logo

చంద్రబాబు పాలన స్వర్ణయుగమే

ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన స్వర్ణయుగంలా ఉంటుందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం బనగానపల్లిలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

Published : 17 Jun 2024 02:26 IST

మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి

మంత్రి బీసీ దంపతులను సన్మానిస్తున్న పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత దంపతులు

బనగానపల్లి, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన స్వర్ణయుగంలా ఉంటుందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం బనగానపల్లిలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇచ్చిన మాట ప్రకారం డీఎస్సీ, ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం రద్దు, పింఛన్ల పెంపు తదితర వాటిపైన ముఖ్యమంత్రి చంద్రబాబు సంతకాలు చేసి విశ్వసనీయతను చాటుకున్నారన్నారు. వచ్చే అయిదేళ్లల్లో నిరుద్యోగులకు ఇచ్చిన హామీ ప్రకారం 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తారని తెలిపారు. గత ఐదేళ్ల వైకాపా రాక్షస పాలనను అంతం చేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. అన్ని వర్గాలకు సమన్యాయం చేసే బాధ్యతను ఎన్డీఏ సర్కారు తీసుకుంటుందన్నారు. ఏటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామని చెప్పిన జగన్‌మోహన్‌రెడ్డి మాట తప్పారని అన్నారు. త్వరలోనే 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చంద్రబాబు అన్ని చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. నిరుద్యోగుల ఆకాం్క్షలు నెరవేర్చే సత్తా చంద్రబాబుకు ఒక్కరికే ఉందన్నారు. వైకాపా ప్రభుత్వం మాదిరిగా మోసపూరిత మాటలు చెప్పలేదని, అధికారంలోకి వచ్చిన వెంటనే అయిదింటిపైన సంతకం చేసిన చంద్రబాబును అభినందించాలని అన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకొని ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని అన్నారు. ఎంతో నమ్మకంతో ప్రజలు భారీ మెజార్టీ ఇచ్చారని, అందుకు అనుగుణంగా ముందుకు వెళ్తామని మంత్రి బీసీ వెల్లడించారు.

మంత్రి బీసీకి అభినందనల వెల్లువ

బనగానపల్లి, న్యూస్‌టుడే: రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డిని ఆదివారం పలువురు కలసి అభినందనలు తెలిపారు. మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, సతీమణి ఇందిరమ్మలను పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, భర్త గౌరు వెంకటరెడ్డి సన్మానించారు. తెదేపా జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్‌ బీసీకి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని