logo

త్యాగాలకు ప్రతీక బక్రీద్‌

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈదుల్‌ అజ్‌హా (బక్రీద్‌) పర్వదినం నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈద్గాలు, మసీదులను ప్రార్థనలకు సిద్ధం చేశారు. రాష్ట్రంలోనే అత్యధిక ముస్లిం జనాభా ఉన్న ఉమ్మడి జిల్లా కర్నూలు. ఇక్కడ 6.70 లక్షల మంది ఉన్నారు.

Published : 17 Jun 2024 02:24 IST

ఉమ్మడి జిల్లా నుంచి 504 మంది హాజ్‌కు పయనం
న్యూస్‌టుడే, ఆళ్లగడ్డ, రైతునగరం(నంద్యాల)

నంద్యాలలో ఈద్గాను శుభ్రం చేస్తున్న సిబ్బంది

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈదుల్‌ అజ్‌హా (బక్రీద్‌) పర్వదినం నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈద్గాలు, మసీదులను ప్రార్థనలకు సిద్ధం చేశారు. రాష్ట్రంలోనే అత్యధిక ముస్లిం జనాభా ఉన్న ఉమ్మడి జిల్లా కర్నూలు. ఇక్కడ 6.70 లక్షల మంది ఉన్నారు. ఈ నెలలోనే ముస్లింలు పవిత్రహాజ్‌యాత్రకు వెళ్తారు. ఈ ఏడాది రాష్ట్రం నుంచి 2902 మంది పయనమవ్వగా, ఉమ్మడి కర్నూలు నుంచే 504 మంది పవిత్ర యాత్రకు వెళ్లారు. ముస్లింలు ఘనంగా చేసుకునే పండగలు రెండే రెండు కాగా, ఒకటి రంజాన్, రెండోది బక్రీద్‌. సోమవారం బక్రీద్‌ పండగను జిల్లా వ్యాప్తంగా ముస్లింలు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఈ పండగ త్యాగానికి ప్రతిరూపం.

ఖుర్బానీ, ప్రార్థనలే కాదు..

ఖుర్బానీ అంటే ఇష్టమైన దానిని త్యాగం చేయడం. బక్రీద్‌ పండగ అంటే కొత్త దుస్తులు ధరించి, ఈద్గాకు వెళ్లి ప్రార్థనలు చేసి, ఇంటికి వచ్చి ఖుర్బానీ ఇచ్చి వండుకొని తినడం మాత్రమే కాదు. దేవుడి మార్గంలో నడవడం ఎంత ముఖ్యమో ఈ పండగ తెలియ జేస్తుంది. సమాజం పట్ల బాధ్యతను, తల్లిదండ్రులు, బంధువులతో మెలగాల్సిన విధానాన్ని ఇది బోధిస్తుంది. దేవుడి కోసం ప్రతి ఒక్కరూ తమ ప్రియమైన వాటిని త్యాగం చేయాలన్న పరమార్థాన్ని బక్రీద్‌ చాటిచెబుతోంది.

త్యాగాలకు సిద్ధం కావాలి

ఇస్లాం ధర్మం ప్రకారం ప్రతి మనిషి పుట్టినప్పటినుంచి మరణించే వరకు దైవాజ్ఞల మేరకే జీవనాన్ని సాగించాలి. సన్మార్గంలో నడించేందుకు త్యాగాలు చేసేందుకు సిద్ధపడాలి. ఇస్లాం ధర్మానికి మూలస్తంభాలు కలిమా(విశ్వాసం), నమాజు, రోజా, జకాత్, హజ్‌. ఈ ఐదింటిని ఎవరైతే పాటిస్తారో వారు ఇహపరలోకాల్లో విజయం సాధిస్తారని ఖురాన్‌ చెబుతోంది.


ఖుర్బానీ అంటే త్యాగమని అర్థం

- హాజీ జాఫర్‌ సాదిక్, పేష్‌ఇమామ్, జామియా మసీదు, ఆళ్లగడ్డ

ఖుర్బానీ అంటే ఏదో జంతువును జుబా చేయడం కాదు. ఖుర్బానీ అంటే దైవమార్గంలో ఎదురయ్యే అడ్డకుంలను అధిగమించేందుకు మన డబ్బు, సమయం, ఇతర ఆకర్షణలను త్యాగం చేయడం. మనిషి మనసు చెప్పినట్లు కాకుండా దైవం, ప్రవక్తలు చెప్పినట్లు నడుచుకోవాలి. ఈ క్రమంలో కొన్నింటిని ఖుర్బానీ(త్యాగం) చేయాల్సి వస్తుంది. వెనక్కి తగ్గకుండా ముందుకు సాగితే కచ్చితంగా అల్లాహ్‌ కారుణ్యం మనల్ని  కాపాడుతుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని