logo

భరతుని శాఖ.. భవితకు బాట

తుంగభద్ర, కృష్ణమ్మ పారుతున్న నేల.. ఖనిజాల ఖిల్లా.. సాగు ఆధారిత జిల్లా.. దండిగా వనరుల ప్రాంతం.. మానవ వనరులకు కొదవలేదు.. దీన్ని దృష్టిలో పెట్టుకొని జిల్లాలో పారిశ్రామికాభివృద్ధే లక్ష్యంగా గతంలో తెదేపా ప్రభుత్వం ఒ.ఎం.ఐ.హెచ్‌. ప్రాజెక్టును తెరపైకి తెచ్చింది.

Published : 15 Jun 2024 03:56 IST

టీజీకి పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ
- న్యూస్‌టుడే, కర్నూలు సచివాలయం

ఓర్వకల్లులో పారిశ్రామిక హబ్, విమానాశ్రయాన్ని గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి చొరవతో వచ్చినవే.. మళ్లీ అధికారంలోకి వచ్చాం.. పారిశ్రామికవాడను అభివృద్ధి చేస్తాం..  బీపీఆర్‌ రద్దు చేయడం.. రాయితీలు రాకఇవ్వకపోవడంతో వైకాపా హయాంలో పెట్టుబడిదారులు పరిశ్రమల స్థాపనకు ముందుకు రాలేదు..  

- టీజీ భరత్,  పరిశ్రమల శాఖ మంత్రి

తుంగభద్ర, కృష్ణమ్మ పారుతున్న నేల.. ఖనిజాల ఖిల్లా.. సాగు ఆధారిత జిల్లా.. దండిగా వనరుల ప్రాంతం.. మానవ వనరులకు కొదవలేదు.. దీన్ని దృష్టిలో పెట్టుకొని జిల్లాలో పారిశ్రామికాభివృద్ధే లక్ష్యంగా గతంలో తెదేపా ప్రభుత్వం ఒ.ఎం.ఐ.హెచ్‌. ప్రాజెక్టును తెరపైకి తెచ్చింది. హైదరాబాద్‌-బెంగళూరు జాతీయ రహదారికి ఆనుకుని ఈ హబ్‌ను అభివృద్ధి చేయాలని సంకల్పించింది. తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా దాన్ని వదిలేసింది.. తెదేపా హయాంలో పునాదులు వేసిన పారిశ్రామిక ప్రాంతాలను పక్కన పడేసింది. డెడ్‌రెంట్‌ పెంచి నాపరాయి పరిశ్రమలు మూతపడేలా చేసింది. వి‘పత్తి’లో ఆదుకోవడం మరిచారు.. ఒక్క కొత్త పరిశ్రమ తీసుకురాకపోగా.. ఉన్న వాటిని ధ్వంసం చేయడంతో ఉమ్మడి కర్నూలు జిల్లా ఓటర్లు వైకాపాకు గట్టి బుద్ధి చెప్పారు. 12 మంది కూటమి అభ్యర్థులకు పట్టం కట్టారు. ముఖ్యమంత్రిగా తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టారు.. కర్నూలు నగరం నుంచి మొదటిసారి గెలుపొందిన టీజీ భరత్‌కు పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ అప్పగించారు. స్వతహాగా పారిశ్రామికవేత్త అయిన ఆయనకు పరిశ్రమల శాఖ అప్పగించడంతో ఉమ్మడి కర్నూలు జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు అడుగులు పడే అవకాశం ఉంది.

‘ఓర్వకల్లు మెగా ఇండస్ట్రియల్‌ హబ్‌’ (ఓఎంఐహెచ్‌) ప్రాజెక్టుకు తెదేపా హయాంలో శ్రీకారం చుట్టారు. హైదరాబాద్‌-బెంగళూరు రహదారి వెంట 11 గ్రామాల పరిధిలో 10,900 ఎకరాలు సేకరించి ఏపీఐఐసీకి అప్పగించారు. ఓర్వకల్లు మెగా ఇండస్ట్రియల్‌ హబ్‌ను నోడ్‌ పాయింట్‌గా కేంద్రం 2020 ఆగస్టులో నోటిఫై చేశారు. గుట్టపాడులో సిగాచీ ఇండస్ట్రీస్, ఆర్‌పీఎస్‌ ఇండస్ట్రీస్‌తోపాటు మారుతి సుజుకి, మరో ఐదు ఫార్మా కంపెనీలు ఏపీఐఐసీలో దరఖాస్తు చేసుకున్నాయి. ప్రైమో పాలిప్యాక్‌ (ప్లాస్టిక్‌ ఇండస్ట్రీ), బ్లాక్‌హ్యాక్, ఎక్సైల్‌ ఇమ్యూన్‌ లాజిక్‌ ఇండియా ప్రై.లి. (వెటర్నరీ ఫార్మా) భారీ ఆక్సిజన్‌ తయారీ ప్లాంట్‌తోపాటు మరో 13 బడా కంపెనీలు ముందుకొచ్చాయి. తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా పట్టించుకోలేదు. 


ఓర్వకల్లు హబ్‌కు  తెదేపా హయాంలో అడుగులు

రిశ్రమల ఏర్పాటుకు మౌలిక సదుపాయాల కల్పన చాలా కీలకం. నీటి వసతితోపాటు విద్యుత్తు, అవసరమయ్యే గ్యాస్‌ సరఫరా, సీనరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్, వీధి దీపాల వ్యవస్థ, అంతర్గత రహదారుల నిర్మాణం తదితర పనులు వదిలేశారు. ‘ఓర్వకల్లు మెగా ఇండస్ట్రియల్‌ హబ్‌’ (ఓహెచ్‌ఎం)కు నీటి సదుపాయం కల్పించడంలో వైకాపా విఫలమైంది. ముచ్చుమర్రి నుంచి కృష్ణా జలాలు తరలించాల్సి ఉంది. ఇందుకోసం ఏకంగా 57 కి.మీ. మేర పైపులైను ఏర్పాటు చేయాలి. ఇన్‌టెక్‌ వెల్, పంపింగ్‌ స్టేషన్లు, సంపులను నిర్మించాలి. నిధులు విడుదల చేయకపోవడంతో పనులు పూర్తి కాలేదు. 

ర్వకల్లు మండలం గుట్టపాడులో నాటి తెదేపా ప్రభుత్వం ‘జైరాజ్‌ ఇస్పాత్‌’ ఉక్కు తయారీ పరిశ్రమకు 413.19 ఎకరాలు కేటాయించారు. రూ.2,938 కోట్లతో 2.2 మిలియన్‌ టన్నుల ఉక్కు తయారీ పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు సదరు సంస్థ పనులు ప్రారంభించింది. ఈ ఒక్క పరిశ్రమలోనే 3,200 మందికి ప్రత్యక్షంగా, 12 వేల మందికి పరోక్షంగా ఉపాధి కల్పించేలా ప్రణాళిక రూపొందించారు. ఉక్కు రంగ అభివృద్ధికి అవసరమైన ఫౌండ్రీస్, ఆక్సిజన్‌ ప్లాంట్లు, మెషిన్‌ షాప్స్, ఫోర్జింగ్, లాజిస్టిక్స్, కెమికల్‌ ల్యాబ్స్‌ ఏర్పాటయ్యే అవకాశం ఉంది. మరో 28 బేసిక్‌ మెటల్, ఎల్లాయిస్‌ పరిశ్రమలు పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపాయి. అవీ వస్తే సుమారు మరో 28 వేల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని నాటి తెదేపా ప్రభుత్వం అంచనా వేసింది. గత ఐదేళ్లలో వైకాపా పట్టించుకోకపోవడంతో పారిశ్రామికవాడ ప్రాంతం ‘ఖాళీ’గా దర్శనమిస్తోంది.


మేలు రకం ‘విత్తు’కోవాలి

న్యూస్‌టుడే, నందికొట్కూరు: ఆంధ్రప్రదేశ్‌ను అంతర్జాతీయ విత్తన కేంద్రంగా రూపొందించే లక్ష్యంతో తంగడంచలో 623 ఎకరాల్లో రూ.670 కోట్లతో మెగా సీడ్‌ పార్కు ఏర్పాటు చేయాలని గతంలో తెదేపా ప్రభుత్వం నిర్ణయించింది. 2017 అక్టోబరు 9న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశారు. విత్తన ఉత్పత్తి రంగానికి చెందిన పలు పరిశ్రమలూ ముందుకొచ్చాయి. అమెరికాలోని అయోవా విశ్వవిద్యాలయ సహకారంతో సీడ్‌ పార్కు ఏర్పాటు చేయాలని, రూ.670 కోట్ల మేర ఖర్చవుతుందని అప్పట్లో నిర్ణయించారు. 2018-19 బడ్జెట్‌లో రూ.100 కోట్లు కేటాయించారు. ముందుకొచ్చిన కంపెనీలకు పలు రాయితీలు ప్రకటించారు. మార్కెట్‌ రుసుముల నుంచి మినహాయింపుతోపాటు పేటెంట్‌ రిజిస్ట్రేషన్‌కు రాయితీలు ఇచ్చారు. అందుబాటులోకి వస్తే 40 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కే అవకాశం ఉంది. తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా వీటన్నిటినీ వైకాపా ప్రభుత్వం పక్కన పెట్టింది.


భారం పెంచారు.. బాధలు పెట్టారు 

న్యూస్‌టుడే, బనగానపల్లి: ఉమ్మడి కర్నూలు జిల్లాలో 1,150 హెక్టార్ల వరకు గనులు విస్తరించి ఉన్నాయి. ఆయా గనుల్లో 500 మంది లీజుదారులు గనుల్లో ముడిసరకును వెలికితీస్తున్నారు. వాటిని బేతంచెర్ల, అవుకు, రామాపురం ప్రాంతాల్లో పాలిష్‌ పరిశ్రమలకు తరలిస్తున్నారు.  వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత డెడ్‌రెంట్‌ పది రెట్లకు పెంచింది. అనుమతుల విషయంలో మార్పులు తీసుకొచ్చింది. విద్యుత్తు బిల్లు పెంచింది. గిట్టుబాటు కాక యజమానులు పరిశ్రమలను మూసేశారు.


వైకాపా వి‘పత్తి’ తెచ్చింది

న్యూస్‌టుడే, ఆదోని వ్యవసాయ మార్కెట్‌: ఆదోని పట్టణంలో 40 టీఎంసీ పత్తి యూనిట్లు ఉన్నాయి. మరో 15-20 జిన్నింగ్‌ పరిశ్రమలున్నాయి. వాటి నుంచి ప్రభుత్వానికి జీఎస్టీ రూపంలో రూ.150 కోట్లు, మార్కెట్‌ సెస్సు రూపంలో మరో రూ.20 కోట్లు, ఇతరాలు మొత్తం రూ.200 కోట్ల మేర ఆదాయం సమకూరుతుంది. పరిశ్రమలకు మాత్రం వైకాపా పాలనలో చేయూతనివ్వలేదు. కొవిడ్‌ కాలంలో మూడు నెలలు విద్యుత్తు బిల్లుల రీఎంబర్స్‌మెంట్‌ ఇస్తామని ప్రకటించినా చిల్లిగవ్వ ఇవ్వలేదు. విద్యుత్తు ఛార్జీలు 20 శాతం పెరిగాయి.   పరిశ్రమలు ఖాయిలా పడ్డాయి.


వీటిపై దృష్టి సారిస్తే

న్యూస్‌టుడే, ఎమ్మిగనూరు: చేనేతలకు చేయూతనందించాలన్న లక్ష్యంతో తెదేపా ప్రభుత్వ హయాంలో టెక్స్‌టైల్‌ పార్కు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 2015 మే 2న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎమ్మిగనూరులోని బనవాసి వద్ద శంకుస్థాపన చేశారు. అంతలోనే ప్రభుత్వం మారింది. అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం టెక్స్‌టైల్‌ పార్కును రద్దు చేసి ఇతర జిల్లాకు మళ్లించింది. దీన్ని అందుబాటులోకి తీసుకొస్తే వేలాది మందికి చేనేత కార్మికులకు లబ్ధి చేకూరుతుంది.


మ్మడి కర్నూలు జిల్లాలో టమాట, ఉల్లి సాగు 40వేల హెక్టార్లలో సాగవుతోంది. పంట చేతికొచ్చే సమయంలో ధర పడిపోతోంది. ఒక్కోసారి కిలో రూపాయి కూడా పలకడం లేదు.  రైతులను ఆదుకొనేందుకు టమాట జ్యూస్‌ పరిశ్రమ, ఉల్లి ప్రాసెసింగ్‌ కేంద్రాలు ఏర్పాటు కలగానే మిగిలింది.

- న్యూస్‌టుడే, పత్తికొండ 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని