logo

బీసీ అడుగులు.. కావాలి ప్రగతి జాడలు

ఐదేళ్లు అధికారంలో ఉన్న జగన్‌ సర్కారు ‘రోడ్ల’ నిర్వహణను గుంతల్లో వదిలేసింది.. వాటిని దాటలేక ఆర్టీసీ బస్సులు ఆపేసింది.. మృత్యు‘గుంత’లు పలువురి ప్రాణాలు తీశాయి.. విధి లేక ఛిద్రమైన రోడ్లపై వెళ్లి చాలా మంది వాహనదారుల ఒళ్లు హూనం కావడంతో ఆసుపత్రులపాలయ్యారు.

Updated : 15 Jun 2024 04:26 IST

మంత్రి జనార్దన్‌రెడ్డికి రోడ్లు, భవనాల శాఖ 
ఐదేళ్లుగా మరమ్మతులు నోచుకోని రోడ్ల బాగుకు అవకాశం
న్యూస్‌టుడే, నంద్యాల పట్టణం, బనగానపల్లి

జిల్లాలోని ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో సమావేశమవుతా.. రోడ్ల అధ్వానస్థితిపై చర్చిస్తా.. చాలా రహదారులు దెబ్బతిన్నాయి.. గుంతల దారులపై ప్రయాణించలేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. వైకాపా ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం చేసింది.. రహదారుల మరమ్మతులకు తగిన ప్రాధాన్యం ఇస్తాం.

-బీసీ జనార్దన్‌రెడ్డి, రోడ్లు, భవనాల శాఖ మంత్రి

దేళ్లు అధికారంలో ఉన్న జగన్‌ సర్కారు ‘రోడ్ల’ నిర్వహణను గుంతల్లో వదిలేసింది.. వాటిని దాటలేక ఆర్టీసీ బస్సులు ఆపేసింది.. మృత్యు‘గుంత’లు పలువురి ప్రాణాలు తీశాయి.. విధి లేక ఛిద్రమైన రోడ్లపై వెళ్లి చాలా మంది వాహనదారుల ఒళ్లు హూనం కావడంతో ఆసుపత్రులపాలయ్యారు.. ఎన్నో కుటుంబాల కన్నీటి గాథలకు కారణమైన ‘గాలి’ సర్కారును జనం ఇంటి‘ దారి’ పట్టించారు. మార్గం సుగమం చేస్తారన్న కోటి ఆశలతో కూటమికి అధికారం కట్టబెట్టారు. ముఖ్యమంత్రిగా తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టారు.. రాష్ట్రాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్లే తన జట్టు (మంత్రి వర్గం)లో ఉమ్మడి జిల్లాకు చెందిన ముగ్గురికి అవకాశం కల్పించారు. బనగానపల్లి నుంచి రెండోసారి గెలుపొందిన బీసీ జనార్దన్‌రెడ్డికి రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ అప్పగించారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో అస్తవ్యస్తంగా మారిన రహదారులు బాగయ్యే అవకాశం ఉంది.. గతంలో తెదేపా హయాంలో తీసుకొచ్చిన పలు ప్రాజెక్టులు వైకాపా నిధులివ్వక వెనక్కి వెళ్లాయి.. వాటిని పునరుద్ధరిస్తే చాలా గ్రామాలకు మార్గం సుగమం అవుతుంది.

పుష్కర మార్గం.. చొరవ తీసుకోవాలి

తుంగభద్ర పుష్కరాల వేళ నాలుగేళ్ల కిందట ప్రత్యేక మరమ్మతుల పథకం కింద 21 రహదారుల అభివృద్ధికి రూ.65 కోట్లు కేటాయించారు. ఇందులో సగం రహదారులకు నిధులు మంజూరు కాలేదు. సుంకేసుల-నాగలదిన్నె రోడ్డుకు రూ.6 కోట్లతో మరమ్మతులు చేస్తున్నట్లు ప్రకటించి తర్వాత రద్దు చేశారు. రూ.1.40 కోట్లతో కర్నూలు-లక్ష్మీపురం రహదారి, రూ.1.10 కోట్లతో అనుగొండ-లక్ష్మీపురం, రూ.2 కోట్లతో ఉల్చాల-రేమట-కొత్తకోట రహదారి, రూ.13.20 కోట్లతో కర్నూలు-బళ్లారి రహదారి పనులు ప్రారంభమే కాలేదు. రూ.23.70 కోట్ల పనులు నాలుగేళ్లయినా ప్రారంభించలేదు. వీటిపై దృష్టి సారిస్తే చాలా పల్లెలకు మెరుగైన రవాణా సౌకర్యం కలుగుతుంది.  

తట్టెడు తారు పోయని జగన్‌ సర్కార్‌

ఉమ్మడి జిల్లాలో 3,043 కి.మీ. మేర రహదారులు ఉన్నాయి. తెదేపా హయాంలో (2014-19) రోడ్ల మరమ్మతులకు ఏటా రూ.30-రూ.50 కోట్ల వరకు నిధులు మంజూరు చేసేవారు. వాటితో రహదారులకు ఇరువైపులా ఉన్న ముళ్లపొదల తొలగింపు, గుంతల పూడ్చివేత, సూచికలు ఏర్పాటు, వంతెనలకు మరమ్మతులు వంటి పనులు చేపట్టేవారు. తర్వాత వైకాపా పాలన (2019-24)లో ఏమాత్రం పట్టించుకోలేదు. ఏటా రూ.10-రూ.12 కోట్ల వరకు కేటాయింపులు చేసినా నిధులు సకాలంలో విడుదల చేయలేదు. ఆర్‌అండ్‌బీ పరిధిలో 2,800 కి.మీ. పొడవునా తారు రోడ్లు, 9 వేల కి.మీ.కుపైగా కంకర దారులున్నాయి. కనీసం గుంతల్లో తారు వేయడానికి అధికారుల వద్ద చిల్లిగవ్వ లేని పరిస్థితి నెలకొంది. నంద్యాల-నందికొట్కూరు, నంద్యాల-కోవెలకుంట్ల, నంద్యాల-బనగానపల్లి, కర్నూలు-కోడుమూరు, ఆదోని-ఎమ్మిగనూరు రహదారులు దారుణంగా దెబ్బతిన్నాయి. బాగు చేద్దామన్న ఆలోచన వైకాపా పాలకుల్లో లోపించడంతో ఇంటి దారి పట్టించారు.

మేజర్‌ ప్లాన్‌కు శ్రీకారం చుట్టాలి

నిధులు సకాలంలో విడుదల చేయకపోవడంతో వైకాపా పాలనలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ‘మేజర్‌ ప్లాన్‌’ పనులు చేసేందుకు గుత్తేదారులు ఆసక్తి చూపలేదు. దీంతో గ్రామాలు, మండల కేంద్రాలను కలిపే రహదారులు నరకానికి నకళ్లుగా మారాయి. మూడేళ్లుగా బండి ఆత్మకూరు-ఓంకారం రహదారి పనులు సా..గుతూనే ఉన్నాయి. రూ.19 కోట్లతో చేపడుతున్న ఈ రహదారి పనులు అస్తవ్యస్తంగా మారడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. బనగానపల్లి బైపాస్‌ రహదారి నిర్మాణ పనులు సర్వే దశలోనే ఆగిపోయాయి. రూ.5 కోట్లతో ఆళ్లగడ్డ-మాయలూరు రహదారిలో కుందూ నదిపై హైలెవల్‌ వంతెన నిర్మాణం హామీకే పరిమితమైంది. బ్రాహ్మణకొట్కూరు-మిడుతూరు హైలెవల్‌ వంతెన నిర్మాణానిదీ ఇదే పరిస్థితి. రూ.2 కోట్లతో చేపట్టనున్న ఈ వంతెన నిర్మాణానికి మూడుసార్లు టెండర్లు పిలిచినా స్పందన లేదు. వీటిపై దృష్టి సారించాలని ప్రయాణికులు కోరుతున్నారు. 

వాటా ఇవ్వక వదిలేసిన వైకాపా

  • చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో ఉమ్మడి జిల్లాలో 21 రహదారులను రూ.528 కోట్లతో బాగు చేసేందుకు ఎన్‌డీబీ (న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంకు) ముందుకొచ్చింది. తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా పట్టించుకోలేదు.. రాష్ట్రం తన వాటా విడుదల చేయలేదు. రూ.కోట్ల విలువైన రహదారి పనులు నిలిచిపోయినా గత పాలకులు ఒక్కసారి సమీక్ష చేయలేదు. మూడేళ్లపాటు న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంకు విభాగం ఎదురుచూసి నిధులు వెనక్కి తీసుకుంది. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన తెదేపా చొరవ తీసుకుంటే ముందడుగు పడే అవకాశం ఉంది. ఎన్‌డీబీ కింద చేపడతామన్న వెలుగోడు-మిడుతూరు, గార్గేయపురం (రూ.40.91 కోట్లు), శిరివెళ్లమెట్ట-గోస్పాడు (రూ.27.90 కోట్లు), నందికొట్కూరు-పగిడ్యాల (రూ.15.28 కోట్లు), ఒంగోలు-నంద్యాల (రూ.7.90 కోట్లు), ముదిగేడు-గుల్లదుర్తి (రూ.12.61 కోట్లు), కోడుమూరు-వెల్దుర్తి ఇలా 21 మార్గాలు రూపురేఖలు మారనున్నాయి. 
  • గతంలో తెదేపా అధికారంలో ఉండగా ఆసియా డెవలప్‌మెంట్‌ బ్యాంకు నిధులతో రోడ్లు బాగు చేయాలని నిర్ణయించారు. కోడుమూరు, ఎమ్మిగనూరు, పత్తికొండ, ఆలూరు నియోజకవర్గాల్లో ఆరు రహదారుల అభివృద్ధికి రూ.30 కోట్లు మంజూరయ్యాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో పనులు చేపట్టాల్సి ఉంది. తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా పట్టించుకోలేదు. రాష్ట్రం తన వాటా ఇవ్వకపోవడంతో ఏడీబీ నిధులు గతేడాది వెనక్కి వెళ్లాయి. 

2 కి.మీ. వేయలేకపోయారు

త్తికొండ, ఆలూరు నియోజకవర్గాలను కలిపే దగ్గరి దారిని నిధుల్లేక 2 కి.మీ. నిర్మాణం ఆగిపోవడంతో వాహనదారులు నరకం చూస్తున్నారు. ఆలూరు మండలం కె.కొట్టాల నుంచి పత్తికొండ మండలం హోసూరు వరకు 7 కి.మీ. మేర బీటీ రహదారి నిర్మాణానికి అప్పటి తెదేపా ప్రభుత్వ హయాంలో అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. నిధులు మంజూరయ్యే సమయానికి ప్రభుత్వం మారింది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.7 కోట్లు మంజూరు చేశారు. పత్తికొండ నియోజకవర్గ పరిధిలో పనులు పూర్తయ్యాయి. నిధులు సరిపోవడం లేదని ఆలూరు నియోజకవర్గ పరిధిలో రెండు కి.మీ. మేర ఆపేశారు.

- న్యూస్‌టుడే, పత్తికొండ గ్రామీణం 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని