logo

ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తాం

ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా బనగానపల్లికి వచ్చిన ఆయనకు జనం బ్రహ్మరథంపట్టారు.

Published : 16 Jun 2024 02:39 IST

మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి

మాట్లాడుతున్న మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి 

బనగానపల్లి, న్యూస్‌టుడే: ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా బనగానపల్లికి వచ్చిన ఆయనకు జనం బ్రహ్మరథంపట్టారు. అడుగడుగునా పూలవర్షం కురిపించి అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బనగానపల్లి పట్టణంలో ఇళ్లు లేని ప్రతి పేదకు రెండు సెంట్ల స్థలం ఇస్తాం.. నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం.. అధికారంలో లేనప్పుడు తనను కార్యకర్తలు ఎంతో ప్రేమగా చూసుకున్నారు.. వారి రుణం తీర్చుకుంటానన్నారు. తనను ఆదరించిన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం బీసీ ఇందిరమ్మ మాట్లాడుతూ బనగానపల్లి పట్టణంలో ఎంతో మంది పేదలు ఉన్నారని, వారికి అండగా ఉంటామన్నారు. స్థలం ఇచ్చిన మాటను నిలుపుకొంటామన్నారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామన్నారు. 

జనసంద్రమైన బనగానపల్లి

మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి బనగానపల్లికి సాయంత్రం 4 గంటలకు వస్తారని తెలుసుకున్న ప్రజలు, కార్యకర్తలు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున చేరుకున్నారు. రాత్రి 8.45 గంటలకు వచ్చినా ఓపిగ్గా ఎదురుచూశారు. ఓర్వకల్లు విమానాశ్రయం నుంచి బేతెంచెర్ల, గోర్లగుట్ట, గోవిందిన్నె, పులకూరు క్రాస్‌ రోడ్డు, హుసేనాపురం, మీదుగా ఆయన సొంత గ్రామం యనకండ్ల, బత్తులూరుపాడు నుంచి బనగానపల్లికి వచ్చారు. ఆయా గ్రామాల్లో ప్రజలు మంత్రికి గజమాలలతో సత్కరించారు. అవుకు, బనగానపల్లి, కొలిమిగుండ్ల, సంజామల, కోవెలకుంట్ల మండలాల నుంచి భారీ సంఖ్యలో కార్యకర్తలు తరలి వచ్చారు. పెట్రోలు బంకు కూడలి జనసంద్రంగా మారింది. పెట్రోలు బంకుకూడలి నుంచి ఆస్థానం రోడ్డులో బీసీ ఇంటికి చేరుకున్నారు. తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాటసాని చంద్రశేఖరరెడ్డి, కాట్రెడ్డి మల్లికార్జునరెడ్డి, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. 

బేతంచెర్లలోనూ అపూర్వస్వాగతం

బేతంచెర్ల, న్యూస్‌టుడే: బేతంచెర్ల పట్టణంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డికి అపూర్వ స్వాగతం లభించింది. డోన్‌ తెదేపా నాయకులు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ధర్మవరం సుబ్బారెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి షేక్షావలి చౌదరి ఆధ్వర్యంలో భారీ స్వాగత ఏర్పాట్లు చేశారు. నంద్యాల క్రాస్‌ రోడ్డు నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పాత బస్టాండులో క్రేన్‌ సాయంతో మంత్రి బీసీకి గజమాల వేసి అభినందించారు. పెద్దఎత్తున తరలివచ్చిన తెదేపా నాయకులు, కార్యకర్తలతో పాత బస్టాండు రోడ్డు కిక్కిరిసింది. మంత్రి బీసీ మాట్లాడుతూ డోన్‌ నియోజకవర్గ తెదేపా నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలకడం అభినందనీయమన్నారు. తెదేపా యువ నాయకులు మన్నె గౌతంరెడ్డి, ఎల్ల నాగయ్య, పోలూరు రాఘవరెడ్డి, ఉన్నం చంద్రశేఖర్, విజేయుడు, సుధాకర్, మాదినేని నారాయణస్వామి, రమేష్, లోకేశ్‌ గౌడ్, ఉపేంద్ర, పోలూరు కిషోర్‌ పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని