logo

‘కొలువు’ నిలవాలని ఖాకీల కాక

అవకాశం వస్తే రెచ్చిపోవడం, లేదంటే కాళ్ల బేరానికి రావడం పోలీస్‌ శాఖలో కొందరు అధికారులకు అలవాటుగా మారింది.

Updated : 16 Jun 2024 05:41 IST

ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్న పోలీస్‌ అధికారులు 

కర్నూలు నేరవిభాగం, నంద్యాల నేరవిభాగం, న్యూస్‌టుడే: అవకాశం వస్తే రెచ్చిపోవడం, లేదంటే కాళ్ల బేరానికి రావడం పోలీస్‌ శాఖలో కొందరు అధికారులకు అలవాటుగా మారింది. తెదేపా ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఉమ్మడి కర్నూలు జిల్లాలో కొందరు సీఐ, ఎస్సైలు తెదేపా నేతలను కాకపట్టడం మొదలుపెట్టారు. ఉమ్మడి జిల్లాలో 8 సబ్‌ డివిజన్లు, 86 పోలీస్‌స్టేషన్లున్నాయి. గత ఐదేళ్లు వైకాపా నేతలకు విధేయులుగా,  కండువా లేని కార్యకర్తల్లా పని చేసిన కొందరు అధికారులు ఇప్పుడు తెదేపా నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. వైకాపా తమ కుటుంబ పార్టీగా భావించి అక్రమార్జనతో అధికార దుర్వినియోగానికి పాల్పడిన ఓ సామాజిక వర్గానికి చెందిన పోలీస్‌ అధికారులు ఊసరవెల్లుల్లా మారారు. స్వరం మార్చి కొలువుల కోసం తెదేపా ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పాణ్యం నియోజకవర్గం పరిధిలోని రెండు స్టేషన్లలో పని చేసి వైకాపాకు విధేయుడిగా, ప్రజాప్రతినిధికి ముఖ్య సలహాదారునిగా వ్యవహరించిన ఓ సీఐ ఎన్నికల సమయంలో లూప్‌లైన్‌లో ఉండి చక్రం తిప్పారు. వైకాపాకు అనుకూలంగా పని చేసిన సదరు సీఐ ప్రస్తుతం కోడుమూరు, బనగానపల్లి నియోజకవర్గాల్లో కొలువు దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. కర్నూలులో పని చేస్తున్న ఓ సీఐ తనకు మరో ఏడాది అవకాశం ఇవ్వాలని తెదేపా నేతలను కోరుతూ వేర్వేరు పోలీస్‌స్టేషన్లలో కొలువుకు ప్రయత్నిస్తున్నారు. కర్నూలు నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్‌ కోసం ఏకంగా ఆరుగురికిపైగా సీఐలు పోటీ పడుతున్నారు. వైఎస్సార్‌ జిల్లా బందోబస్తుకు వెళ్లి ప్రతిసారీ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సమాధి వద్ద సెల్ఫీ దిగి సామాజిక మాధ్యమాల్లో ఉంచి ప్రచారం చేసుకున్న ఓ మహిళా అధికారిణి సైతం పాణ్యం నియోజకవర్గంలో కొలువుకు ప్రయత్నిస్తున్నారు. వైకాపాకు వ్యతిరేకంగా పని చేశాడని ముద్ర వేయించుకున్న ఓ సీఐ తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. అత్యధిక ఆదాయం ఉండే బేతంచెర్ల పోలీస్‌స్టేషన్‌కు పోటీ పడేవారి సంఖ్య అధికంగా ఉంది. గతంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో పని చేసి ప్రస్తుతం వైఎస్సార్‌ జిల్లాలో పని చేస్తున్న ఓ పోలీసు అధికారి నందికొట్కూరు నియోజకవర్గానికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. నంద్యాల డీఎస్పీ స్థానం కోసం పలువురు పోలీసు అధికారులు తెదేపా నేతను కలిసి అవకాశం ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. 

దిక్కు తోచని స్థితిలో వైకాపా విధేయులు 

వైకాపా ప్రభుత్వ హయాంలో అత్యుత్సాహం ప్రదర్శించి, పార్టీ వ్యక్తులుగా ముద్ర వేయించుకున్న సీఐ, ఎస్సైలకు దిక్కు తోచని పరిస్థితి నెలకొంది. ప్రధానంగా ఓ సామాజిక వర్గానికి చెందిన పోలీసు అధికారులు భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారు. అక్రమాస్తులను గుర్తించి అవినీతి నిరోధక శాఖలో కేసులు నమోదు చేస్తారేమోనన్న భయం పట్టుకుంది. స్థిరాస్తి వ్యాపారం చేసే పోలీస్‌ అధికారులు తెలివిగా వారి వారి సామాజిక వర్గానికి చెందిన తెదేపా నాయకులు, పొరుగు జిల్లాలో ఉండే తెదేపా ప్రజాప్రతినిధులను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మంత్రికి అనుకూలంగా వ్యవహరించి పోలీసు అధికారులు చిక్కుల్లో పడిన భావనలో ఉన్నారు. డోన్‌ నియోజకవర్గంలో పని చేసిన ఇద్దరు పోలీసు అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటున్నారు. తెదేపా నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్‌పై రౌడీషీట్‌ తెరిచే విషయంలో క్రియాశీలకంగా వ్యవహరించిన పోలీసు అధికారి జిల్లా మారే ప్రయత్నం చేస్తున్నారు. అక్రమ కేసులు బనాయించి, ఎన్నికల సమయంలో తెదేపా నేతలకు ప్రచారానికి అనుమతి ఇవ్వని కర్నూలులో పని చేస్తున్న ఓ పోలీసు అధికారి జిల్లా మారేందుకు మానసికంగా సిద్ధపడ్డారు. నిష్పక్షపాతంగా వ్యవహరించిన పోలీసు అధికారులు మాత్రమే ప్రశాంతంగా ఉన్నారు. కేబినెట్‌ సమావేశం తర్వాత పోలీస్‌ శాఖలో భారీ ప్రక్షాళన ఉండే పరిణామాలు కనిపిస్తున్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని