ్గుల దస్తగిరి (కోడుమూరు), డా.పార్థసారథి (ఆదోని), ఎమ్మెల్సీ బీటీ నాయుడు, తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు భారీ గజమాలతో ఘన స్వాగతం పలికారు. తెదేపా నేతలు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తెదేపా జిల్లా కార్యాలయానికి చేరుకుని ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళి అర్పించారు. అనంతరం మంత్రి విలేకర్లతో మాట్లాడారు. ఐదు కోట్ల మంది ప్రజలకు మంత్రిగా సేవ చేసే అవకాశం రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తనపై నమ్మకంతో మంత్రిగా ఎంపిక చేసి కీలక శాఖలను కేటాయించిన చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. 

తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు 

జిల్లాలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, కర్నూలు నగరంలో సైతం ఇబ్బందులు పడుతున్నారని, సమస్య పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. కర్నూలు నగరాన్ని ప్రణాళికాబద్ధంగా దశల వారీగా అభివృద్ధి చేస్తామన్నారు. గడిచిన ఐదేళ్ల కాలంలో చంద్రబాబు నాయుడిని తాను దగ్గర నుంచి చూశానని, తనకు మంత్రి పదవి రావడం అదృష్టంగా భావిస్తానన్నారు.  రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ మొదటిసారి హైదరాబాద్‌ నుంచి కర్నూలుకు విచ్చేసిన సందర్భంగా ఎన్డీయే కూటమి నాయకులు, కార్యర్తలు ఘన స్వాగతం పలికారు. ముందుగా కర్నూలులోని సుంకేసుల రోడ్డులోని గోదా గోకులంలో టీజీ భరత్‌ ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత ర్యాలీ తెదేపా కార్యాలయం వరకు సాగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, ఆలూరు ఇన్‌ఛార్జి వీరభద్రగౌడ్‌ పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని