logo

హంద్రీ అభివృద్ధికి పడాలి అడుగులు

 హంద్రీనీవాతోనే రాయలసీమ ప్రాంతం అభివృద్ధి సాధ్యమని గత ప్రభుత్వాలు భావించి దీన్ని నిర్మించడంతో పాటు, పలు అభివృద్ధి పనులు చేపట్టాయి.

Published : 16 Jun 2024 02:23 IST

నిర్వహణ మరచిన వైకాపా

ప్రమాదకర స్థితిలో కాలువలు 

మద్దికెర వద్ద విస్తరణకు నోచుకోని హంద్రీనీవా కాలువ  

 హంద్రీనీవాతోనే రాయలసీమ ప్రాంతం అభివృద్ధి సాధ్యమని గత ప్రభుత్వాలు భావించి దీన్ని నిర్మించడంతో పాటు, పలు అభివృద్ధి పనులు చేపట్టాయి. 2006లో పనులు ప్రారంభమై 2009లో పూర్తి చేశారు. కాలువకు తెదేపా హయాంలో మరింత అదనంగా నీటిని అందించి అనంతపురం, కడప చిత్తూరు, జిల్లాల వరకు తీసుకెళ్లేందుకు కాలువ విస్తరణ పనులు చేపట్టారు. వైకాపా ప్రభుత్వం కొలువుదీరాక ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కాలువ అభివృద్ధికి గాని, నిర్వహణకు గాని పైసా కూడా వెచ్చించకపోవడతో కాలువ ప్రాంతం భయానకంగా మారింది. ముళ్లపొదలు పెరిగిపోయి ప్రమాదంగా మారింది. 
- న్యూస్‌టుడే, పత్తికొండ, మద్దికెర


87వేల ఎకరాలు లక్ష్యం 

పత్తికొండ, ఆలూరు, డోన్‌ నియోజకవర్గాల పరిధిలో 87 వేల ఎకరాలకు హంద్రీనీవా కాలువ ద్వారా సాగునీరు అందించాల్సి ఉంది. పత్తికొండ, డోన్‌ నియోజకవర్గాల పరిధిలో పంట కాలువల నిర్మాణం చేపట్టకపోవడంతో  అధికారికంగా ఒక్క ఎకరానికి కూడా నీరందని పరిస్థితి. ఆలూరు నియోజకవర్గంలోని దేవనకొండ మండలంలో కొన్ని గ్రామాల పరిధిలోనే పంట కాలువలు నిర్మించారు. మిలిగిన ప్రాంతంలో ఎలాంటి పనులు చేపట్టలేదు. 

ముళ్లపొదలతో నిండి.. 

జిల్లాలోని నందికొట్కూరు నియోజకవర్గం మల్యాల నుంచి పత్తికొండ నియోజకవర్గం మద్దికెర వరకు హంద్రీనీవా కాలువ విస్తరించి ఉంది. వైకాపా ప్రభుత్వ హయాంలో కాలువ నిర్వహణ పనులకు సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టలేదు. కాలువకు ఇరువైపులా, కాల్వ గట్లకు ముళ్లపొదలు, పిచ్చి మొక్కలు పెరిగిపోయి ప్రమాదకరంగా మారాయి. అంతే కాకుండా నీటి ప్రవాహానికి ఇవి ఆటంకంగా మారాయి. కాలువను పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేసిన సర్వీర్‌ రోడ్డుకు ఇరువైపులా పూర్తిగా ముళ్లపొదలు పెరిగిపోయి వాహనాలు వెళ్లలేని దుస్థితి. దీంతో అధికారులు అత్యవసరమైతే తప్ప ఈ దారి వెంట రావడం లేదు. 

ఎక్కడి పనులు అక్కడే.. 

తెదేపా హయాంలో చేపట్టిన హంద్రీనీవా కాలువ వెడల్పు పనులు ప్రభుత్వం మారడంతో ఆ పనులను పూర్తిగా నిలిపివేశారు. దీంతో కొన్ని చోట్ల మాత్రమే ఈ పనులు చేపట్టినా.. పూర్తిస్థాయిలో చేయలేదు. దీంతో కాలువకు అధికంగా నీరు వదిలితే గట్టుదాటి పొలాల్లోకి వెళ్లే పరిస్థితి. ఓ చోట వెడల్పు, మరో చోట ఇరుకుగా ఉండటం వల్ల నీరు పారేందుకు ఇబ్బందిగా మారండంతో కొన్ని చోట్ల గట్లు తెగి నీరు పొలాల్లోకి వెళ్తోందని ఈ ప్రాంత రైతులు ఆరోపిస్తున్నారు. దీనికి తోడు అధిక వర్షాలు తోడైతే పొలాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని ప్రజలు ఆరోపిస్తున్నారు.


ప్రతిపాదనలు పంపాం
- హరిప్రసాద్,  ఏఈ, హంద్రీనీవా

హంద్రీనీవా కాలువలో, గట్ల వెంట పెరిగిన ముళ్ల పొదల తొలగింపునకు ప్రతిపాదనలు పంపాం. ఈ మేరకు కాలువ పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిస్తాం. అవసరమైన చర్యలు తీసుకుంటాం. భూగర్భ కాలువల్లో పేరుకు పోయిన వ్యర్థాల తొలగింపు చేపడతాం.


  • జిల్లాలో హంద్రీనీవా పొడవు : 134 కి.మీ. 
  • పరిశీలించిన ప్రాంతం : మద్దికెర నుంచి పత్తికొండ వరకు 30 కి.మీ. 
  •  నిర్వహణ: ఐదేళ్లుగా ఎలాంటి నిర్వహణ లేదు 
  •  విస్తరణ: పనుల ఊసే లేదు 
  •  అభివృద్ధి: వైకాపా ప్రభుత్వ హయాంలో హంద్రీనీవా కాలువ నిర్వహణకు ఎలాంటి నిధులు కేటాయించక పోవడంతో అభివృద్ధి నిలిపిపోయింది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని