logo

కుప్పకూలిన కేసీ కాల్వ గోడ

నందికొట్కూరు మండలం శాతనకోట గ్రామ సమీపంలో 72వ గేటు వద్ద కేసీ కాల్వ పక్క గోడ శనివారం కుప్పకూలింది.

Published : 16 Jun 2024 02:36 IST

 కుప్పకూలిన కేసీ కాల్వ పక్క గోడ 

నందికొట్కూరు, న్యూస్‌టుడే : నందికొట్కూరు మండలం శాతనకోట గ్రామ సమీపంలో 72వ గేటు వద్ద కేసీ కాల్వ పక్క గోడ శనివారం కుప్పకూలింది. ఈ ప్రాంతంలో కాల్వ కట్ట, గోడ దెబ్బతిన్నాయి. వర్షాల కారణంగా కాల్వలో నీరు చేరడంతో మట్టి జారిపోయి గోడ కాల్వలో పడిపోయింది. ఇక్కడ కాల్వ కట్ట దెబ్బతిన్న విషయమై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదని రైతులు విమర్శిస్తున్నారు. సకాలంలో మరమ్మతులు చేయించకపోవడంతో వర్షం నీటి నిల్వకే గోడ కూలిపోయింది. సుంకేసుల జలాశయం నుంచి నీటిని విడుదల చేస్తే కట్ట కొట్టుకుపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మరమ్మతులు చేయించకపోతే కేసీ కింద సాగు ప్రశ్నార్థకం అవుతుందంటున్నారు.

కేసీ కాల్వ 0 నుంచి 120 కి.మీ వరకు కర్నూలు, నందికొట్కూరు నియోజకవర్గాల్లో విస్తరించి ఉంది. దీని కింద సుమారు 1.20 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. కాల్వ దెబ్బతిన్న ప్రాంతం నుంచి 120 కి.మీ వరకు సుమారు 50 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. తెదేపా ప్రభుత్వంలో కేసీకి నీరు పుష్కలంగా వస్తుందన్న నమ్మకంతో అన్నదాతలు వరి సాగుకు పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ సమయంలో కాల్వ గోడ దెబ్బతినడంతో సాగునీరు అందుతుందో లేదోనని రైతులు కలవరం చెందుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి సాగునీటి సమస్యలు తలెత్తకుండా కాల్వకు మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని