logo

వైకాపాకు వంతపాడారు

సార్వత్రిక ఎన్నికల్లో కొందరు అధికారులు వైకాపాకు లాభం చేకూర్చేలా వ్యవహరించారు.. అలాంటి వారిపై ఫిర్యాదులు వెల్లువెత్తినా సంబంధిత శాఖల ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వివాదాస్పదంగా మారింది.

Published : 17 Jun 2024 02:18 IST

జల వనరుల సర్కిల్‌ ఎస్‌ఈపై ఫిర్యాదు
విచారణకు ఉన్నతాధికారుల నిర్లక్ష్యం

ఈనాడు, కర్నూలు: సార్వత్రిక ఎన్నికల్లో కొందరు అధికారులు వైకాపాకు లాభం చేకూర్చేలా వ్యవహరించారు.. అలాంటి వారిపై ఫిర్యాదులు వెల్లువెత్తినా సంబంధిత శాఖల ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వివాదాస్పదంగా మారింది. జలవనరుల శాఖలో కర్నూలు జిల్లా ఇరిగేషన్‌ సర్కిల్‌ ఎస్‌ఈగా విధులు నిర్వర్తిస్తున్న రెడ్డి శేఖర్‌రెడ్డి వైకాపాకు అనుకూలంగా వ్యవహరించారన్న ఫిర్యాదుపై విచారణే చేపట్టలేదని తెలుస్తోంది. రెడ్డి శేఖర్‌రెడ్డి తీరుపై జి.సుధాకర్‌ యాదవ్‌ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి (సీఈవో) ఏప్రిల్‌ 22న మెయిల్‌ చేశారు. ఆ ఫిర్యాదును మే 3న రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కర్నూలు జిల్లా కలెక్టర్‌కు పంపారు. దానిపై విచారించి తగిన చర్యలు తీసుకోవాలని, ఆ నివేదికను తనకు పంపాలని జిల్లా కలెక్టర్‌ డా.జి.సృజన జలవనరుల శాఖ సీఈ కబీర్‌ బాషాకు పంపారు. రెడ్డి శేఖర్‌రెడ్డి ఎస్‌ఈ హోదాలో ఉన్న నేపథ్యంలో సాంకేతికంగా ఆ ఫిర్యాదుపై తాను విచారించలేనని, రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆ మేరకు ఫిర్యాదును జలవనరుల శాఖలోని రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులకు పంపారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ‘మోస్ట్‌ ఇంపార్టెంట్‌’ అని ఆ ఫిర్యాదుపై పెద్ద అక్షరాలతో నోట్‌ పెట్టి.. దాని తీవ్రతను వివరించి.. చర్యలు తీసుకోవాలని ఆదేశించినా ఉన్నతాధికారులు స్పందించకపోవడం గమనార్హం.

వైకాపా నేతలతో సత్సంబంధాలు

రెడ్డి శేఖర్‌రెడ్డి వైఎస్సార్‌ జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని చక్రాయపేట మండలానికి చెందినవారు.. ఆయనకు చాలా మంది వైకాపా నాయకులతో సంబంధాలున్నాయని సుధాకర్‌ యాదవ్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ అండదండలతోనే ఆయన కీలకమైన ఎస్‌ఈ పోస్టు కూడా దక్కించుకున్నారని ఆరోపించారు. ఇరిగేషన్‌ సర్కిల్‌ కార్యాలయాన్ని వైకాపా కార్యాలయంగా మార్చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన పరిధిలో పని చేస్తున్న పలువురికి ఎన్నికల విధులు అప్పగించిన నేపథ్యంలో వారిని వైకాపాకు అనుకూలంగా వ్యవహరించేలా ప్రభావితం చేశారని ఆరోపించారు. కర్నూలు,  జిల్లాలతోపాటు వైఎస్సార్‌ జిల్లాలోనూ కొందరిని వైకాపాకు అనుకూలంగా మార్చేందుకు ప్రయత్నించారని ఫిర్యాదులో వివరించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని