logo

నాన్న మాట.. గెలుపు బాట

మనసుపై ప్రభావం చూపిస్తుందని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లు ప్రజాసేవలో తరించిన తండ్రిని చూసి స్ఫూర్తి పొందారు.. నాన్నను చూసి రాజకీయం నేర్చుకున్నారు..

Updated : 16 Jun 2024 05:43 IST

నేడు పితృదినోత్సవం

నాన్నతో ఉన్న తమ అనుబంధాన్నిపంచుకున్న మంత్రులు, ఎమ్మెల్యేలు

రాజకీయ కుటుంబంలో జన్మించారు.. ఆదర్శనీయ స్థానంలో ఉన్న తండ్రి ప్రవర్తన  పిల్లల మనసుపై ప్రభావం చూపిస్తుందని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లు ప్రజాసేవలో తరించిన తండ్రిని చూసి స్ఫూర్తి పొందారు.. నాన్నను చూసి రాజకీయం నేర్చుకున్నారు.. పల్లెకు వెళ్లారు ప్రజలకు దగ్గరయ్యారు.. ఎన్నికల రణక్షేత్రంలో దిగారు.. బిడ్డకు తండ్రే తొలి స్నేహితుడు.. చేయిపట్టి నడిపిస్తాడు.. వెన్నుతట్టి ధైర్యం చెబుతాడు.. కబుర్లతో నవ్విస్తారు.. కథలతో తీర్చిదిద్దుతాడు.. కష్టం రాకుండా కాపలా కాస్తాడు. నాన్న అనుభవాలు గెలుపు పాఠాలుగా స్వీకరించారు.. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సొంతం చేసుకున్నారు..అసెంబ్లీలో అడుగుపెట్టి అధ్యక్షా అనబోతున్నారు..! 


తండ్రి చిత్రపటానికి నివాళులు అర్పిస్తున్న అఖిలప్రియ

అండగా ఉన్నారు.. అన్నీ నేర్పించారు - భూమా అఖిలప్రియ, ఎమ్మెల్యే, ఆళ్లగడ్డ

భూమా నాగిరెడ్డి లాంటి నాన్న నాకుండటం అదృష్టం. నా జీవితంలో ప్రతి దశలోనూ నాన్నే కీలక పాత్ర పోషించారు. నా లోకమైన అమ్మ శోభానాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో చనిపోయినప్పుడు నాకు, కుటుంబానికి అండగా నాన్న నిలిచిన తీరు వర్ణించలేను. ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా నాన్న ఉన్నారనే భరోసా గొప్పది. 2014లో అమ్మ చనిపోవడంతో ఆళ్లగడ్డ అభివృద్ధి చెందాలని, ఆప్యాయతను పంచితే ఫ్యాక్షన్‌ ఉండదని భావించిన నాన్న ఎంతో దూరదృష్టితో నాకు రాజకీయ ఓనమాలు నేర్పించారు. రాజకీయంగా ఎలాంటి అనుభవం లేకున్నా నన్ను ప్రోత్సహించి ఎమ్మెల్యేగా బరిలో నిలిపారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత తన చేతులతో నా చెయ్యిని పట్టుకొని ప్రజాస్వామ్య దేవాలయమైన అసెంబ్లీలోకి నడిపించి తీసుకెళ్లిన క్షణాలు మరిచిపోలేను. మహామహులున్న శాసన సభలో ఎవరితో ఎలా వ్యవహరించాలో, ఎలా గౌరవంగా మెలగాలో నాన్న చెప్పేవారు. మనల్ని నమ్మినవారి కోసం ఎన్ని కష్టాలు ఎదురైనా వెనుకడుగు వేయొద్దని నేర్పారు. విషయ పరిజ్ఞానం, అనర్గళంగా మాట్లాడటం, రాజకీయాల్లో చురుకుదనం, నమ్మిన కార్యకర్తలకు అండగా ఉంటూ పోరాడే తీరు...అన్నీ నేర్పించారు.ఆడపిల్లలు మగపిల్లలతో సమానంగా ఉండాలని, స్వతహాగా నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేవారు. నిర్ణయాలు తీసుకోవడంలో ఆయన ఇచ్చిన స్వేచ్ఛ ఇప్పుడు ఎంతో ఉపయోగపడుతోంది. ఆయన చనిపోయే రెండు రోజుల ముందు కుటుంబ సభ్యుల్ని, ముఖ్యంగా నమ్మిన కార్యకర్తలను జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పారు. ఆయన ఇచ్చిన స్ఫూర్తితోనే ముందుకెళ్తున్నా. నాన్నే నాకు గురువు, స్నేహితుడు, మార్గదర్శి, నా సర్వస్వం.


పేదలకు సేవ చేయాలనేవారు
- బీసీ జనార్దన్‌రెడ్డి రోడ్లు, భవనాల శాఖ మంత్రి 

నాన్న బీసీ గుర్రెడ్డిని చూసే ప్రజాసేవ చేయాలని నిర్ణయించుకున్నా. లేదనకుండా నాన్న ప్రతి ఒక్కరికి సాయం చేసేవారు. సంపాదించిన దాంట్లో కొంతైనా పేదలకు ఇవ్వాలని ఆయన నుంచే నేర్చుకున్నా. మాది వ్యవసాయ కుటుంబం. యాభై ఏళ్ల కిందట నాన్న సొంత గ్రామమైన యనకండ్ల సర్పంచిగా పని చేశారు. ఆ రోజుల్లో నాన్న సాయాన్ని చాలా మంది కోరేవారు. ఫ్యాక్షన్‌ గొడవలకు దూరంగా ఉండాలనే కుటుంబమంతా బనగానపల్లి వచ్చాం. రైతులు, పేదల కష్టాలు చిన్నతనం నుంచి చూస్తుండటంతో వారికి అండగా ఉండటం నాన్న నుంచి నేర్చుకున్నా. చిన్నతనం నుంచి రైతు కుటుంబం కావడంతో నాన్న పడ్డ కష్టాలు దగ్గరుండి చూశా. రాత్రివేళల్లో విద్యుత్తు లైటు తీసుకొని అమ్మ లక్ష్మమ్మకు తోడుగా తోటల్లో తిరిగేవాడిని. రైతుల కష్టాలను ప్రత్యక్షంగా చూశా. ఉన్నదాంట్లో సేవా కార్యక్రమాలు చేస్తున్నానంటే నాన్నే స్ఫూర్తి. నా భార్య ఇందిరమ్మ, నా పిల్లలకు కూడా ఇదే చెబుతున్నా. ఉన్నంతలో ఎదుటివారికి సాయం చేయాలనే చెప్పి వారిని ప్రోత్సహిస్తున్నా. భార్య ఇందిరమ్మ సహకారం, నాన్న అందించిన స్ఫూర్తి, సోదరుడు బీసీ రాజారెడ్డి సేవా కార్యక్రమాలు నేను రాజకీయంగా ఎదిగేందుకు దోహదపడ్డాయి. నాన్న చనిపోయాక అన్న బీసీ బాలతిమ్మారెడ్డి, మరో తమ్ముడు రామనాథరెడ్డి ఎంతో ప్రోత్సహించారు. ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానన్నా...ప్రజలకు సేవ చేయగలుగుతున్నాననంటే నాన్న అందించిన ప్రోత్సాహమే.


వ్యాపార పాఠాలు.. రాజకీయ ఓనమాలు 
- టీజీ భరత్, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి  

టీజీ వెంకటేశ్‌తో మంత్రి టీజీ భరత్‌ 

నేను పారిశ్రామికవేత్తగా.. రాజకీయాల్లో రాణిస్తున్నానంటే నాన్న టీజీ వెంకటేశ్‌ కారణం.. ఆయనే నాకు గురువు. ఆయన ప్రోత్సాహంతోనే రెండు రంగాల్లో రాణిస్తున్నా. ఆయన నుంచే పట్టుదల, క్రమశిక్షణ.. ఏదైనా సాధించాలనే తపన, సమయపాలన అన్నీ నేర్చుకున్నా.. ఆయన 1999లో కర్నూలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పట్లో మనకెందుకులే రాజకీయాలు అనుకున్నా. 2009లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిగా పని చేశారు. ఆ సమయంలో నా తండ్రి ప్రోత్సాహంతోనే 2010లో యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షునిగా నేను రాజకీయాల్లోకి వచ్చా. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో నాన్న ఓటమి పాలయ్యారు. 2016-22 మధ్య కాలంలో టీజీ వెంకటేశ్‌ రాజ్యసభ సభ్యునిగా పని చేశారు. ఆయన ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేసిన కాలంలో కర్నూలు నగరాభివృద్ధికి కష్టపడే మనస్తత్వం చూసి చలించిపోయా. ఆయన చేయలేకపోయిన అభివృద్ధి పనులు నేను చేసి ప్రజల రుణం తీర్చుకోవాలనుకున్నా..  ఆయన స్ఫూర్తితోనే ఎలాగైనా నేను రాజకీయాల్లో రాణించాలనే తపనతో ముందడుగు వేశా. నేను పుట్టి పెరిగిన కర్నూలు అభివృద్ధికి నా తండ్రి కంటే మెరుగైన అభివృద్ధి చేసి చూపాలనుకున్నా. 2019 ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చా. ఈ ఎన్నికల్లో గెలవడానికి ఆయన సలహాలు, సూచనలతో ముందుకెళ్లాను. నేను ఈ స్థాయికి చేరుకోవడానికి తాను అందించిన స్ఫూర్తే కారణం. తండ్రిగానే కాకుండా ఓ గురువుగా, స్నేహితునిగా నా వెనుక ఉండి నడిపిస్తున్న నాన్నకు ఫాదర్స్‌ డే శుభకాంక్షలు.
- న్యూస్‌టుడే, కర్నూలు సచివాలయం


‘కోట్ల’ విలువలు నేర్చుకున్నా
- కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి, ఎమ్మెల్యే, డోన్‌

బ్రిటిష్‌ కాలం నుంచే తాతయ్య రాజకీయాల్లో ఉండేవారు.. నీతి.. నిజాయతీ.. విలువలతో కూడిన రాజకీయాన్ని నాన్న కోట్ల విజయభాస్కర్‌రెడ్డి నుంచి నేర్చుకున్నా.. డబ్బు కంటే నీతితో ముందుకు వెళ్లగలిగినప్పుడే ఎక్కువ మంది అభిమానాన్ని పొందొచ్చని చెప్పేవారు.. ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయి.. విజయభాస్కర్‌రెడ్డి, శ్యామలమ్మల కుమారుడిగా పుట్టినందుకు ఎంతో గర్వంగా ఉంది. నాన్న రెండుసార్లు ముఖ్యమంత్రిగా పని చేసినా రూ.కోట్ల ఆస్తుల్ని సంపాదించలేదు. నేను ఎంపీగా, కేంద్ర మంత్రిగా, ఎమ్మెల్యేగా ఉన్నానంటే నీతి, నిజాయతీ విలువలే కారణం. నాన్న అనుసరించి రాజకీయాలపరంగా చాలా విషయాలు తెలుసుకున్నా.. వాటినే అవలంబిస్తున్నా. డబ్బుతో దేన్నయినా కొనొచ్చుగానీ ప్రజల అభిమానాన్ని కొనలేమనే నాన్న చెప్పిన పాఠాన్ని ఎప్పటికీ మరవను. నా పిల్లలకూ ఇదే చెబుతాను. నమ్మిన ప్రజలకు అండగా ఉన్నందునే ఈ రోజు అంతా కలిసి గెలిపించారు. నాన్న నేర్పిన బాటలోనే నడుస్తున్నందునే ఎక్కువ మంది అభిమానుల్ని సంపాదించుకున్నా. 
- డోన్, న్యూస్‌టుడే


నమ్మిన వారికి అండగా ఉండాలనేవారు 
- బుడ్డా రాజశేఖర్‌ రెడ్డి, ఎమ్మెల్యే, శ్రీశైలం

బుడ్డా వెంగళరెడ్డి, ఓబులమ్మ దంపతుల బిడ్డనైనందుకు గర్వపడుతున్నా. నాన్న బుడ్డా వెంగళరెడ్డి 1982-83లో తెదేపాలో చేరి పలు పదవులు అలంకరించారు. 1999లో ఆయన చనిపోయాక నేను రాజకీయాల్లోకి వచ్చా. ప్రజా సేవకు నాన్న అధిక ప్రాధాన్యమివ్వడాన్ని గుర్తించా. సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకోవడాన్ని ఆయన నుంచే నేర్చుకున్నా. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండేవారు. కుటుంబ విలువలకు ప్రాధాన్యమిచ్చేవారు. పది మందికి మనం ఉపయోగపడాలని పదే పదే చెబుతుండేవారు. మనల్ని నమ్మేవారికి ఎప్పుడూ అండగా ఉండాలని నాన్న చెప్పిన మాటలే నాకు శిరోధార్యం.
- ఆత్మకూరు, న్యూస్‌టుడే 


ఎమ్మిగనూరును వదిలి వెళ్లొద్దన్నారు
- బీవీ జయనాగేశ్వరరెడ్డి, ఎమ్మెల్యే, ఎమ్మిగనూరు  

నాన్న బీవీ మోహన్‌రెడ్డిని స్ఫూర్తిగా తీసుకుని రాజకీయాల్లోకి వచ్చా. ఎన్టీఆర్‌కు ప్రియ శిష్యుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉండేది. ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నాన్నతో నేనూ నేరుగా వాళ్ల ఇంట్లోకి వెళ్లేవాణ్ని. ఎన్టీఆర్, చంద్రబాబు కుటుంబాలతో అనుబంధం ఉండేది. నాకు వైద్యుడిగా రాణించాలని ఉండేది. వైద్య విద్య చదువుతున్నప్పుడు 2012లో నాన్న అనారోగ్యానికి గురవడంతో రాజకీయాల్లోకి వచ్చా. ఓ వైపు నాన్న ఆరోగ్యం క్షీణించడం, మరోవైపు తెలిసీ తెలియని వయస్సులో రాజకీయాల్లోకి రావడం నాకు పెద్ద సవాలుగా మారింది. ఉప ఎన్నికల తర్వాత 2012 జులై 27న నాన్న చనిపోయే ముందు ఎమ్మిగనూరు కన్నతల్లిలాంటి ఊరు, వదిలి వెళ్లొద్దు బుజ్జి అని ఆయన నా నుంచి మాట తీసుకున్నారు. నాన్న మాటతో వైద్యవిద్యను వదిలి ప్రజాక్షేత్రంలోకి వచ్చా. ప్రజలే మనకు ఆస్తి అని, వారికి సేవ చేయడంలోనే సంతృప్తి ఉంటుందని నాన్న మాటల్ని శిరోధార్యంగా భావించి ముందుకెళ్తున్నా.  
-న్యూస్‌టుడే, ఎమ్మిగనూరు


గెలుపు పాఠాలు నేర్పారు
- కేఈ శ్యాంబాబు, పత్తికొండ ఎమ్మెల్యే 

నాన్న ఎంతో ఉన్నతుడు. కేఈ కృష్ణమూర్తి కుమారుడినైనందుకు గర్వపడతా. నా సర్వస్వం నాన్నే. నాపై చూపిన ప్రేమ, ఆప్యాయతల వల్లే ఈ స్థాయికి చేరగలిగా. రాజకీయ వారసుడిని కావాలని నాన్న ప్రోత్సహిస్తే.. అమ్మ పద్మావతమ్మ ఎంతో ధైర్యాన్ని నింపారు. నాన్న ఆరుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించడానికి కారణం ఆయన ప్రజలతో మమేకమవ్వడమే. ఆయన నుంచి ఇదే నేర్చుకున్నా. తొలిసారి నేను ఓడిపోయినా అండగా నిలిచారు. విజయం సాధించేలా ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేశారు. ఓటమి పాలైనప్పుడు దిగులు చెందకుండా విజయాలకు మార్గం ఎలా వేయొచ్చుననే ఆయన చెప్పిన మాటలు నాలో ఉత్సాహాన్ని నింపాయి. జీవితంలో ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా తట్టుకుని ముందుకు వెళ్లాలలనే నాన్న చెప్పిన ప్రకారం నడుచుకుంటున్నా. నిత్యం తోడుగా ఉంటూ.. నా విజయంలో కీలకంగా పని చేసిన వారి రుణం తీర్చుకుంటూనే నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తా.  
-మద్దికెర, న్యూస్‌టుడే

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని