logo

బడి బస్సులు భద్రమేనా

పాఠశాలలు పునః ప్రారంభం నేపథ్యంలో బడి బస్సులను తప్పనిసరిగా సామర్థ్య పరీక్షలు చేసుకోవాలని రోడ్డు రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. బస్సులో ప్రయాణించే బడి పిల్లల రక్షణను దృష్టిలో ఉంచుకుని ఆయా పాఠశాలల నిర్వాహకులు తమ బడి బస్సులను కండిషన్‌లో ఉంచాలి.

Updated : 17 Jun 2024 06:38 IST

ఫిట్‌నెస్‌ పరీక్షలకు ముందుకు రాని యాజమాన్యాలు
పిల్లల ప్రయాణం ప్రశ్నార్థకం
ఈనాడు, కర్నూలు, న్యూస్‌టుడే, ఆదోని నేరవార్తలు

ఆదోని ఆర్టీవో కార్యాలయం వద్ద పాఠశాల బస్సు కండిషన్‌ను పరిశీలిస్తున్న ఏఎంవీఐ సుధాకర్‌రెడ్డి

ఈ నెల 10వ తేదీ నాటికి ఉమ్మడి జిల్లాలో వివిధ విద్యా సంస్థలకు చెందిన మొత్తం 428 బస్సులకు సామర్థ్య ధ్రువీకరణ పత్రాలు (ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు) లేవు.

పాఠశాలలు పునః ప్రారంభం నేపథ్యంలో బడి బస్సులను తప్పనిసరిగా సామర్థ్య పరీక్షలు చేసుకోవాలని రోడ్డు రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. బస్సులో ప్రయాణించే బడి పిల్లల రక్షణను దృష్టిలో ఉంచుకుని ఆయా పాఠశాలల నిర్వాహకులు తమ బడి బస్సులను కండిషన్‌లో ఉంచాలి. కొన్ని ప్రైవేటు పాఠశాలలు బస్సులు ఫిట్‌నెస్‌ పరీక్షలు చేయించడంపై దృష్టిసారించడం లేదు. దీంతో విద్యార్థుల క్షేమం ప్రశ్నార్థకంగా మారుతోంది.

ఫిట్‌నెస్‌ అంటే..: ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు బ్రేకులు, లైట్లు, ఇంజిన్‌ తదితర కీలక భాగాల పనితీరును పరీక్షిస్తారు. బస్సులో ప్రథమ చికిత్స కిట్, అగ్నిప్రమాదాలను నివారించే పరికరాలు అందుబాటులో ఉండాలి. బస్సు రిజిస్ట్రేషన్‌ పత్రాలతో పాటు కాలుష్య నియంత్రణ పత్రం, బీమా, వాహన అనుమతి, డ్రైవర్‌ లైసెన్స్‌ తదితర పత్రాలన్నీ పరిశీలిస్తారు. 15 ఏళ్లు దాటిన బస్సులను ఎట్టి పరిస్థితిలోనూ విద్యా సంస్థలు వినియోగించరాదు.

నాటి ప్రభుత్వ సభలకు..

వైకాపా ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేటు విద్యాసంస్థల బస్సులను కూడా ఇష్టారాజ్యంగా వినియోగించారు. జిల్లాలో ముఖ్యమంత్రి సభలు నిర్వహించినపుడు, వైకాపా తరఫున ఎలాంటి భారీ కార్యక్రమాలు నిర్వహించినా.. విద్యా సంస్థల నుంచి పెద్ద సంఖ్యలో బస్సులు తీసుకెళ్లడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో రవాణా శాఖ అధికారులు విద్యాసంస్థల యాజమాన్యాలను గట్టిగా హెచ్చరించలేని పరిస్థితి నెలకొంది. ఇదే అదునుగా విద్యా సంస్థలవారు బస్సుల ఎఫ్‌సీలను పునరుద్ధరించుకోకుండా వదిలేశారు.


ఇవీ నిబంధనలు

బస్సుకు అద్దాలు, వాటికి గ్రిల్‌ ఏర్పాటు చేసుకోవాలి
డ్రైవరు పూర్తి వివరాలు, అతడి డ్రైవింగ్‌ లైసెన్సు చూడాలి.
బస్సు బ్రేక్‌ కండిషన్‌ ఎప్పటికప్పుడు డ్రైవరు చూసుకోవాలి.
బస్సులో హ్యాండ్‌ బ్రేకర్‌ ఉండేలా చూడాలి.
ఏ బస్సు ఏదారిలో వెళ్తుందో ఆ రూటు వివరాలు పొందుపరచాలి.
రాత్రి సమయాల్లో  లైట్లు బాగా వెలగాలి.
తప్పనిసరిగా రేడియం స్టిక్కర్లు అతికించాలి.
 బస్సు టైర్లు, వాటిలో గాలి ఎంత ఉండాలో డ్రైవర్‌ రోజూ చూసుకోవాలి.
ప్రధానంగా బస్సులో అత్యవసర ద్వారం (ఎమర్జెన్సీ డోర్‌) తెరిచేలా ఉండాలి.
బస్సులో అగ్నిప్రమాదాల నివారణకు సంబంధించి మంటలు ఆర్పే యంత్రం ఉంచాలి.
విద్యార్థులు కూర్చొనే సీట్లు ఊగకుండా ఉండాలి.
బస్సుకు తప్పనిసరిగా పసుపు రంగు ఉండాలి. 


కఠిన చర్యలు తీసుకుంటాం

- శ్రీధర్, డీటీసీ, కర్నూలు

విద్యా సంస్థల బస్సులను ఫిట్‌నెస్‌ ధ్రువపతాలు లేకుండా నడిపితే కఠిన చర్యలు తీసుకుంటాం. కర్నూలు జిల్లాలో నాలుగు రోజుల్లో సుమారు 100 బస్సుల వరకు సామర్థ్య పరీక్షలు చేశాం. మరో వంద వాహనాలకు ఎఫ్‌సీ జారీ చేయాల్సి ఉంది. 15 ఏళ్లు దాటిన బస్సులను ఎఫ్‌సీల కోసం తీసుకురాలేదు.


నిబంధనలు పాటించాలి

- శిశిరదీప్తి, ఆదోని మోటర్‌ వెహికల్‌ అధికారిణి, ఆదోని

ఆదోని ఆర్టీవో కార్యాలయ పరిధిలో ఇప్పటి వరకు 90 దాకా బస్సులకు పరీక్షలు నిర్వహించాం. నిబంధనలు పాటించని బస్సులను వెనక్కు పంపిస్తున్నాం. పాఠశాలల బస్సులకు సామర్థ్య పరీక్షలు పూర్తయిన తర్వాతే విద్యార్థులను బస్సుల్లో తిప్పాలి. అనుమతులు లేకుండా తిప్పితే సీజ్‌ చేస్తాం. అనుభవం ఉన్న బస్సు డ్రైవరునే నియమించుకోవాలి. వారికి కంటి చూపు పరీక్షలు నిర్వహించాలి.. బడి పిల్లల సంరక్షణే మా ప్రధాన బాధ్యత.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని