logo

దశల వారీగా నగరాభివృద్ధి

కర్నూలు నగరంలో మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి.. ప్రజలకు శుద్ధజలాన్ని అందించాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖల మంత్రి టీజీ భరత్‌ అధికారులను ఆదేశించారు.

Updated : 16 Jun 2024 05:39 IST

మంచినీటి ఎద్దడికి శాశ్వత పరిష్కారం

మంత్రి టీజీ భరత్‌

మాట్లాడుతున్న మంత్రి టీజీ భరత్‌ 
కర్నూలు నగర పాలక సంస్థ, న్యూస్‌టుడే: కర్నూలు నగరంలో మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి.. ప్రజలకు శుద్ధజలాన్ని అందించాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖల మంత్రి టీజీ భరత్‌ అధికారులను ఆదేశించారు. నగర పాలక నూతన కౌన్సిల్‌ హాల్‌లో శనివారం ఆయన నగర పాలక అధికారులు, సిబ్బందితో సమీక్షించారు. నగర పాలకలో చేపట్టిన అభివృద్ధి, పెండింగ్‌ పనులు, కొత్తగా ప్రతిపాదించిన పనులు, విభాగాల వారీగా వివిధ అంశాలు, నగర పాలక ఆదాయం, వ్యయం తదితర వాటిని కమిషనర్‌ భార్గవ్‌తేజ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. అనంతరం టీజీ భరత్‌ మాట్లాడుతూ.. నగరంలో మంచినీరు బురదగా వస్తున్నాయి.. నీటి శుద్ధి చేసి ప్రజలకు అందించాలని ఆదేశించారు. నీటి సరఫరా విషయంలో తప్పకుండా సమయపాలన పాటించాలన్నారు. నీటి వృథాను కూడా అరికట్టే బాధ్యత అధికారులు తీసుకోవాలన్నారు. నగరంలో దోమల బెడద తీవ్రంగా ఉందన్నారు. నగరంలో దోమల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. తమ పరిశ్రమ నుంచి హైపో ద్రావణాన్ని ఉచితంగా అందిస్తాం.. పిచికారీకి చర్యలు తీసుకోవాలన్నారు. నదీ పరివాహక ప్రాంతాలైన బుధవారపేట, పాత నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయన్నారు. నదుల్లో పేరుకుపోయిన బురద తొలగించాలన్నారు. అమృత్‌ 2.0 కింద నగరానికి శాశ్వత నీటి పరిష్కారానికి ఏ ప్రాజెక్టు ద్వారా నీటిని సమగ్రంగా అందిస్తామో పరిశీలించి ప్రణాళికలను సిద్ధం చేయాలన్నారు.

నగరంలో చిరువ్యాపారులకు ప్రత్యామ్నాయ ప్రదేశాలు చూపించిన తర్వాత వాటిని ఖాళీ చేయించాలన్నారు. ఆ తర్వాత రోడ్లపై వ్యాపారం చేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రహదారి విస్తరణకు చర్యలు తీసుకోవాలన్నారు. విస్తరణ చేసే క్రమంలో అధికారులు ప్రజలతో మాట్లాడాలని తెలిపారు. వారికి అర్థమయ్యే రీతిలో వివరించి పరస్పర ఒప్పందాలు కుదుర్చుకుంటే రహదారి విస్తరణ తేలికగా సాధ్యమవుతుందన్నారు. గతంలో రింగ్‌ రోడ్డుకు సంబంధించి సెయింట్‌ జోసఫ్‌ కళాశాల నుంచి పాతనగరంలో ముగించేలా కార్యాచరణ రూపొందించామన్నారు. అయితే సాయిబాబా గుడి వరకు వచ్చి పనులు నిలిచిపోయాయన్నారు. పనులు పూర్తయితే కొంతమేర ట్రాఫిక్‌ సమస్య తగ్గుతుందన్నారు. ట్రాఫిక్‌ను నియంత్రించడానికి అవసరమైన ప్రత్యామ్నయ మార్గాలతోపాటు పైవంతెలను నిర్మించడం వల్ల ట్రాఫిక్‌ సమస్య తగ్గే అవకాశం ఉందన్నారు. పట్టణ నిరాశ్రయుల వసతి గృహాల్లో సౌకర్యాలు కల్పించాలన్నారు.

టిడ్కో గృహాలు అర్హులైన వారికి అందేలా చూడాలన్నారు. హంద్రీనదిలో వ్యర్థాలు డంప్‌ చేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నగరంలోని సామూహిక మరుగుదొడ్ల నిర్వహణ బాగుండేలా చూడాలన్నారు. నగరంలో మొక్కలు నాటాలని ఆదేశించారు. మొక్కలు నాటడంతోపాటు వాటిని సంరక్షణ బాధ్యత కూడా అధికారులదేనన్నారు. బక్రీద్‌ పండగ సందర్భంగా ఈద్గాలను పరిశుభ్రం చేయాలని, పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలన్నారు. నగరాన్ని స్మార్ట్‌ సిటీగా తీర్చిదిద్దేందుకు అవసరమైన దిశగా చర్యలు తీసుకోవాలన్నారు.  తుంగభద్ర పుష్కరాల్లో పైపుల కొనుగోలు, పైపులు అగ్ని ప్రమాదంలో కాలిపోవడంపై చేపట్టిన విచారణ ఎంత వరకు వచ్చిందో త్వరలో తెలపాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్‌ రామలింగేశ్వర్, ఆయా విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని