logo

అనుభవం అభివృద్ధికి అవకాశం

గత ప్రభుత్వం అయిదేళ్లు ముస్లిం మైనార్టీల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం 6.70 లక్షల మంది ముస్లింలు నివసిస్తున్నారు.

Updated : 15 Jun 2024 04:27 IST

మైనార్టీ శాఖ మంత్రిగా ఎన్‌ఎండీ ఫరూక్‌ 
న్యూస్‌టుడే, నంద్యాల పట్టణం

గత ప్రభుత్వం అయిదేళ్లు ముస్లిం మైనార్టీల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం 6.70 లక్షల మంది ముస్లింలు నివసిస్తున్నారు. రంజాన్‌ తోఫా ఆపేశారు.. మసీదులు, దర్గాలు, షాదీఖానాల అభివృద్ధికి నిధులివ్వలేదు.. దుల్హన్‌ పథకం, మైనార్టీ కార్పొరేషన్‌ రుణాలు నిలిపివేశారు.. తెదేపా హయాంలో రూ.15 కోట్లతో మసీదులు, షాదీఖానాల అభివృద్ధికి ప్రతిపాదించగా... జగన్‌ మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి ఊసే ఎత్తలేదు..ఆగ్రహం వ్యక్తం చేసిన ముస్లింలు ఓటుతో వైకాపాకు బుద్ధి చెప్పారు.. కూటమికి పట్టం కట్టారు. మంత్రి వర్గం కొలువుదీరింది.. సీనియర్‌ నేత, ఎన్‌ఎండీ ఫరూక్‌కు మైనార్టీ సంక్షేమ శాఖను కట్టబెట్టారు.. గతంలో పని చేసిన అనుభవం ఉండటంతో ఉమ్మడి జిల్లాలో ముస్లిం మైనార్టీ అభివృద్ధికి అడుగులు పడతాయని పలువురు భావిస్తున్నారు.  

ఉపాధి ‘రుణం’ పునరుద్ధరించాలి

ఉమ్మడి కర్నూలు జిల్లాలో 6.70 లక్షల మంది ముస్లిం జనాభా ఉండగా.. ఇందులో అత్యధికులు చిరు వ్యాపారాలు, చిన్నచిన్న పనులే జీవనాధారం.  తెదేపా ప్రభుత్వంలో మైనారిటీల రాయితీ రుణాలకు పెద్దపీట వేశారు. స్వయం ఉపాధికి 50 శాతం రాయితీతో రుణాలిచ్చారు. సాధారణ వృత్తులు చేసుకొనేందుకైతే రుణంగా రూ. 2.50 లక్షలు, ఆటో, ట్యాక్సీ-కారు తదితర రవాణా వాహనాల కొనుగోలుకు రూ. 3 లక్షలు అందించారు. మెరుగైన జీవనం సాగించడానికి స్వయం ఉపాధి రుణాలు అండగా ఉండేవి. జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత స్వయం ఉపాధి రుణాలకు ఎగనామం పెట్టారు. తిరిగి పునరుద్ధరిస్తే ఉమ్మడి కర్నూలు జిల్లాలో వేలాది మంది స్వయం ఉపాధికి ఊతమిచ్చినట్లు అవుతుంది.

వర్సిటీ వసతి కల్పించాలి

రాయలసీమ ప్రాంతంలో ముస్లింలు ఎక్కువగా ఉన్నారన్న ఉద్దేశంతో 2018లో తెదేపా ప్రభుత్వ హయాంలో కర్నూలు జిల్లాలో డాక్టర్‌ అబ్దుల్‌ హక్‌ ఉర్దూ వర్సిటీ ఏర్పాటు చేశారు. 2019లో వైకాపా ప్రభుత్వం రాగానే ఉర్దూ వర్సిటీపై చిన్నచూపు చూసింది. నిధులు కేటాయించకపోవడంతో భవన నిర్మాణాలు ముందుకు సాగలేదు. రూ.50 లక్షలు కేటాయిస్తున్నట్లు గతేడాది కిందట జరిగిన మంత్రివర్గ సమావేశం తీర్మానం చేసింది. ఇంతవరకు ఒక్క రూపాయి ఇచ్చిన దాఖలాలు లేవు. ఉర్దూ వర్సిటీలో నాలుగు డిగ్రీ కోర్సుల్లో 230 సీట్లు, 12 పీజీ కోర్సుల్లో 400 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో బీఏ (ఉర్దూ), బీఏ (హెచ్‌యూపీ)లో 60 సీట్లు ఉన్నప్పటికీ 25 శాతం సీట్లు కూడా భర్తీ కాకపోవడం గమనార్హం. పీజీ ఎంఏ ఉర్దూలో 30 సీట్లు ఉండగా 50 శాతం సీట్లు మాత్రమే భర్తీ అవుతున్నాయి. 

ఆగిన కానుకలు అందించాలి

  • తెదేపా హయాం (2014-2019)లో రంజాన్‌ మాసంలో రంజాన్‌ తోఫాను అందించేవారు. ఐదు కిలోల గోధుమ పిండి, రెండు కిలోల చక్కెర, కిలో సేమియా, 100 గ్రాముల నెయ్యి ఉచితంగా పంపిణీ చేసేవారు. ఏటా ఉమ్మడి జిల్లాలో 2,21346 కుటుంబాలకు అందేది. జగన్‌ అధికారంలోకి వచ్చాక పండుగ కానుకలకు కత్తెరేశారు.
  • అంతకుముందు వరకు ముస్లింలకు ఇస్తున్న రూ.25 వేల సాయాన్ని రూ.50 వేలకు పెంచి ‘చంద్రన్న పెళ్లికానుక’గా అమలు చేశారు. తెదేపా అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఉమ్మడి జిల్లాలో 10,981 మందికిపైగా సాయం అందింది. పెళ్లి కుమార్తె తల్లి బ్యాంకు ఖాతాలో ప్రభుత్వం జమ చేసేది. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత 2022, అక్టోబరు నుంచి ఇప్పటివరకు సాయం అందుకున్న వారి సంఖ్య వెయ్యి దాటలేదు. రూ.లక్ష ఇస్తామని చెప్పి.. పెళ్లి కొడుకు, పెళ్లికుమార్తె పదో తరగతి ఉత్తీర్ణులవ్వాలని కొర్రీ పెట్టింది. దీంతో చాలా మందికి షాదీతోఫా అందలేదు. 

ఉర్దూ చదువులు చక్కదిద్దాలి

ప్రాథమిక, ప్రాథమికోన్నత స్థాయిలో 116 ఉర్దూ మాధ్యమ పాఠశాలలు ఉన్నాయి. 7,448 మంది చదువుకుంటున్నారు. జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలు 16 మాత్రమే ఉన్నాయి.. ఇందులో 3,291 మంది విద్యనభ్యసిస్తున్నారు. ఉన్నత విద్య చదువుకోవడానికి ఉర్దూ బడులు ఎక్కువగా లేకపోవడంతో 50 శాతం మంది మానేస్తున్నారు. ఉర్దూ మాధ్యమానికి సంబంధించి ఉమ్మడి జిల్లాలో (కర్నూలులో ఒకటి, నంద్యాల జిల్లా కేంద్రంలో ఒకటి) రెండు ఇంటర్మీడియట్‌ కళాశాలలు ఉన్నాయి. రెగ్యులర్‌ అధ్యాపకులు లేకపోవడంతో చదువులు సాగడం లేదు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని